ప్రజా సమస్యలపై చర్చ జరిగేనా?
ABN , Publish Date - May 02 , 2026 | 03:11 AM
జిల్లాలో వివిధ వర్గాల ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసే కీలకమైన జిల్లా పరిషత్ సమావేశం ఆ దిశగా సాగుతుందా అన్న ప్రశ్న నెలకొంది. అందుకు ఇంతకు ముందు సమావేశాలు మొక్కుబడిగా సాగడమే కారణం.
నేడు జిల్లా పరిషత్ సమావేశం
ఒంగోలు కలెక్టరేట్, మే 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వివిధ వర్గాల ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసే కీలకమైన జిల్లా పరిషత్ సమావేశం ఆ దిశగా సాగుతుందా అన్న ప్రశ్న నెలకొంది. అందుకు ఇంతకు ముందు సమావేశాలు మొక్కుబడిగా సాగడమే కారణం. శనివారం ఉదయం పదిన్నర గంటలకు స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశపు హాలులో చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరగనుంది. ప్రస్తుత వేసవిలో తాగునీటి సమస్య, రైతులు పండించిన పంట లకు గిట్టుబాటు ధరలతోపాటు ప్రజలకు తక్షణం అవసరమైన ఆయా అంశాలపై చర్చించాల్సి ఉంది. ఈ సమావేశానికి మంత్రులు, మూడు జిల్లాల శాసనసభ్యులతోపాటు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులందరూ హాజరవుతారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు సమావేశంలో ప్రస్తావించి పరిష్కారం పొందేందుకు అవకాశం ఉంటుంది. పది అంశాలను అజెండాలో పొందుప ర్చారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ), పంచాయతీ. ఇంజనీరింగ్, గృహ నిర్మాణం, విద్యుత్, వ్యవసాయ అనుబంధ శాఖలు, విద్య, సంక్షేమ శాఖలపై చర్చ జరగనుంది.