ప్రభుత్వ ప్రాధాన్యతలే లక్ష్యంగా..
ABN , Publish Date - Sep 13 , 2026 | 03:07 AM
ప్రభుత్వ ప్రాధాన్యతలే తనవిగా, ఆయా పథకాల లక్ష్యాల సాధన, ప్రజలకు చేరువయ్యేలా ప్రత్యేక కార్యక్రమాల ద్వారా కలెక్టర్‌గా జిల్లాలో ఏడాది బాధ్యతలను రాజాబాబు పూర్తిచేసుకున్నారు. ఈ ఏడాది కాలంలో అనేక అంశాలపై ప్రత్యేక దృష్టితో పనిచేసిన ఆయన క్షేత్రస్థాయికి తాను వెళ్లడం, యంత్రాంగాన్ని నడిపించడంతోపాటు వివిధ అంశాల్లో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నించారు.
జిల్లావ్యాప్తంగా ప్రత్యేక గ్రీవెన్స్‌లు
ప్రజలకు చేరువయ్యేలా పల్లెనిద్ర
క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరు పరిశీలన
పెట్టుబడులే లక్ష్యంగా బిజినెస్ ఎలైట్ నిర్వహణ
తాజాగా గ్రీన్‌గోల్డ్ నిర్వహణపై సీఎం ప్రశంస
కలెక్టర్‌గా ఏడాది పూర్తిచేసుకున్న రాజాబాబు
ఒంగోలు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ప్రాధాన్యతలే తనవిగా, ఆయా పథకాల లక్ష్యాల సాధన, ప్రజలకు చేరువయ్యేలా ప్రత్యేక కార్యక్రమాల ద్వారా కలెక్టర్‌గా జిల్లాలో ఏడాది బాధ్యతలను రాజాబాబు పూర్తిచేసుకున్నారు. ఈ ఏడాది కాలంలో అనేక అంశాలపై ప్రత్యేక దృష్టితో పనిచేసిన ఆయన క్షేత్రస్థాయికి తాను వెళ్లడం, యంత్రాంగాన్ని నడిపించడంతోపాటు వివిధ అంశాల్లో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నించారు. 2025 సెప్టెంబరు 13న రాజాబాబు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. డిసెంబరు 1న మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పడింది. ఆ జిల్లాకు కొంతకాలం తొలి ఇన్‌చార్జి కలెక్టర్‌గా కూడా వ్యవహరించారు. అలా ఏకకాలంలో రెండు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసే అరుదైన అవకాశం ఆయనకు లభించింది. కాగా ఈ ఏడాది కాలంలో రాజాబాబు పనితీరును పరిశీలిస్తే.. జిల్లాస్థాయిలో యంత్రాంగాన్ని పనిచేయించడం, ప్రజాప్రతినిధులతో సమన్వయంతో సాగడంలో తనదైన శైలిలో ముందుకు సాగుతూ వచ్చారు. క్రమం తప్పకుండా జిల్లాస్థాయిలో వారంవారం ప్రజా సమస్యల పరిష్కారం వ్యవస్థ (మీకోసం) నిర్వహణ, ఆపై ఆయా నియోజకవర్గ స్థాయిలో వివిధ మండల కేంద్రాల్లో ప్రత్యేక గ్రీవెన్స్‌లు, జిల్లా స్థాయిలో ఎస్సీ, ఎస్టీల కోసం ఉద్యోగుల కోసం గ్రీవెన్స్ నిర్వహణలతోపాటు ఆ సందర్భంగా వచ్చే వినతుల పరిష్కారంపై నిరంతరం సమీక్షలు కొనసాగించారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన
క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరు పరిశీలన కోసం పల్లెనిద్ర కార్యక్రమాన్ని కలెక్టర్ రాజాబాబు విస్తృతంగా నిర్వహించారు. తనతోపాటు కీలక అధికారుల బృందాన్ని గ్రామాలకు తీసుకెళ్లి సమస్యలు పరిశీలించారు. రాత్రిపూట వారితో సమావేశమై చర్చించి పరిష్కారం, రాత్రికి అక్కడే బసచేసి తిరిగి మరుసటిరోజు ఉదయం గ్రామంల్లో అమలు జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులు పరిశీలించి లోటుపాట్లను గుర్తించి తగిన చర్యలు తీసుకున్నారు. భూ సమస్యలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన గ్రామాల్లో రెవెన్యూ గ్రామసభలతోపాటు పల్లె వీక్షణ పేరుతో గ్రామస్థాయిలో గ్రీవెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ఇక జిల్లావ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం జలధార-జలహారతి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్దేశించగా దాని అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉపాధి పథకం కింద రూ.34 కోట్లకుపైగా నిధులతో ఇంచుమించు 2.5వేల పనులు తొలిదశలో చేపట్టి నీటి వనరులను అభివృద్ధి చేయడంలో చొరవ చూపారు. రెండో దశ పనులు సాగుతున్నాయి.
బిజినెస్ ఎలైట్‌తో ముందుకు
తీర ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి, దొనకొండ, ఇతర ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి గతంలో ఉన్న ప్రతిపాదనలు కదిలించడం, తాజా పరిస్థితులకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు రూపొందించడంపై రాజాబాబు దృష్టిసారించారు. ఈక్రమంలో బిజినెస్ ఎలైట్ పేరుతో ఈఏడాది జూన్ 22న ఒంగోలులో భారీ సదస్సు నిర్వహించారు. సుమారు రూ.863 కోట్లతో 2,600మందికిపైగా ఉపాధి కల్పన జరిగే ఒప్పందాలు సాధించారు. స్థానికుల సహకారంతో పాకలలో బీచ్‌ఫెస్టివల్ నిర్వహణ, తాజాగా ఒంగోలులో గ్రీన్‌గోల్డ్ పేరుతో వేస్ట్ నుంచి వేల్త్ కార్యక్రమంపై సీఎం నుంచి ప్రశంసలు అందుకున్నారు. జిల్లాలో సర్ కార్యక్రమంలో ఆరోపణలు రాకుండా నిర్వహించడంలో సక్సెస్ అవడంతోపాటు ఈ ప్రక్రియలో బెస్ట్ ఎలకో్ట్రరల్ ప్రాక్టీసెస్ అవార్డును ఎస్‌ఈసీ నుంచి, అలాగే పశ్చిమప్రాంతంలో వాటర్‌షెడ్ అమలుపై కేంద్రం నుంచి అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఒంగోలు కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్‌గా హోదాలో ఒంగోలు 150 ఏళ్ల ఉత్సవాలపై దృష్టి సారించారు.
అసంతృప్తి, ప్రతికూలతలు కూడా..
ఈ ఏడాది కాలంలో కలెక్టర్ రాజాబాబు వివిధ సందర్భాలలో తన నిర్ణయాలు, పని విధానంలో అఽధికారపార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధుల నుంచి అసంతృప్తిని, ప్రతికూలతను కూడా ఎదుర్కొన్నారు. వివిధ అంశాలలో ఆయన జోక్యం, పనితీరు పట్ల కొందరు ప్రజాప్రతినిధులు అసంతృప్తి చెందడం, కొన్ని అంశాలను సీఎంవో వరకు తీసుకెళ్లడం జరిగింది. జిల్లాస్థాయిలో కొందరు అధికారులకే ఆయన ప్రాధాన్యం ఇచ్చి కోవర్టుగా నడిపిస్తున్నారన్న చర్చ ఇటు అధికార, రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఈ విషయంలో పలు విమర్శలు, ఆరోపణలు కూడా వస్తున్నాయి. పలు ప్రభుత్వ పథకాల అమలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కన్నా పురోగతి తక్కువగా ఉండటం, ప్రజల సమస్యలు, వినతుల పరిష్కారం ఆశించిన విధంగా లేకపోవడం, జిల్లాలో భూసమస్యలు పరిష్కారం ముందుకు సాగకపోవడం వంటి పలు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఏడాది పాలన పూర్తిచేసుకున్న కలెక్టర్ తదుపరి కాలంలో ఈ లోటుపాట్ల సవరణపై దృష్టిపెట్టాల్సి అవసరం ఉంది.