Share News

ఇదేం వ్యూహం

ABN , Publish Date - Jun 16 , 2026 | 01:20 AM

‘కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది’ అన్న చందంగా తయారైంది దక్షిణాది పొగాకు రైతుల పరిస్థితి. మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించడం లేదు. రోజురోజుకూ ధరలు పడిపోవడంతోపాటు తిరస్కరణలు భారీగా ఉంటున్నాయి.

ఇదేం వ్యూహం
టంగుటూరులో కొనుగోళ్లను పరిశీలిస్తున్న పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ

నోబిడ్‌ల తగ్గింపు కోసం ధరల్లో కోత

విచిత్రంగా బోర్డు అధికారుల చర్యలు

కనిష్ఠ ధరలు కిలో రూ.160కి తగ్గింపు

అయినా వేగంగా సాగని పొగాకు వేలం

పలు కేంద్రాల్లో 20 నుంచి 40శాతం వెనక్కి

వారంలో కిలోకు రూ.20 తగ్గిన సగటు ధర

రెండున్నర నెలలు గడిచినా పంటలో

10శాతం కూడా పూర్తి కాని కొనుగోళ్లు

‘కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది’ అన్న చందంగా తయారైంది దక్షిణాది పొగాకు రైతుల పరిస్థితి. మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించడం లేదు. రోజురోజుకూ ధరలు పడిపోవడంతోపాటు తిరస్కరణలు భారీగా ఉంటున్నాయి. ఆ పరిస్థితిని చక్కదిద్ది మెరుగైన ధరలతోపాటు వేలంకు తెచ్చిన బేళ్లు అన్నింటినీ కొనుగోలు చేయాలని రైతులు ఇటు ప్రభుత్వాలు, అటు ప్రజాప్రతినిధులు.. అంతకు మించి బోర్డు అధికారులు, వ్యాపారులను వేడుకుంటున్నారు. అయితే వారు ఆశించిన రీతిలో ఆయా వర్గాల నుంచి స్పందన కనిపించడం లేదు. పైగా పొగాకు బోర్డు అధికారులు తీసుకుంటున్న చర్యలతో రైతుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యింది.

ఒంగోలు, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి) : పొగాకు మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. ధరలు సరిగాలేవన్న విషయం అలా ఉంచితే గతంలో ఎన్నడూ లేనంతగా బేళ్ల తిరస్కరణలు కొనసాగుతున్నాయి. అవి సగటున 40 నుంచి 50శాతం వరకు ఉంటున్నాయి. కొన్ని వేలం కేంద్రాల్లో 70శాతం వరకు తిరస్కరణకు గురవడం పక్షంరోజుల క్రితం వరకూ ఉన్న పరిస్థితి. అలా తిరస్కరణకు గురవుతున్న బేళ్లలో 90శాతం అధికారులు సూచించిన ధరకు కొనేందుకు వ్యాపారులు ముందుకు రాక నోబిడ్‌ అవుతున్నాయి. అంటే పంట నాణ్యతను బట్టి బోర్డు అధికారులు సూచిస్తున్న ధరకు కొనేందుకు వ్యాపారులు సిద్ధంగా లేరన్న విషయం స్పష్టంగా కనిపించింది. ఇదేవిషయమై ఈనెల 1వతేదీన పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయం వద్ద సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఈ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళన సందర్భంగా బోర్డు ఉన్నతాధికారులను రైతు సంఘాల నేతలు గట్టిగా ప్రశ్నించారు. వ్యాపారుల వైఖరి అలా ఉంటే వారిని ఎందుకు నియంత్రించడం లేదని నిలదీశారు. గిట్టుబాటు ధరల కల్పనతోపాటు తిరస్కరణ బేళ్లు లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. ఇదేవిషయాన్ని వేలం కేంద్ర రైతు ప్రతినిధులతో ఈనెల 8న గుంటూరులోని బోర్డు ప్రధాన కార్యాలయంలో చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌, ఈడీ విశ్వశ్రీలు నిర్వహించిన సమావేశంలో వివిధ వేలం కేంద్రాల రైతు కమిటీ నేతలు గట్టిగా అడిగినట్లు సమాచారం.

మరింత తగ్గిపోయిన ధరలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతస్థాయి అధికారులు కూడా పొగాకు మార్కెట్‌ తీరుపై బోర్డు ఉన్నతాధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో ధరలు పెరుగుతాయని, నోబిడ్‌లు తగ్గుతాయని రైతులు ఆశించారు. కానీ మార్కెట్లో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. పొగాకు బోర్డు అధికారులు వేలం ప్రక్రియలో వ్యూహం మార్చిన ఫలితంగా ధరలు పెరగకపోగా మరింత దిగజా రాయి. ఈ సమావేశాలు నిర్వహించక ముందు వరకూ పంట నాణ్యతను బట్టి ఆయా గ్రేడ్‌లకు వేలం కేంద్రంలోని అధికారులు ఒక్కో బేలుకు ఒక ధర ప్రకటించే వారు. ఆ రేటుకు బయ్యర్లు కొనుగోలు చేయకపోతే కొంత తగ్గించేవారు. అప్పటికీ బయ్యర్లు సుముఖత చూపకపోతే ఆ బేల్‌ను నోబిడ్‌ చేసేవారు. అలా నోబిడ్‌లు భారీగా ఉండేవి. అయితే ఇటీవల ఆ విధానాన్ని మార్చేశారు. ఏ విధంగానైనా నోబిడ్‌లు తగ్గించాలన్న లక్ష్యంతో ఏకంగా ధరలను తగ్గించి వేశారు.

అయినా తగ్గని నోబిడ్‌లు

ఈనెల 8న వేలం కేంద్ర రైతు ప్రతినిధులతో బోర్డు ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించిన అనంతరం నోబిడ్‌లు 20శాతం దాటకూడదని, అవసరమైతే ధరలు తగ్గించి అయినా బేళ్ల కొనుగోలు పెరిగేలా చూడాలని స్థానిక అధికారులకు ఉన్నతాఽధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఆ సమావేశాన్ని నిర్వహించే నాటికి కనిష్ఠ ధర కిలో రూ.180 నుంచి రూ.190 ఉండగా ఆ మరుసటి రోజే రూ.175కు తగ్గింది. రెండు రోజులు రూ.170 వరకూ కొనసాగించి శుక్ర, శనివారాల్లో ఏకంగా కనిష్ఠ ధర కిలో రూ.160కి దించేశారు. ఎస్‌బీఎస్‌ రీజియన్‌లోని ఆరు కేంద్రాల్లో నాలుగు చోట్ల రూ.160, మరో రెండుచోట్ల రూ.170 పలికింది. వారం క్రితం ఉన్న కనిష్ఠ ధర కిలో రూ.180 నుంచి రూ.190 అనేది ఇప్పుడు ఏ ఒక్క కేంద్రంలోనూ కనిపించడం లేదు. అయినప్పటికీ నోబిడ్‌ బేళ్ల సంఖ్య భారీగానే ఉంటోంది.

పడిపోయిన సగటు ధర

ఈ వారంలో కనిష్ఠ ధరలు తగ్గించినా నోబిడ్‌ల సంఖ్య తగ్గకపోగా రైతులకు లభిస్తున్న సగటు ధరలు గణనీయంగా పడిపోయాయి. ఈనెల 6వతేదీ మార్కెట్‌తో పోల్చిచూస్తే శనివారం నాటికి సగటు ధర కిలోకు రూ.20 వరకు తగ్గింది. ఆమేరకు రైతులు నష్టపోతున్నారు. ఈనెల 6వ తేదీన దక్షిణాదిలో పొగాకు కిలో సగటు ధర రూ.220.50 ఉండగా శనివారం అది రూ.201.50కి పడిపోయింది. ఇదిలాఉండగా వేలం తొలిదశ ప్రారంభించి రెండున్నర నెలలైంది. పూర్తిస్థాయిలో చేపట్టి రెండు మాసాలు గడిచింది. ఇంతవరకూ పండిన పంటలో 10శాతం కూడా కొనుగోలు జరగలేదు. సుమారు 148 మిలియన్‌ కిలోల పంట పండినట్లు అంచనా కాగా ఇప్పటివరకు 14.69 మిలియన్‌ కిలోలు మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. సగటు ధర కిలో రూ.201.50గా ఉంది.

Updated Date - Jun 16 , 2026 | 01:20 AM