Share News

చెర వీడేనా?

ABN , Publish Date - Jul 26 , 2026 | 03:22 AM

వందెకరాల ప్రభుత్వ భూమి. ఎంతోకాలంగా కబ్జాకు గురైంది. ఆక్రమణదారుల్లో పేదలు కొంతమందే. వారి ముసుగులో పెద్దలే అధికంగా ఉన్నారు. ఐదు, పది ఎకరాల ఇసుక భూమిని తమ పలుకుబడితో ఆక్రమించారు. యథేచ్ఛగా బోర్లు వేసుకుని సాగు చేసుకుంటున్నారు.

చెర వీడేనా?
పాదర్తిలోని ఆక్రమిత భూమిలో సాగు చేసిన పంట

వందెకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ

పేదల ముసుగులో అనర్హులే అధికం

వారిని తొలగించేందుకు నోటీసులు

జారీచేస్తున్న రెవెన్యూ అధికారులు

కబ్జాదారుల్లో మొదలైన వణుకు

వందెకరాల ప్రభుత్వ భూమి. ఎంతోకాలంగా కబ్జాకు గురైంది. ఆక్రమణదారుల్లో పేదలు కొంతమందే. వారి ముసుగులో పెద్దలే అధికంగా ఉన్నారు. ఐదు, పది ఎకరాల ఇసుక భూమిని తమ పలుకుబడితో ఆక్రమించారు. యథేచ్ఛగా బోర్లు వేసుకుని సాగు చేసుకుంటున్నారు. తీరప్రాంతంలోని ఇసుక భూములకు విలువ పెరగటంతో వాటికి మంచి డిమాండ్‌ వచ్చింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండానే ఇంతకాలం వారు అనుభవిస్తున్నారు. అయితే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కొందరికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీచేయడంతో ఆక్రమణదా రుల్లో కలవరం మొదలైంది.

కొత్తపట్నం, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పాదర్తి సర్వే నంబర్‌ 465లో ఉన్న భూమి పాదర్తి గ్రామం నుంచి మోటుమాల వరకు విస్తరించి ఉంది. ఏటా వేరుశనగ, చేమదుంపలు, ఇతర కూరగాయల సాగు జరుగుతోంది. మామిడి తోటలను కూడా కొంతమంది రైతులు సాగు చేస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ఎవరికి ఇష్టమొచ్చినట్లుగా వారు ఆక్రమించుకున్నారు. పేదలైతే వారి అర్హతను గుర్తించి పట్టాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇతర ప్రాంతాల్లో పెద్దఎత్తున భూములు ఉండి ప్రభుత్వ భూమి సెంటు కూడా పొందే అవకాశం లేనివారే ఈ ఆక్రమణదారుల్లో అధికంగా ఉన్నారు. గతంలో వారిని తొలగించి అర్హులకు ఇవ్వాలన్న ప్రయత్నం జరిగిన ప్పటికీ రెవెన్యూ అధికారులు మధ్యలోనే ఆపేశారు. నాయకుల ఒత్తిడిని తట్టుకోలేక భూమిని పెద్దల చెర నుంచి విడిపించి పేదలకు పంపిణీ చేసే ప్రయత్నానికి అడుగడుగునా ఆటంకాలే ఎదురయ్యాయి. ఎట్టకేలకు ఈ భూముల్లో ఉన్న పెద్దలను బయటకు పంపి ఆ భూములను అర్హులైన పేదలకు పంపిణీ చేసేందుకు ప్రజా ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. వారంరోజులుగా ఆక్రమణదారులకు నోటీసులు జారీచేస్తున్నారు. ఈ భూముల్లో 44 మంది పెద్దలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఇప్పటికే 20మందికి నోటీసులు ఇచ్చారు. మిగిలిన వారికి కూడా జారీచేసే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ భూములను అర్హులైన పేదలకు పంపిణీ చేసేందుకు నేతల నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్‌ అందడంతో రెవెన్యూ అధికారులు అనర్హులను తొలగించేందుకు సిద్ధమయ్యారు.

ఆక్రమణదారుల్లో కలవరం

రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటున్న వారికి నోటీసులు జారీ చేస్తుండటంతో ఆక్రమణదారుల్లో కలవరం మొదలైంది. రెవెన్యూ అధికారులు జారీచేస్తున్న నోటీసులను పట్టుకుని ఇటు అధికారుల వద్దకు, అటు ప్రజాప్రతినిధుల వద్దకు పరుగులు పెడుతున్నారు. తమ భూములను ఎలాగైనా కాపాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో సుజాతశర్మ కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో ఆమె ఈ భూములను పెద్దల నుంచి కాపాడే చర్యలకు ఉపక్రమించారు. ఆక్రమణదారులకు ట్రాన్స్‌కో అధికారులు ఇచ్చిన విద్యుత్‌ కనెక్షన్లను తొలగించారు. వారు ఇక సాగు చేపట్టకుండా పలు చర్యలు తీసుకున్నారు. అయితే కొద్దిరోజుల్లోనే ఈ ప్రయత్నం ఆగిపోయింది. దీంతో ఆక్రమణదారుల చెరలోనే ప్రభుత్వం భూమి ఉండిపోయింది. ఇప్పుడు తాజాగా అనర్హులను తొలగించేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు.

అనర్హులనే తొలగిస్తాం:

రామానాయుడు, తహసీల్దార్‌, కొత్తపట్నం

ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటున్న వారిలో అనర్హులను మాత్రమే తొలగిస్తామని తహసీల్దార్‌ రామానాయుడు తెలిపారు. అర్హులు ఉంటే వారి సాగును ధ్రువీకరించి హక్కులు కల్పిస్తామని తెలిపారు. పేదలు భయపడాల్సిన పనిలేదన్నారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకున్నాకే అనర్హులను తొలగించే చర్యలకు ఉపక్రమించామన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 03:22 AM