రైలు కూత ఎప్పుడు?
ABN , Publish Date - Apr 05 , 2026 | 02:30 AM
నడికుడి-శ్రీకాళహస్తి లైను నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ రైళ్లు నడపడంలో జాప్యం జరుగుతోంది. రైల్వే సేఫ్టీ అధికారులు రెండు నెలల క్రితం లైన్‌ను పరిశీలించి ఆమోదం తెలిపారు. 90 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిపేందుకు అనుమతి కూడా ఇచ్చారు.
నడికుడి-శ్రీకాళహస్తి లైన్ పనులు పూర్తి
ట్రైన్ నడిపేందుకు సేఫ్టీ అధికారుల ఆమోదం
ఇంకా అనుమతివ్వని రైల్వే శాఖ
గుంటూరు జోన్ అధికారుల ఎదురుచూపులు
దర్శి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): నడికుడి-శ్రీకాళహస్తి లైను నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ రైళ్లు నడపడంలో జాప్యం జరుగుతోంది. రైల్వే సేఫ్టీ అధికారులు రెండు నెలల క్రితం లైన్‌ను పరిశీలించి ఆమోదం తెలిపారు. 90 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిపేందుకు అనుమతి కూడా ఇచ్చారు. అయితే రైల్వే శాఖ నుంచి ఇప్పటి వరకూ గ్రీన్‌సిగ్నల్ లభించలేదు. అనుమతి కోసం గుంటూరు రైల్వే జోన్ అధికారులు ఎదురుచూస్తున్నారు. నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు 309 కిలో మీటర్ల దూరం ఉంది. తొలిదశలో నడికుడి నుంచి దర్శి మీదుగా కనిగిరి వరకు 155 కిలో మీటర్లు రైల్వే లైను నిర్మించారు. ఎన్నో అవాంతరాలను అధిగమించి అధికారులు కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ చేసుకొని అన్ని పనులు పూర్తి చేశారు. నూతన రైల్వేస్టేషన్ భవనం, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, బుకింగ్ కౌంటర్లు నిర్మించారు. జనవరి తర్వాత రైళ్లు నడుస్తాయని భావించినప్పటికీ అప్పుడు వీలుకాలేదు. ఆతర్వాత ఏప్రిల్ 1వ తేది నుంచి రైళ్లకు రాకపోకలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. గుంటూరు నుంచి ఐనవోలు మీదుగా దర్శి, కనిగిరి ప్రాంతాలకు రోజుకు రెండు రైళ్లు నడపాలని ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. కానీ ఇప్పటి వరకూ మోక్షం కలగలేదు. దర్శి ప్రాంత ప్రజలు రైళ్లు ఎప్పుడు నడుపుతారోనని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. రైల్వే శాఖ వీలైనంత త్వరగా అనుమతి ఇస్తే రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. తమ ఆకాంక్షను గుర్తించి ఉన్నతాధికారులు సత్వర నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.