Share News

సమన్వయంతో ఎలాంటి ససమస్యనైనా ఎదుర్కోవచ్చు

ABN , Publish Date - Jan 22 , 2026 | 02:46 AM

సమన్వయం, సత్వర స్పందనతో ఎలాంటి సమస్యనైనా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి అన్నారు. మొంథా తుఫాన్‌ సమయంలో ప్రాణనష్టం వాటిల్లకుండా జిల్లా యంత్రాం గం స్పందించిన తీరే అందుకు నిదర్శనమన్నారు.

సమన్వయంతో ఎలాంటి ససమస్యనైనా ఎదుర్కోవచ్చు
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి స్వామి, పక్కన ఎమ్మెల్యేలు దామచర్ల, బీఎన్‌, కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జేసీ గోపాలకృష్ణ

మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి

ఒంగోలు కలెక్టరేట్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : సమన్వయం, సత్వర స్పందనతో ఎలాంటి సమస్యనైనా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి అన్నారు. మొంథా తుఫాన్‌ సమయంలో ప్రాణనష్టం వాటిల్లకుండా జిల్లా యంత్రాం గం స్పందించిన తీరే అందుకు నిదర్శనమన్నారు. తుఫాన్‌ సమయంలో ఎదురైన పరిస్థితులు, వాటిని అధిగమించిన అనుభవాలను కలెక్టర్‌ పి.రాజాబాబు డాక్యుమెంటేషన్‌ చేయించారు. ఆ పుస్తకాన్ని స్థానిక కలెక్టరేట్‌లోని మీకోసం హాలులో బుధవారం రాత్రి ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌ విజయకుమార్‌, మేయర్‌ గంగాడ సుజాత, ఒడా చైర్మన్‌ షేక్‌ రియాజ్‌తో కలిసి మంత్రి స్వామి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తుఫాన్‌ సమయంలో అటు చంద్రబాబు దిశానిర్దేశం, ఇటు కలెక్టర్‌ సూచనలతో ప్రాణ, అస్తి నష్టాన్ని అధికారులు తగ్గించగలిగారన్నారు. జిల్లా చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న అనుభవాలను పుస్తకం రూపంలో అందుబాటులో ఉంచడం భావితరాలకు మార్గనిర్దేశంగా ఉంటుందన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం ద్వారా మొంథా తుఫాన్‌ ఇబ్బందులను సత్వరమే తొలగించగలిగామన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ మాట్లాడుతూ తుఫాన్‌ అతితీవ్రమైనప్పటికీ దాని వల్ల కలిగే నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించగలిగామన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు చరిత్రలోనే గరిష్ఠ స్థాయిలో వరద వచ్చినా సమర్థవంతంగా నియంత్రించడం గొప్ప విషయమన్నారు. కలెక్టర్‌ రాజాబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సమస్య ఉన్న ప్రాంతాన్ని జియో కో ఆర్డినేట్స్‌ ఆధారంగా గుర్తించి ఫొటోలు, వీడియోలతో డాక్యుమెంటేషన్‌ చేయించానని తెలిపారు. ఈ పుస్తకం భవిష్యత్‌లో విపత్తులను ఎదుర్కోవడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎస్పీ హర్షవర్థన్‌ రాజు మాట్లాడుతూ విపత్తులను ఎదుర్కోవడంలో అనుభశాలను క్రోడీకరించి పుస్తకరూపంలో తీసుకురావడం ఇదే మొదటి సారి కావచ్చని తెలిపారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డీఆర్వో చినఓబులేశు, మార్కాపురం జేసీ శ్రీనివాసరావు, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ హిమవంశీ, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి స్వామి, శాసనసభ్యులు, అధికారులు పరిశీలించారు.

Updated Date - Jan 22 , 2026 | 02:47 AM