గాలివాన బీభత్సం
ABN , Publish Date - Apr 29 , 2026 | 03:11 AM
జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. అన్నిప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ వృక్షాలు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి.
వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు ఇద్దరు,
షెడ్ కూలి ఒకరు మృతి.. మరొకరికి గాయాలు
కూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లు
బురుజుపల్లెలో చింతచెట్టు పడి పాడిగేదె మృతి
మార్కాపురం రూరల్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. అన్నిప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ వృక్షాలు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. పిడుగుపాటుకు మార్కాపురం రూరల్ మండలం బోడపాడులో ఒంటేరు పుల్లమ్మ (47) మృతి చెందారు. పుల్లమ్మ తన భర్త కొండయ్య, మరో మహిళ పాసాని రంగలక్ష్మమ్మతో కలిసి పొలం పనులుకు వెళ్లారు. గాలివానతో భారీ వర్షం పడుతుండగా ఇంటికి వస్తున్న సమయంలో పిడుగు పడి పుల్లమ్మ మృతి చెందారు. పోసాని రంగలక్ష్మమ్మకు తీవ్రగాయాలయ్యాయి. బోడపాడు గ్రామ సమీపం పెద్దయాచవరం రోడ్డులోని ఎస్సీ కాలనీలో కోళ్లఫారం షెడ్ కూలి చింతగుంట్ల కుమారి తీవ్రంగా గాయపడి మృతి చెందింది. పుల్లమ్మకు భర్త కొండయ్య, కుమారుడు ఉండగా, కుమారికి భర్త ఇసాక్, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రూరల్ ఎస్‌ఐ వేమన గ్రామానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా అకాల వర్షం వలన పండ్ల తోటలకు కొంత నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఉన్న మిర్చి, మొక్కజొన్న తడిసిపోయాయి. పెనుగాలులకు గ్రామీణ ప్రాంతాల్లోనూ చెట్లు నేలకొరిగాయి.
కూలిన స్తంభాలు
మార్కాపురం రూరల్ : ఈదురుగాలులు, భారీ వర్షానికి చెట్లు నేలకూలాయి. కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. మార్కాపురం పట్టణంలోని కాలేజీరోడ్డులో ఉన్న సెవెన్‌హిల్స్ లాడ్జి సెంటర్‌లో స్తంభం కూలిపోయింది. మార్కాపురం నుంచి బోడపాడు వెళ్లే రోడ్డులో భారీ వృక్షం నేలకొరిగింది. ఎస్టేట్ వీధిలో ఇళ్ల మధ్య స్తంభం పడిపోయింది. స్థానికులు అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. వెంటనే మునిసిపల్ సిబ్బంది స్తంభాన్ని, చెట్లను తొలగించి వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
గంటాపురంలో..
బేస్తవారపేట : బేస్తవారపేట మండలం గంటాపురం గ్రామంలో మొక్కజొన్న కంకులు గ్రేడింగ్ చేసేందుకు వెళ్లిన డోలా శోభారాణి (35) పిడుగుపాటుకు మృతి చెందారు. మంగవారం సాయంత్రం కురిసిన వర్షానికి అక్కడ పనిచేస్తున్న సుమారు పదిమంది కూలీలు సమీపంలోని చెట్ల కిందకు వెళ్లారు. దగ్గరలో పిడుగు పడడంతో శోభారాణి స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆమెను కంభం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గిద్దలూరులో..
గిద్దలూరు టౌన్: గిద్దలూరు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం బలమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు గంటసేపు బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాలలో చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. గిద్దలూరు మండలంలోని బురుజుపల్లె, వెంకటాపురం, కొత్తకోట, దిగువమెట్ట, తదితర ప్రాంతాలలో ఈదురు గాలుల వలన చెట్లు, స్తంభాలు నెలకొరగడంతో ఆయా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బురుజుపల్లెలో గాలులకు చింతచెట్టు కూలి పడి బొగ్గుల నర్సిరెడ్డికి చెందిన గేదె మృతిచెందింది. దీని విలువ సుమారు రూ.1.50లక్షలు ఉంటుందని బాధితుడు వాపోయారు.