చెత్తశుద్ధేది?
ABN , Publish Date - Apr 19 , 2026 | 03:18 AM
ఒంగోలు పేరుకు మునిసిపల్ కార్పొరేషన్.. పారిశుధ్యం చూస్తే అధ్వానం అన్నట్లు పరిస్థితి తయారైంది. నగర పాలకసంస్థలోని పారిశుధ్య విభాగంలో అవినీతి కంపుకొడుతోంది. ప్రజారోగ్యం పేరుతో ఆ విభాగం ఉన్నతాధికారి చేతివాటం, వ్యవహారశైలి విమర్శలకు తావిస్తోంది.
ఒంగోలు కార్పొరేషన్ పారిశుధ్యంలో అవినీతి కంపు!
ఆ విభాగ అధికారి రూటే సప‘రేటు’
ప్రతినెలా ఇన్‌స్పెక్టర్ల నుంచి మామూళ్లు?
విధులకు రాని కార్మికులకు మస్టర్లు
పారిశుధ్య పనుల్లో ప్రైవేటు వ్యక్తులు
ఒంగోలు పేరుకు మునిసిపల్ కార్పొరేషన్.. పారిశుధ్యం చూస్తే అధ్వానం అన్నట్లు పరిస్థితి తయారైంది. నగర పాలకసంస్థలోని పారిశుధ్య విభాగంలో అవినీతి కంపుకొడుతోంది. ప్రజారోగ్యం పేరుతో ఆ విభాగం ఉన్నతాధికారి చేతివాటం, వ్యవహారశైలి విమర్శలకు తావిస్తోంది. ప్రత్యేకించి పైసల వసూలే లక్ష్యంగా ఆ విభాగం పనితీరు ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అందులో పనిచేసేవారు తక్కువ, పెత్తనం చేసేవారు ఎక్కువయ్యారు. కొంతమంది కార్మికు లు విధులకు హాజరుకాకుండా ప్రతినెలా జీతాలు తీసుకుంటూ ఇతరులతో పారి శుధ్య పనులు చేయిస్తున్నారు. ఇది తెలిసినప్పటికీ అధికారులు మిన్నకుండటం వెనుక భారీ మొత్తాలు ముట్టడమే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.
ఒంగోలు కార్పొరేషన్, ఏప్రిల్18 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరంలో 50 డివిజన్లు, సుమారు 3లక్షలకు పైన జనాభా ఉన్నారు. అందుకు అనుగుణంగా 681 మంది కాంట్రాక్టు పద్ధతిన పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. పర్మినెంట్ వర్కర్లు సుమారు 160మంది వరకు ఉన్నారు. ప్రభుత్వం ఔట్ సోర్సింగ్‌కు స్వస్తిపలికి, ఆప్కాస్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. పారిశుధ్య కార్మికుల పేరుతో ఉద్యోగాలు చేస్తున్న వారిలో గత కొన్నేళ్లుగా ఉన్నవారు తప్ప కొత్తగా చేరిన వారిలో ఒక్కరు కూడా చీపురు పట్టరు. పేరుకు కార్మికుడు.. చేసేది మేస్త్రీ పని. అంటే పెత్తనం చేయడమే. వాస్తవానికి 681 మంది కార్మికులు ఉండగా50 మందికి ఒక మేస్త్రీ ఉండాలి. కానీ ఇక్కడ లెక్కకు మించి మేస్త్రీలు పనిచేస్తున్నారు. మస్టర్లలో మాయాజాలం చోటుచేసుకుంటోంది. ఈ లొసుగులన్నీవిభాగం అధికారికి తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా వసూళ్లలో వాటాలు చెల్లించాలని డిమాండ్ చేయడం ఇప్పుడంతా చర్చనీయాంశమైంది.
వసూళ్లపైనే అధికారి ధ్యాస
నగరంలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది వీధులను శుభ్రం చేయడంతోపాటు, ఇంటింటి చెత్త సేకరణలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. ప్రతిరోజూ ఇంటింటి చెత్త సేకరణ చేయాల్సి ఉండగా, వారానికి మూడు రోజులు మాత్రమే కార్మికులు వస్తుండటంతో ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజారోగ్య అధికారి మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పైసల వసూలే లక్ష్యంగా ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై తనిఖీలు, ఇన్‌స్పెక్టర్ల నుంచి నెలవారీ మామూళ్లపైనే దృష్టిసారించినట్లు తెలు స్తోంది. ముఖ్యంగా హోటళ్లు, లాడ్జీలు, ఆసుపత్రుల నుంచి అత్యధిక మొత్తంలో వసూలు చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించడంతోపాటు, వాటిలో వాటాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రతి మూడు నెలలకు ఒకసారి కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వహించి వారి ఆరోగ్యంపై దృష్టిసారించాల్సిన ఎంహెచ్‌వో ఆవిషయాన్ని అసలు పట్టించుకోవడం లేదు.
నిబంధనలకు విరుద్ధంగా చెత్త సేకరణ
నగరంలో900మంది వరకు పారిశుధ్య కార్మికులు ఉన్నారు. వారికి ప్రతినెలా వేలల్లోనే వేతనాలు చెల్లిస్తున్నారు. వారు వారి విధులను క్రమం తప్పకుండా రోజువారీ పనులు చేస్తే పారిశుధ్యం మెరుగుపడటం ఖాయం. అయితే ఇటీవల కాలంలో కర్నూలు ప్రాంతానికి చెందిన ఓ ఐదు కుటుంబాల వారు నగరంలోని ఓ ఐదు డివిజన్లలో చెత్తను సేకరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కార్పొరేషన్ పేరుతో ప్రైవేటు వ్యక్తులుసొంతంగా ఆటోను ఏర్పాటు చేసుకుని ఇంటింటి చెత్త సేకరణ చేయడం, ప్రతి ఇంటి నుంచి నెలకు రూ.50 వసూలు చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త సేకరణకు డబ్బులు చెల్లించడం ఏమిటని ప్రశ్నిస్తే కార్పొరేషన్ వారు తమకు జీతాలు ఇవ్వరంటూ వారు బదులివ్వడం అధికారుల తీరుపై అనుమానాలను పెంచుతున్నాయి. అదేమని అడిగితే మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ తమకు చెత్త సేకరణ చేసుకోమని తెలిపారని కార్మికులు తెలియజేస్తున్నారు. కార్పొరేషన్‌కు సంబంధం లేకుండా సొంతంగా చెత్త సేకరణ చేసి ఇష్టారాజ్యంగా వసూలు చేయడం వెనుక అధికారులకు వాటాలు ఉన్నాయన్న సందేహాలు కలుగుతున్నాయి.