Share News

బిల్లులకు మోక్షమెప్పుడు?

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:00 AM

తాగునీటి నిర్వహణలో కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాల్సి వారు ఆ విషయాన్ని గాలికొదిలేశారు. నగరంలోని శివారు కాలనీల్లోనేటికీ పైపులైన్లు లేవు.

బిల్లులకు మోక్షమెప్పుడు?

14 నెలలుగా రూ.3.6కోట్లు పెండింగ్‌

నిర్వహణకు అగచాట్లు పడుతున్న నీళ్ల ట్యాంకర్ల కాంట్రాక్టర్లు

సమీపిస్తున్న వేసవి కాలం

శివారు కాలనీలకు నీటి కష్టాలు..!

ఒంగోలు కార్పొరేషన్‌, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి) : తాగునీటి నిర్వహణలో కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాల్సి వారు ఆ విషయాన్ని గాలికొదిలేశారు. నగరంలోని శివారు కాలనీల్లోనేటికీ పైపులైన్లు లేవు. గత వైసీపీ హయాంలో దీనిపై అసలు దృష్టిసారించలేదు. దీంతో తాగునీటి కష్టాలు సర్వసాధారణమయ్యాయి. ప్రతి 45రోజులకు ఒకసారి టెండర్లు పిలిచి, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. అయితే వాటికి బిల్లుల చెల్లింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ట్యాంకర్ల కాంట్రాక్టర్లు అప్పులతో నిర్వహణ చేపట్టలేమని ఉన్న వాటిని అమ్ముకుంటున్నారు. మరోవైపు వేసవి కాలం సమీపిస్తుండ టంతో నీటి అవసరాలు పెరగనున్నాయి. కాలనీలకు నీరు నిలిచిపోతే ప్రజలకు ఇబ్బందులు తప్పువు. 2024 డిసెంబరు నుంచి 2026 జనవరి వరకు పెండింగ్‌ ఉన్న ట్యాంకర్ల బిల్లుల చెల్లింపులు జరిగితే తప్ప సమస్యకు పరిష్కారం లభించే పరిస్థితి కనిపించడం లేదు.

9 నెలలుగా రూ.2కోట్లపైనే పెండింగ్‌

నగర పరిధిలో 70కిపైగా శివారుకాలనీలు ఉన్నాయి. వాటికి ప్రతిరోజూ 45 ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా 200 ట్రిప్పుల వరకు నీటిని సరఫరా చేస్తుంటారు. ఒక్కో ట్యాంకర్‌కు టెండరు ప్రకారం ట్రిప్పునకు రూ.336 చెల్లిస్తున్నారు. కాగా కార్పొరేషన్‌ అధికారులకు పర్సంటేజీల రూపంలో 10శాతం చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. దీంతో కాంట్రాక్టర్‌కు ఒక ట్రిప్పునకు రూ.270 మాత్రమే చేతికి అందుతుండగా, అది కూడా నెలలుగా ఇవ్వడం లేదు. ప్రస్తుతం 9నెలలకు బిల్లులకు సంబంధించి సుమారు రూ.3.6కోట్లు రావాల్సి ఉంది. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించి నిలిచిపోయిన బిల్లులు చెల్లిస్తే తప్ప తిరిగి వాటర్‌ ట్యాంకర్లను తిప్పలేమని వెల్లడిస్తున్నారు.

టెండర్లు పిలిచినా ముందుకు రాని కాంట్రాక్టర్లు

ఇప్పటికే 2024 డిసెంబరు నుంచి 2026 జనవరి వరకు పద్నాలుగు నెలల బిల్లులు చెల్లించాల్సి ఉంది. కాగా తాజాగా గత నవంబరు30న తిరిగి మరోసారి టెండర్లు పిలిచారు. టెండరు గడువు ముగిసిన కాంట్రాక్టర్లు ఆసక్తిచూపడం లేదని సమాచారం. ప్రత్యేకించి నిర్వహణ భారం కష్టంగా ఉండటంతో చేసేదేమీ లేక కాంట్రాక్టర్లు ట్యాంకర్లను నిలిపివేయడమే సరైన నిర్ణయమని అభిప్రాయానికి వచ్చారు. అందులోభాగంగా సుమారు 45 ట్యాంకర్లు ప్రతిరోజు కాలనీలకు నీటి సరఫరా చేస్తుండగా, ప్రస్తుతం 10 నుంచి 14 ట్యాంకర్లు మాత్రమే తిప్పడంతో శివారు కాలనీల్లో నీటికి ఇక్కట్లు ఎదురయ్యాయి. మరోవైపు నిన్న మొన్నటివరకు వెంగముక్కలపాలెం రోడ్‌లోని సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌-2 వద్ద ట్యాంకర్లు పడుతుండగా, ప్రస్తుతం రంగారాయుడు చెరువు దగ్గర గతంలోని ఫిల్టర్‌ బెడ్‌ వద్దనే ట్యాంకర్లకు నీటిని నింపుతున్నారు.

మార్చిలో చెల్లింపులు చేసేలా చర్యలు

ఏశయ్య, మునిసిపల్‌ ఇంజనీర్‌

కొంతకాలంగా ట్యాంకర్లు బిల్లులు పెండింగ్‌ ఉన్న మాట వాస్తమే. అయితే నిధుల కొరత కారణంగా కొంతజాప్యం జరిగింది. మార్చిలో పన్నులు అధిక మొత్తంలో వసూలయ్యే అవకాశం ఉన్నందున ట్యాంకర్లకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే నిలిపివేసిన ట్యాంకర్ల యజమానులతో మాట్లాడుతున్నాం. శివారు కాలనీల్లోని ప్రజలకు నీటికి ఇబ్బందిలేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - Feb 03 , 2026 | 03:00 AM