అవినీతిపై చర్యలేవీ?
ABN , Publish Date - Oct 11 , 2026 | 10:57 PM
సంతమాగులూరు మండలంలో నాడు ఉపాధి పనులలో సిబ్బంది, అధికారులు కలసికట్టుగా అవినీతికి పాల్పడ్డారు. ప్రస్తుతం వీబీ జీరామ్‌జీ పనులలో సిబ్బంది, అధికారుల మధ్య భేదాభిప్రాయాలతో కూలీల పొట్టకొట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సంతమాగులూరు మండలంలో అవినీతిని వంట పట్టించుకున్న మండల స్థాయి అధికారి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదే పంథాను కొనసాగించినట్లు విమర్శలు ఉన్నాయి.
సంతమాగులూరు మండలంలో వీబీ జీరామ్‌జీ పథకంలో భారీ లొసుగులు
ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన సోషల్ ఆడిట్‌లో బయటపడిన అక్రమాలు
దాదాపు రూ.50 లక్షలు బొక్కేసినట్లు వెలుగులోకి
నాడు సిబ్బంది కలిసికట్టుగా వ్యవహారం
నేడు భే దాభిప్రాయాలతో కూలీలకు అన్యాయం
సంతమాగులూరు(అద్దంకి), అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): సంతమాగులూరు మండలంలో నాడు ఉపాధి పనులలో సిబ్బంది, అధికారులు కలసికట్టుగా అవినీతికి పాల్పడ్డారు. ప్రస్తుతం వీబీ జీరామ్‌జీ పనులలో సిబ్బంది, అధికారుల మధ్య భేదాభిప్రాయాలతో కూలీల పొట్టకొట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సంతమాగులూరు మండలంలో అవినీతిని వంట పట్టించుకున్న మండల స్థాయి అధికారి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదే పంథాను కొనసాగించినట్లు విమర్శలు ఉన్నాయి.
బాపట్ల నుంచి ప్రకాశం జిల్లాలోకి మారడంతో కలిసొచ్చిన అంశం
గత ఏడాది జరిగిన ఉపాధి పనుల సోషల్ ఆడిట్‌లో ఉపాధిహామీ పథకం పనుల్లో డొల్లతనం బయటపడింది. ఎన్నో ఒత్తిళ్లు, గిమ్మిక్కులు చేసిన తరువాత కూడా సుమారు రూ.50 లక్షలకుపైగా అవినీతి చోటుచేసుకున్నట్లు బయటపడింది. అప్పట్లో బాపట్ల జిల్లా పరిధిలో ఉండటంతో అప్పటి జిల్లా అధికారులు అవినీతిని కప్పిపుచ్చేందుకు సాగదీసి చివరకు ఏమి చర్యలు లేకుండానే చేతులు కట్టుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఆ తరువాత జిల్లా మారటంతో నాటి అవినీతి అడుగున పడిపోయినట్లు తెలుస్తుంది. అప్పట్లో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకున్నట్లు అవినీతి ఆరోపణలు వచ్చినా ఎలాంటి చర్యలు లేకపోవటంతో ఈఏడాది కూడా అదే పంథా కొనసాగిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
12 గ్రామాల్లో 14 వేల పనిదినాలు డిలిట్
ప్రస్తుతం ఉపాధి హామీ పథకం పేరును వీబీ జీరామ్‌జీ పథకంగా మార్పుచేసినా అధికారులు మాత్రం పాత పంధానే కొనసాగించేందుకు తహతహలాడుతున్నారనే విమర్శలు వచ్చాయి. అప్పట్లో రెండు చేతులా సంపాదించిన క్షేత్రస్థాయి సిబ్బంది, మండల అధికారులు ఇప్పుడు అవినీతి చేసేందుకు వీలులేకుండా కొంతమేర కట్టడి చేయటంతో పంపకాలలో భేదాభిప్రాయలొచ్చాయి. ఈక్రమంలో మండలంలోని 12 గ్రామపంచాయతీలలో చేసిన పనులకు సంబంధించి సుమారు 14 వేల పనిదినాలు అప్‌లోడ్ చేయకుండా డిలిట్ కొట్టారనే విమర్శలు వస్తున్నాయి. విషయం ఏదైనా 14 వేల పనిదినాలకు సంబంఽధించిన వివరాలు అప్‌లోడ్ చేయకుండా డిలిట్ కొట్టారనే విషయాన్ని జిల్లా అధికారుల విచారణలో తేటతెల్లమైంది. ఒకవేళ పొరపాటున జరిగి ఉంటే ఇప్పటికే సదరు సిబ్బంది లేదా అధికారి వెంటనే సదరు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయాల్సి ఉంది. అలా కాకుండా ఒకరిపై మరొకరు నెట్టుకునే ప్రయత్నం జరుగుతుందంటే.. అన్నీ తెలిసే కూలీల మస్టర్‌లో అప్‌లోడ్ చేయకుండా డిలిట్ చేశారని తేటతెల్లమైంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మరింత లోతుగా పరిశీలన చేసి భాధ్యుల పై కఠిన చర్యలు తీసుకుంటేనే కూలీల్లో, ప్రజల్లో నమ్మకం కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.