Share News

ఆకాంక్ష నెరవేరింది!

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:24 PM

కందుకూరు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువనేత లోకేష్‌ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కందుకూరును ప్రకాశం జిల్లాలో చేరుస్తూ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర కానుకను అందించారు.

ఆకాంక్ష నెరవేరింది!

మూడున్నరేళ్ల తర్వాత తిరిగి ప్రకాశంలోకి కందుకూరు

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రజాప్రభుత్వం

ఆనందోత్సాహాల్లో ప్రజలు

కందుకూరు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : కందుకూరు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువనేత లోకేష్‌ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కందుకూరును ప్రకాశం జిల్లాలో చేరుస్తూ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర కానుకను అందించారు. మూడున్నరేళ్ల నిరీక్షణ తర్వాత తిరిగి సొంత ఇంటికి చేరామన్న ఆనందంతో ప్రజలు ఎంతో ఉత్సాహంతో నూతన సంవత్సర వేడుకల్లో పాలుపంచుకున్నారు. 2022 ఏప్రిల్‌ 4న కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతూ అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకొంది. కందుకూరుకు కేవలం 45 కి.మీ దూరంలో ఉన్న ఒంగోలును కాదని 125 కి.మీ దూరంలో ఉన్న నెల్లూరు జిల్లాలో కలపడం ఏమాత్రం ఆమోదనీయం కాదని ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. తీవ్రస్థాయిలో నిరసించారు. పార్టీలు, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు వివిధరూపాల్లో ఆందోళనలు చేశారు. అదేమీ పట్టించుకోకుండా జగన్‌ ప్రభుత్వం నిరంకుశంగా కందుకూరును నె ల్లూరులో కలిపేసింది.

చంద్రబాబు, లోకేష్‌ హామీ

యువగళం పాదయాత్రలో భాగంగా కందుకూరు నియోజకవర్గానికి వచ్చిన యువనేత లోకేష్‌ నియోజకవర్గ ప్రజల బలమైన ఆకాంక్షను గుర్తించి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపడం మా బాధ్యత అని స్పష్టమైన హామీ ఇచ్చారు. జగన్‌ నియంతృత్వ పోకడపై రగిలిపోతున్న ప్రజలు చంద్రబాబు హామీతో గత ఎన్నికల్లో పెద్దఎత్తున టీడీపీకి మద్దతు ప్రకటించారు. నియోజకవర్గ చరిత్రలో ఎన్న డూ రాని భారీ ఆధి క్యం ఎమ్మెల్యే ఇం టూరికి లభించడంలో ఈ హామీ కూడా దోహదం చేసింది. ఇచ్చి న హామీని నిలబెట్టుకుని కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేయడంతోపాటు జనవరి 1 నుంచి అమల్లోకి తేవడంతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఒత్తిళ్లు వచ్చినా మాటకు కట్టుబడి

కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశంలో కలిపే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై పలువిధాల ఒత్తిళ్లు వచ్చాయి. అయినప్పటికీ ఆయన ఇచ్చిన మాటకే కట్టుబడి కందుకూరును ప్రకాశం జిల్లాలో విలీనం చేయించినట్లు సమాచారం. రామాయపట్నం పోర్టు, ఇండోసోల్‌ సోలార్‌ కంపెనీ లాంటి భారీ పరిశ్రమలు కందుకూరు నియోజకవర్గంలో స్థాపించబడుతున్నాయి. ఈనేపథ్యంలో కందుకూరును నెల్లూరులోనే కొనసాగించేలా చూడాలన్న లక్ష్యంతో ఆ జిల్లా ముఖ్యనేతలు గట్టి ప్రయత్నాలే చేశారు. ఒక దశలో కందుకూరును నెల్లూరులోనే కొనసాగించబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ దశలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కలెక్టరును కలిసి ప్రజల ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. యువనేత నారా లోకేష్‌, పునర్విభజన కమిటీలో ఉన్న మంత్రులతోనూ కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపకుంటే తీవ్రవ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తుందని తెలియజేశారు. ఇచ్చిన మాటకే కట్టుబడి కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేయడంతో కందుకూరు ప్రజల ఆకాంక్ష నెరవేరింది.


జగన్‌ నిర్ణయంతో కందుకూరుకు పూడ్చలేని నష్టం

వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న నిర్ణయంతో కందుకూరుకు పూడ్చలేని నష్టం జరిగింది. ప్రజల ఆకాంక్ష మేరకు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో చేర్చడం వరకు టీడీపీ ప్రభుత్వం చేయగలిగింది. జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసే సమయానికి 24 మండలాలతో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా విరాజిల్లిన కందుకూరు.. ఆతర్వాత కేవలం ఏడు మండలాలకు పరిమితమైంది. అప్పట్లో కందుకూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలతోపాటు ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు, కొండాపురంలను చేర్చి ఏడు మండలాలకు పరిమితం చేశారు. ప్రస్తుతం వరికుంటపాడు, కొండాపురం మండలాలను తొలగించి పొన్నలూరు, మర్రిపూడి మండలాలను చేర్చారు. పునర్విభన తర్వాత కందుకూరు నుంచి పంచాయతీరాజ్‌ ఈఈ, ఆర్‌అండ్‌బీ డీఈఈ, ఉద్యానశాఖ ఏడీ తదితర కార్యాలయాలు తరలిపోయాయి. అలాగే మరికొన్ని డివిజన్‌స్థాయి కార్యాలయాలన్నీ రద్దయ్యాయి. అవన్నీ పునరుద్ధరణ జరిగే అవకాశం ఇక లేనట్లేనని, పునర్విభన పేరుతో వైసీపీ ప్రభుత్వం కందుకూరుకు తీరని ద్రోహం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Jan 01 , 2026 | 11:24 PM