Share News

కోల్‌ సొసైటీ అక్రమాలపై కొరడా

ABN , Publish Date - Jan 23 , 2026 | 02:33 AM

ఒంగోలు కేంద్రంగా నడుస్తున్న కోల్‌ సొసైటీలో అక్రమాలపై ఎట్టకేలకు జిల్లా సహకారశాఖ అధికారులు కదిలారు. ఆ సంస్థపై సెక్షన్‌ 52 విచారణకు డీసీవో డి.శ్రీలక్ష్మి ఆదేశించారు. ఒంగోలు డివిజనల్‌ సహకారాధికారి కార్యాలయంలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న నర్రా సురేంద్రబాబును విచారణాధికారిగా నియమించారు.

కోల్‌ సొసైటీ అక్రమాలపై కొరడా
ఒంగోలులోని కోల్‌ సొసైట భవనం

ఎట్టకేలకు సెక్షన్‌ 52 విచారణ

కమిషనర్‌ ఆదేశించిన మూడు వారాలకు డీసీవో నిర్ణయం

విచారణాధికారిగా అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సురేంద్ర నియామకం

ఇప్పటికే సహకారశాఖ అధికారుల నోటీసులపై ఇద్దరు డైరెక్టర్లు రివర్స్‌

మరోవైపు హైకోర్టులోనూ వ్యవహారం

ఒంగోలు కేంద్రంగా నడుస్తున్న కోల్‌ సొసైటీలో అక్రమాలపై ఎట్టకేలకు జిల్లా సహకారశాఖ అధికారులు కదిలారు. ఆ సంస్థపై సెక్షన్‌ 52 విచారణకు డీసీవో డి.శ్రీలక్ష్మి ఆదేశించారు. ఒంగోలు డివిజనల్‌ సహకారాధికారి కార్యాలయంలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న నర్రా సురేంద్రబాబును విచారణాధికారిగా నియమించారు. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చారు. కోల్‌ సొసైటీ నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వ్యవహారాలపై ఐదేళ్లుగా సహకారశాఖ అధికారులు వ్యవహరిస్తున్న ఉదాసీన వైఖరే ఇప్పుడూ కొనసాగుతోంది. ఆ సంస్థపై సెక్షన్‌ 52 విచారణ తక్షణం నిర్వహించి నివేదించాలని సహకార శాఖ కమిషనర్‌ అహ్మద్‌బాబు ఆదేశించిన మూడు వారాలకు ఇక్కడి అధికారులు స్పందించడం అందుకు నిదర్శనం.

ఒంగోలు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : కోల్‌ సొసైటీలో అక్రమాలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన సహకారశాఖ జిల్లా అధికారులు ఏళ్ల తరబడి ఉదాసీనంగా వ్యవహరించారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పాలనా వ్యవహారాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కోల్‌ సొసైటీ వ్యవహారా లపై గత నెలలో సంస్థ సభ్యులైన మద్దిరాలపాడుకు చెందిన షేక్‌ ఖాజావలి, తాళ్లూరి కృష్ణారావు హైకోర్టులో పిటిషన్‌ వేసిన తర్వాత కాని అధికారుల్లో చలనం రాలేదు. ఆ పిటిషన్‌ కన్నా ముందుగానే సహకారశాఖలోని రాష్ట్ర, జిల్లా అధికారులకు వారిద్దరూ కోల్‌సొసైటీ నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించిన వారు సదరు అధికారులను కూడా ప్రతివాదులుగా చేర్చారు. కోర్టు నుంచి వచ్చిన తాఖీదులతో రాష్ట్ర, జిల్లా అధికారుల్లో కదలిక వచ్చింది. కోల్‌ సొసైటీపై తక్షణం సెక్షన్‌ 52 విచారణ నిర్వహించి నివేదించాలని సహకారశాఖ కమిషనర్‌ అహ్మద్‌బాబు గత నెల 31న డీసీవోను ఆదే శిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు తనకు ఆడిటర్లు ఇచ్చిన నివేదికలో కోల్‌సొసైటీ నిర్వహణలో పలు అవకతవకలు ఉన్నట్లు తేల్చారని, ఈ దృష్ట్యా విచారణ చేయించాలని ఒంగోలు డీసీఎల్‌వో కూడా అంతకు రెండు రోజుల ముందు డీసీవోకు లేఖ రాశారు. తక్షణ విచారణకు ఆదేశించాల్సిన డీసీవో శ్రీలక్ష్మి దాదాపు మూడు వారాలపాటు పట్టించుకోకపోవడం ఉదాసీన వైఖరిని స్పష్టం చేస్తోంది.

ప్రధాన ఆరోపణలు ఇవీ..

కోల్‌సొసైటీపై కమిషనర్‌కు ఇరువురు సభ్యులు చేసిన ఫిర్యాదులు, ఆడిటర్లు డీఎల్‌సీవోకు నివేదించిన అంశాలపై మాత్రమే సెక్షన్‌ 52 విచారణ సాగుతుంది. ప్రధాన ఆరోపణల్లో సహకార చట్ట నిబం ధనలకు విరుద్ధంగా 2018 డిసెంబరులో ఒకసారి, 2023 డిసెంబరులో మరోసారి అక్రమంగా, అనైతికంగా సొసైటీ పాలక మండలి ఎన్నికలు నిర్వహించడం ఉంది. జనరల్‌ బాడీ ఆమోదం లేకుండా బ్యాం కులో ఉన్న రూ.2.15 కోట్ల మేర సొసైటీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు విత్‌డ్రాతోపాటు మరో రూ.11 కోట్ల బ్యాంకు రుణం తెచ్చి అనధి కార నిర్మాణాలు చేసి లీజుకు ఇవ్వడం కూడా ఉన్నాయి. ఆ వ్యవహారాలు జరిగిన ప్పుడు ఒంగోలు డివిజనల్‌ సహకారశాఖ అధికారిగా, డీసీవోగా, డీసీఏవోగా మూడు కీలక బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం కావలి డీఎల్‌సీవోగా పనిచేస్తున్న పోలిశెట్టి రాజశేఖర్‌ అనే అధికారి ఎలాంటి చర్యలు తీసుకోనందున అతనిపై చర్యలు తీసుకోవా లని ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే డీఎల్‌సీ వోకు ఆడిటర్లు ఇచ్చిన నివేదికలో.. ఎస్‌బీఐ నుంచి రూ.5.60 కోట్ల రుణాలు తీసుకోవ డం, ఎరువుల కంపెనీకి రూ.4.53లక్షలు పెనాల్టీ చెల్లింపు, రూ.90వేల బోనస్‌ సిబ్బం దికి ఇవ్వడం, రూ 8.50 లక్షల కమీషన్‌ను కార్పొరేట్‌ ప్రాపర్టీస్‌కు చెల్లించడం వంటి పలు వ్యవహారాలను నిబంధనలకు విరు ద్ధంగా జరిగినట్లు పేర్కొన్నారు. వీటన్నిం టిపైనా సహకార చట్టం సెక్షన్‌ 52 కింద విచారణ చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా వ్యవహారం హైకోర్టుకు చేరిన నేపథ్యంలో ఎవరికి వారు తమకు ఇబ్బంది రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే గత నెలలో ఒంగోలు డీసీఎల్‌వో కోల్‌ సొసైటీ డైరెక్టర్లకు నోటీసులు ఇవ్వగా ఇద్దరు డైరెక్టర్లు ఘాటుగా రివర్స్‌ సమాధానం ఇచ్చిన విషయం విదితమే. ఈనేపథ్యంలో కోల్‌ సొసైటీపై విచారణ ఎలా సాగుతుందన్నది వేచిచూడాల్సి ఉంది.

Updated Date - Jan 23 , 2026 | 02:34 AM