సీజన్ ముగిసినా కదలికేదీ?
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:37 AM
పంటల సాగు సీజన్ ముగిసి అమ్మకాల సీజన్ కొనసాగుతున్నా రైతులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ మూడో విడత నిధుల జాడలేదు. ఈ పథకం కింద సాయాన్ని ఏటా మూడు విడతలుగా ప్రభుత్వాలు ఇస్తుండగా మూడో విడత సాధారణంగా ఫిబ్రవరి ఆఖరులోపే జమ చేస్తారు.
విడుదల కాని మూడో విడత పీఎం కిసాన్ నిధులు
గత ఏడాది ఫిబ్రవరి 24న విడుదల
ఈ ఏడాది ఇంకా స్పష్టత ఇవ్వని కేంద్రం
అవిరాక రాష్ట్రంలో అన్నదాత సుఖీభవకు బ్రేక్
రెండు పథకాలు ఇస్తే ఉమ్మడి జిల్లా రైతులకు రూ.120 కోట్లు నగదు జమయ్యే అవకాశం
ఒంగోలు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : పంటల సాగు సీజన్ ముగిసి అమ్మకాల సీజన్ కొనసాగుతున్నా రైతులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ మూడో విడత నిధుల జాడలేదు. ఈ పథకం కింద సాయాన్ని ఏటా మూడు విడతలుగా ప్రభుత్వాలు ఇస్తుండగా మూడో విడత సాధారణంగా ఫిబ్రవరి ఆఖరులోపే జమ చేస్తారు. గతేడాది కూడా ఫిబ్రవరి 24న ఇచ్చారు. ఈ ఏడాది మార్చి తొలివారం ముగిసినా నిధులు విడుదల చేయలేదు. ఎప్పుడు ఇస్తారన్న దానిపై కేంద్రం నుంచి స్పష్టత లేదు. పంట సాగు సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా ఒక్కో రైతుకు రూ.6వేల నగదు పీఎం కిసాన్ పేరుతో ఇస్తోంది. ఆ మొత్తాన్ని మూడు విడతలుగా ఒక్కో దఫా రూ.2వేల వంతున విడుదల చేస్తోంది. తొలి విడతను ఖరీఫ్ మధ్యలో, రెండో విడత రబీ మధ్యలో, మూడో విడత ఫిబ్రవరిలో ఇస్తోంది. అలా ఒక్కో విడత పూర్వ జిల్లా రైతులకు రూ.30 కోట్లకుపైగా నగదు పీఎం కిసాన్ పథకం కింద జమ అవుతోంది. దాదాపు లక్షా 60వేల మందికి లబ్ధి చేకూరుతోంది. ప్రస్తుత సీజన్(2025-26)కు సంబంధించి మూడో విడత నగదు పెండింగ్‌లో ఉంది.
అన్నదాత సుఖీభవ రూ.14వేలు
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రస్తుత వ్యవసాయ సీజన్ నుంచి అమలులోకి తెచ్చింది. కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6వేలకు అదనంగా అన్నదాత సుఖీభవ పేరుతో మరో రూ.14వేలు కలిపి ఏటా రూ.20వేలను అన్నదాతకు ఇస్తోంది. కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు విడతలుగా ఈ నగదును అందజేయాలని, కేంద్రం ఏ రోజున పీఎం కిసాన్ నిధులు ఇస్తే అదేరోజున అన్నదాత సుఖీభవ నిధులను జమ చేయాలని నిర్ణయించి అమలు చేస్తోంది. అలా ప్రస్తుత సీజన్‌లో రెండు విడతలు ఒక్కో దఫా రూ.5వేల వంతున ఇచ్చింది. ఈ సీజన్ (2025-26)కు సంబంధించి తొలివిడత పీఎం కిసాన్ నిధులను కేంద్రం 2025 ఆగస్టు 2న ఇవ్వగా అదే రోజున తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులను రాష్ట్రప్రభుత్వం రైతుల ఖాతాలకు జమ చేసింది. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని దర్శి నియోజకవర్గంలోని తూర్పువీరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఆరోజున కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ పథకం ద్వారా పూర్వపు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 1,63,552 మంది రైతులకు రూ. 32.71 కోట్లు, రాష్ట్రప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవ కింద 1,88,056 మందికి రూ.94.30 కోట్లు అందాయి.
కేంద్ర నుంచి కరువైన స్పష్టత
రెండో విడత నిధులను గత ఏడాది నవంబరు 19న ఇచ్చారు. ఆరోజున పీఎం కిసాన్ పథకం ద్వారా 1,58,412 మంది రైతులకు రూ.32.71 కోట్లు, అన్నదాత సుఖీభవ కింద 1,88,056 మందికి రూ.94.30 కోట్లు జమ అయ్యాయి. కేంద్ర, రాష్ట్ర పథకాల నిబంధనలలో తేడాల వల్ల లబ్ధిపొందే రైతుల సంఖ్యలో కొంత వ్యత్యాసం ఉంది. పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.2వేలు, అన్నదాత సుఖీభవ నుంచి రూ.4వేల వంతున ఇంచుమించు రూ.120 కోట్ల వరకు రైతులకు మూడో విడత అందాల్సి ఉంది. గతేడాది ఫిబ్రవరి 24న మూడో విడత నిధులు ఇవ్వగా ఈ ఏడాది అంతకు పక్షంరోజులు దాటినా ఇవ్వలేదు. పంటల సాగు సీజన్ ముగిసినా, మార్చి రెండో వారం వచ్చినా కనీసం మూడో విడత జమ ఎప్పుడన్న విషయంపై కేంద్రం నుంచి స్పష్టత లేదు. కేంద్రం ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడో విడత నిధుల విడుదలను జాప్యం చేస్తోంది. ఆ నిధులు ఎప్పుడు ఇస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు.