Share News

చేసేదెలా?

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:13 AM

రైతులకు సాగునీటి ఇక్కట్లు తీర్చాలన్న తపనతో అప్పులు తెచ్చి పనులు చేసిన సాగునీటి సంఘాల ప్రతినిధులు ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. ఏడాది గడుస్తున్నా చేసిన పనులకు బిల్లులు రాక అవస్థలు పడుతున్నారు.

చేసేదెలా?

అప్పులు తెచ్చి పనులు.. నిధులు రాక అవస్థలు

ఏడాదైనా సాగునీటి సంఘాలకు అందని బిల్లులు

ఒంగోలు సర్కిల్‌ పరిధిలో రూ.17.61 కోట్లు పెండింగ్‌

మళ్లీ ఈ ఏడాది పనులకు సమయం వచ్చినా బకాయిలు రాక ఆందోళన

రైతులకు సాగునీటి ఇక్కట్లు తీర్చాలన్న తపనతో అప్పులు తెచ్చి పనులు చేసిన సాగునీటి సంఘాల ప్రతినిధులు ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. ఏడాది గడుస్తున్నా చేసిన పనులకు బిల్లులు రాక అవస్థలు పడుతున్నారు. జలవనరుల శాఖ ఒంగోలు సర్కిల్‌ పరిధిలో సుమారు రూ.17.61 కోట్లతో 334 పనులను వందలాది మంది ఏడాది క్రితం చేశారు. వాటికి సంబంధించి రూపాయి కూడా రాలేదు. మళ్లీ ఈ ఏడాది పనులు చేసే సమయం వచ్చింది. అయినా ఇంకా పాత బకాయిలు రాకపోవడంతో కొత్త పనులు చేసేందుకు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ఒంగోలు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ ప్రభుత్వం జలవనరులను నిర్వీర్యం చేసింది. సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా, నీటి వనరుల మరమ్మతులకు ఒక్క రూపాయి ఇవ్వకుండా పక్కన పడేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వం తిరిగి ఆ రంగానికి జవసత్వాలు తెచ్చింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి ఊతమిచ్చింది. క్షేత్రస్థాయిలోని నీటిసంఘం నుంచి ప్రాజెక్టు వరకు రైతు ప్రతినిధులతో కమిటీలను ఏర్పాటు చేసింది. 2025 వేసవిలో వివిధ స్థాయిల్లోని నీటి వనరుల మరమ్మతు పనులను మంజూరు చేసింది. ప్రధానంగా ఓఅండ్‌ఎం పేరుతో నీటి సరఫరా కాలువలు, డ్రెయిన్‌ల అభివృద్ధి, జంగిల్‌ క్లియరెన్స్‌, అత్యవసరమైన ఇతర మరమ్మతులు, పూడికతీత వంటి పనులు అందులో ఉన్నాయి. అయితే నిధుల మంజూరు విషయంలో జాప్యం నెలకొంది.

ఎక్కువగా ఎన్‌ఎస్‌పీ పరిధిలోనే..

జలవనరులశాఖ ఒంగోలు సర్కిల్‌ పరిధిలో రూ.17.61 కోట్లతో 334 పనులను నీటి సంఘాల ద్వారా చేశారు. ఇందులో ఉమ్మడి జిల్లాలోని ఎన్‌ఎస్‌పీ కాలువలు, పలు మీడియం, మైనర్‌ చెరువులకు సంబంధించిన పనులు ఉన్నాయి. రూ.9.54కోట్లతో ఎన్‌ఎస్‌పీ కాలువల పరిధిలో 205, మీడియం ఇరిగేషన్‌ పరిధిలో రూ.4.38 కోట్లతో 60, మరో రూ.3.68 కోట్లతో మైనర్‌ ఇరిగేషన్‌లోని చెరువుల అభివృద్ధి పనులు చేశారు. ఈ విభాగాలన్నీ కలిపి గరిష్ఠంగా దర్శి నియోజకవర్గంలో రూ.3.94 కోట్లతో 91, కొండపిలో రూ.2.93 కోట్లతో 50, ఒంగోలులో రూ.2 కోట్లతో 25 పనులు పూర్తి చేశారు. ఇతర నియోజకవర్గాల్లో ఆయా స్థాయిల్లో పనులు చేశారు.

ఉత్సాహంగా పనులు పూర్తి

అప్పట్లో పనుల అత్యవసరంతోపాటు చిన్నచిన్న మొత్తాలు కావడంతో టెండర్ల ద్వారా అయితే జాప్యమవుతుందని భావించి ఒక్కో పనిని రూ.10లక్షలలోపు ఉండేలా విభజించి సాగునీటి సంఘాల ద్వారా చేయించారు. అంతకు ఐదారు నెలల క్రితమే రైతుల్లో గుర్తింపు ఉండేవారు నీటి సంఘాలకు ఎన్నిక కావడం, ఆ వెంటనే మరమ్మతులు చేసే అవకాశం రావడంతో ఆయా సంఘాల ప్రతినిధులు ఉత్సాహంగా పనులు చేశారు. అత్యధికశాతం మంది ఈ సంఘాల ప్రతినిధులు, మధ్యతరగతి రైతులు కాగా అప్పులు తెచ్చి పూర్తిచేశారు. రైతులలో మంచిపేరు కోసం ఎక్కువ మంది అలా చేశారన్నది నిర్వివాదాంశం. దాని వల్ల గత ఖరీఫ్‌, రబీ సీజన్లలో సాగునీటి పారుదలలో అవాంతరాలు లేకుండా సాగి రైతులకు మేలు జరిగింది. అయితే ఆ పనులు చేసిన నీటిసంఘాలకు మాత్రం బిల్లులు రాలేదు.

మిగులదల ఉండకపోయినా..

సాధారణంగా ఈ తరహా పనులతో కాంట్రాక్టర్ల వలే నీటిసంఘాల వారికి మిగులదల తక్కువగా ఉంటుంది. ఎక్కువమంది అప్పులు తెచ్చి పనులు చేయడమే కాక కొన్ని చోట్ల పనుల అవసరం దృష్ట్యా రైతులలో పేరు కోసం, నీటి ఇక్కట్లు తీర్చడం కోసం కొందరు ఎస్టిమేషన్లలో లేని పనులు సైతం చేశారు. ఏడాది గడుస్తున్నా ఇంతవరకూ ఆ బిల్లులు రాక వారు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఈ ఏడాది ఓఅండ్‌ఎంతో పనులు చేపట్టే సమయం వచ్చినా పాత బిల్లులు రాకపోవడంతో అధికారులు, కార్యాలయాల చుట్టూ నీటిసంఘాల ప్రతినిధులు తిరిగిపోతున్నారు.

నిధులు రాగానే ఇస్తాం : జలవనరుల శాఖ ఎస్‌ఈ

ఈ వ్యవహారంపై జలవనరులశాఖ ఎస్‌ఈ వరలక్ష్మి స్పందిస్తూ చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వానికి నివేదించామన్నారు. నిధులు రాగానే చెల్లిస్తామన్నారు. ప్రస్తుత సీజన్‌కు ఒంగోలు సర్కిల్‌ పరిధిలో ఓఅండ్‌ఎం కింద రూ.25 కోట్లతో పనులకు ప్రతిపాదించామని తెలిపారు. త్వరలో అవి మంజూరవుతాయని ఈ వేసవిలో ఆ పనుల పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 03:20 AM