ఓట్ల నమోదుపై విస్తృత అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Aug 05 , 2026 | 12:03 AM
జిల్లాలో ఓట్ల నమోదుపై విస్తృతంగా అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఓటర్ల జాబితా జిల్లా పరిశీలకులు ఎ.సూర్యకుమారి సూచించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి
జిల్లా పరిశీలకులు సూర్యకుమారి
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఓట్ల నమోదుపై విస్తృతంగా అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఓటర్ల జాబితా జిల్లా పరిశీలకులు ఎ.సూర్యకుమారి సూచించారు.స్థానిక కలెక్టరేట్ లోని మీకోసం హాలులో మంగళవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్వోలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో స్వీప్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తెలిపారు. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఎంతో కీలకమైందని, అందువల్ల ప్రజలకు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించాలన్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ, నర్శింగ్ కళాశాలల్లో యువతీ యువకులకు భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. జిల్లాలో 18నుంచి 19 ఏళ్లలోపు యువ ఓటర్ల నమోదును పెంచడంతో పాటు 17 ఏళ్లు పూర్తయిన భవిష్యత్ ఓటర్ల వివరాలను కూడా ముందస్తుగా నమోదు చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌శాతాన్ని పెంచేందుకు జిల్లా ఎన్నికల అధికారి, మునిసిపల్ కమిషనర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో అత్యుత్తమంగా పనిచేసిన బీఎల్వోలను గుర్తించి సత్కరించాలని ఆమె సూచించారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 90.92శాతం పూర్తయిందన్నారు. మిగిలిన 9.08శాతం డేటాలో మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, డబుల్‌ఓటర్లు వంటివి కలిపి 1,27,029 ఉన్నాయని చెప్పారు. మ్యాపింగ్ లోపాలు, అందుబాటులో లేనివారందరికీ నోటీసులు జారీ చేసి క్షేత్ర స్థాయిలో విచారణ చేసి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట రమణ, ఈఆర్వోలు, ఏఆర్వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు.