Share News

దగా పడ్డ వైట్‌బర్లీ రైతు

ABN , Publish Date - Feb 14 , 2026 | 02:54 AM

గతేడాది నేర్పిన పాఠాలతో పలువురు రైతులు వైట్‌బర్లీ పొగాకు సాగుచేసేందుకు వెనుకడుగు వేశారు. దీంతో కంపెనీలు తమ సిబ్బంది, ప్రతినిధులను గ్రామా లకు పంపాయి. వారు రైతులను ప్రోత్సహించారు. ఎంత సాగుచే సినా క్వింటా రూ.16వేలకు కొనుగోలు చేస్తామని నమ్మబలికారు.

దగా పడ్డ వైట్‌బర్లీ రైతు
పల్నాడు జిల్లా తిమ్మాపురం సమీపంలో వైట్‌బర్లీ కొనుగోళ్లు

మభ్యపెట్టి సాగు చే యించిన కంపెనీలు

క్వింటా రూ.16వేల చొప్పున కొనుగోలు చేస్తామని హామీ

నేడు రూ.10వేలు కూడా ఇవ్వని వైనం

అమ్మకానికి తీసుకెళ్లిన వాటిలో సగం వెనక్కి

అద్దంకి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): గతేడాది నేర్పిన పాఠాలతో పలువురు రైతులు వైట్‌బర్లీ పొగాకు సాగుచేసేందుకు వెనుకడుగు వేశారు. దీంతో కంపెనీలు తమ సిబ్బంది, ప్రతినిధులను గ్రామా లకు పంపాయి. వారు రైతులను ప్రోత్సహించారు. ఎంత సాగుచే సినా క్వింటా రూ.16వేలకు కొనుగోలు చేస్తామని నమ్మబలికారు. ఈమేరకు బాండ్‌లు కూడా ఇస్తామని చెప్పి రైతులతో మాత్రమే సంతకాలు చేయించుకున్నారు. ఆతర్వాత కంపెనీల యజమానుల తో చేయించి ఇస్తామని చెప్పారు. అనంతరం వాటిని ఇవ్వకుండా కాలయాపన చేశారు. కంపెనీల ప్రతినిధుల మాటలు నమ్మిన కొందరు రైతులు వైట్‌బర్లీ సాగు చేశారు. దిగుబడులు వచ్చి తీరా అమ్మకాలకు తీసుకుపోయిన తరువాత కంపెనీ ప్రతినిధుల అసలు బండారం బయటపడింది.

తిమ్మాపురం వద్ద కొనుగోలు

ఈ ఏడాది నల్లబర్లీ పొగాకు సాగును ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. వైట్‌ బర్లీకి మాత్రం కంపెనీలు బాండ్‌ ఇస్తే సాగు చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. గతంలో కొరిశపాడు, మార్టూరు, తమ్మవరం తదితర ప్రాంతాలలో చేపట్టే కొనుగోళ్లను కంపెనీల వారు ఈ ఏడాది పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తిమ్మాపురం వద్దకు మార్చారు. దీంతో అద్దంకి, బల్లికురవ, ముండ్లమూరు మండలాల నుంచి గురువారం సుమారు 700 బేళ్ల పొగాకును రైతులు అమ్మకానికి తీసుకెళ్లారు. బయ్యర్లు తమ నైజాన్ని బయటపెట్టారు. క్వింటా రూ.9 వేల నుంచి రూ.పది వేలకు మించి కొనుగోలు చేసేది లేదని తేల్చి చెప్పారు. దీనికితోడు తీసుకుపోయిన బేళ్లలో సగం కూడా కొనుగోలు చేయకుండా వెనక్కిపంపారు. దీంతో రైతులు ఆందోళనకు దిగడంతో విభజించి పాలించుసూత్రాన్ని అవలంబించారు. ఆందోళనకు నాయకత్వం వహించే వారితో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని, మిగిలిన రైతుల బేళ్లను తమకు ఇష్టమొచ్చిన ధరలకు కొనుగోలు చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. బాండ్‌ల విషయం అడిగితే సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగుతున్నారని తెలిపారు. ఈ ఏడాది వర్షాల వల్ల దిగుబడి తగ్గడంతోపాటు కంపెనీలు చేసిన మోసంతో నిండా మునిగామని రైతులు వాపోతున్నారు. ఆయా కంపెనీలు సమావేశాల ఏర్పాటు, బాండ్‌లు ఇస్తామని మోసం చేసిన విషయాలను ఆధారలతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు పలువురు రైతులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Feb 14 , 2026 | 02:54 AM