సర్కిళ్ల విభజన జరిగేనా?
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:44 AM
గత వైసీపీ పాలనలో హేతు బద్ధత లేకుండా పోలీస్ సర్కిళ్లను విభజించారు. ప్రస్తుతం ఆప్రభా వం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పడటంతో అద్దంకి, దర్శి నియోజకవర్గాలలోని అన్ని మండలాల పోలీస్‌స్టేషన్‌లు ఒకే సబ్‌డివిజన్ పరిధిలోకి వచ్చాయి. ఇప్పటికే దర్శిలో డీఎస్పీ ఆఫీస్ ఉండటంతో కొత్తగా అద్దంకిలో కార్యాలయం ఏర్పాటు జరిగే అవకాశం ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అద్దంకి అసెంబ్లీ సెగ్మెంట్‌లో మూడు కార్యాలయాలు
దర్శి నియోజకవర్గం మొత్తానికి ఒక్కటే
ఇక్కడ పని తక్కువ.. అక్కడ భారం
అద్దంకి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో హేతు బద్ధత లేకుండా పోలీస్ సర్కిళ్లను విభజించారు. ప్రస్తుతం ఆప్రభా వం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పడటంతో అద్దంకి, దర్శి నియోజకవర్గాలలోని అన్ని మండలాల పోలీస్‌స్టేషన్‌లు ఒకే సబ్‌డివిజన్ పరిధిలోకి వచ్చాయి. ఇప్పటికే దర్శిలో డీఎస్పీ ఆఫీస్ ఉండటంతో కొత్తగా అద్దంకిలో కార్యాలయం ఏర్పాటు జరిగే అవకాశం ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్తగా ఏర్పడ్డ అద్దంకి డివిజన్‌లో మొత్తం 11 పోలీస్‌స్టేషన్‌లు ఉండగా అద్దంకి నియోజకవర్గంలోని ఆరు స్టేషన్‌లు మూడు సర్కిళ్లుగా ఉన్నాయి. అద్దంకి పోలీస్ స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేసి సీఐని ఎస్‌హెచ్‌వోగా నియమించారు. కొరిశపాడు, మేదరమెట్ల, పంగులూరు పోలీస్‌స్టేషన్‌లను అద్దంకి రూరల్ సర్కిల్‌గా చేసి సర్కిల్ కార్యాలయాన్ని అద్దంకి నుంచి మేదరమెట్లకు మార్పుచేశారు. సంతమాగులూరు, బల్లికురవ పోలీస్ స్టేషన్‌లను సంతమాగులూరు సర్కిల్‌గా ఏర్పాటుచేశారు. దర్శి నియోజకవర్గంలో దర్శి సర్కిల్ పరిధిలో ఇప్పటివరకు దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాలు ఉన్నాయి. జిల్లాల విభజన నేపథ్యంలో ఇప్పటివరకు త్రిపురాంతకం సర్కిల్ పరిధిలో ఉన్న కురిచేడు, దొనకొండలను పరిధి మార్పు చేయాల్సి వచ్చింది. ఇప్పటికే దర్శి సర్కిల్‌లో దర్శి మునిసిపాలిటీతోపాటు ఆ మండల పరిధిలోని గ్రామాలు, తాళ్లూరు, ముండ్లమూరు మండలాలు ఉన్నాయి. అదనంగా కురిచేడు, దొనకొండలను చేర్చితే సర్కిల్ పరిధి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో డివిజన్ పరిధిలో ఉన్న నాలుగు సర్కిళ్లకు ఆయా మండలాలను సర్దుబాటు చేస్తారా? లేక యథావిధిగా కొనసాగిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గంలోని సర్కిళ్లకు రెండు, మూడు మండలాలు మాత్రమే ఉండటంతో సీఐలకు పని కూడా అంతంతమాత్రంగానే ఉంది. మొత్తం 11 పోలీస్‌స్టేషన్‌లను నాలుగు సర్కిళ్ల పరిధిలోకి విభజిస్తే పని విభజనకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రస్తుతం ఉన్న విధంగానే కొనసాగిస్తే దర్శి సర్కిల్‌లో పనిభారం మరింత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.