Share News

స్పష్టతేదీ?

ABN , Publish Date - Jul 19 , 2026 | 02:53 AM

భూ సమస్యలు, ఇతరత్రా సమస్యలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్‌ రాజాబాబు కందుకూరు నియోజకవర్గంలో చేపట్టిన ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. వీటిలో మూడింట రెండొంతులు రెవెన్యూ సమస్యలే ఉంటున్నాయి.

స్పష్టతేదీ?
వలేటివారిపాలెంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు ఇచ్చేందుకు బారులు తీరిన ప్రజలు

కరువైన ప్రత్యేక చొరవ

నియోజకవర్గ పీజీఆర్‌ఎస్‌లో వెల్లువెత్తుతున్న వినతులు

రెవెన్యూ సమస్యలే కోకొల్లలు

జిల్లా అధికారులు వచ్చినా అదే తీరు

మండల అధికారుల్లో లేని మార్పు

రీసర్వే సమస్యల కు పరిష్కారం చూపనిదే ఫలితం శూన్యం

భూ సమస్యలు, ఇతరత్రా సమస్యలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్‌ రాజాబాబు కందుకూరు నియోజకవర్గంలో చేపట్టిన ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. వీటిలో మూడింట రెండొంతులు రెవెన్యూ సమస్యలే ఉంటున్నాయి. అందులోనూ రీసర్వే తప్పుల వల్ల వచ్చిన తిప్పలకు సంబంధించినవే అధికం. సమస్యలపై అర్జీలు అందజేసిన పలువురు ప్రజలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని, రీసర్వే తప్పులను హేతుబద్ధంగా సరిచేయాల్సిన అధికారులు పెడుతున్న తికమకలను కలెక్టర్‌కు వివరించారు. తహసీల్దార్‌లు ప్రత్యేక చొరవతో రంగంలోకి దిగితే తప్ప ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని నిర్వహించినా ఫలితం ఉండదని కూడా వారు కలెక్టర్‌కు స్పష్టంగా చెప్పడం విశేషం.

కందుకూరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : ప్రతి నియోజకవర్గంలో వరుసగా నాలుగు వారాలు నాలుగు మండలాల్లో సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్న లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌లను ఇప్పటికే కందుకూరు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో నిర్వహించారు. మొదటగా మండల కేంద్రమైన లింగసముద్రం, అనంతరం కందుకూరులోని సబ్‌కలెక్టరు కార్యాలయంలో ఈకార్యక్రమాన్ని పూర్తి చేశారు. శుక్రవారం వలేటివారిపాలెంలో ఏర్పాటు చేశారు. తొలుత లింగసముద్రంలో నిర్వహించిన కార్యక్రమం కన్నా రెండోసారి కందుకూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్జీలు పెరిగాయి. శుక్రవారం వీవీపాలెంలో వినతులు వెల్లువెత్తాయి. ఈ ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌తోపాటు జేసీ కల్పనాకుమారి, సబ్‌కలెక్టరు హిమవంశీ, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు జిల్లా అధికారులంతా పాల్గొన్నారు. ప్రజల నుంచి 340కిపైగా అర్జీలు అందాయి. అయితే అర్జీలు ఇవ్వదలచిన వారంతా వీవీపాలెం రావాల్సిన అవసరం లేదని ముందురోజే అధికారులు ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత మండలంలో ఉన్న 15 సచివాలయాల్లో 15మంది జిల్లాస్థాయి అధికారులు వచ్చి ప్రజల నుంచి స్వీకరిస్తారని ప్రచారం చేయడంతో అనేకమంది వాటిల్లోనే తమ అర్జీలను అందజేశారు. ఇలా సచివాలయాల్లో అందజేసినవి ఆన్‌లైన్‌ కానప్పటికీ అవి మరో 300కిపైగా ఉన్నట్లు సమాచారం.

భూసమస్యలు.. రీసర్వే తికమకలు

రీ సర్వేలో ప్రధానంగా చోటుచేసుకున్న పొరపాట్లపై పీజీఆర్‌ ఎస్‌లలో ఎక్కువ అర్జీలు వస్తున్నాయి. 90 శాతం వరకు విస్తీర్ణా లలో తేడాలపైనే ఉంటున్నాయి. ముఖ్యంగా భూముల విలువ పెరిగి ఎకరం ధర రూ.10 లక్షలకు తక్కువ కాకుండా కోట్లలో పలుకుతున్న తరుణంలో తమకున్న వాస్తవ విస్తీర్ణంలో సెంటు తగ్గినా రూ.10వేల నుంచి లక్షల్లో రైతులు నష్టపోతున్న పరిస్థితి. గట్లు ఆధారంగా పాయింట్లు తీసుకుంటున్న రీసర్వే సిబ్బంది దానినిప్రాథమిక ప్రామాణికంగా తీసుకుని పాత ఎఫ్‌ఎంబీలతో సరిచూసుకుని విస్తీర్ణాలలో తేడాలు రాకుండా హద్దులు నిర్ణయిం చలేదు. దీంతో అనేకమందికి వారికి వాస్తవంగా ఉన్న భూమి కన్నా రీసర్వేలో విస్తీర్ణం పెరగ్గా పక్కనే ఉన్న వారికి తగ్గింది.

అధికారులు పట్టించుకోకనే సమస్యంతా..

భూ విస్తీర్ణంలో తేడాలను సరిచేయాల్సిన అధికారుల తీరు ‘దున్నపోతు ఈనింది అంటే గాట కట్టేయండి’ అన్న చందంగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. రీసర్వేలో ఎకరానికి 5 సెంట్ల వరకూ తగ్గినా, పెరిగినా పట్టించుకోనవసరం లేదని.. ఆ తేడాలు సరిచేయలేమని గుడ్డిగా సమాధానం ఇచ్చి పీజీఆర్‌ఎస్‌లో ఇచ్చిన అర్జీలు పరిష్కారమైనట్లు చూపిస్తున్నారని రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఆయా సర్వే నెంబర్లలో అందరికీ మొత్తం విస్తీర్ణం తగ్గటమో, పెరగడమో జరిగితే నిబంధన చెప్పి మాకు తగ్గించి పక్క చేనువారికి పెంచడం ఏమిటని రైతులు కలెక్టరు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలపై తహసీల్దార్‌, ఇతర అధికారులు క్షేత్ర పర్యటన చేసి వాస్తవాలు పరిశీలించి సరిచేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ అవి అమలుచేయడం లేదు. మీ పక్కన విస్తీర్ణం పెరిగిన వారి వద్ద అనుమతి తీసుకుంటే వారిది తగ్గించి మీ విస్తీర్ణం సరిచేస్తామని అధికారులు బదులిస్తున్నారు. అయాచితంగా విస్తీర్ణం పెరిగిన వారు ఎందుకు తగ్గించుకోవడానికి సిద్ధపడి సంతకం పెడతారో కూడా ఆలోచించకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు.

ప్రభుత్వ భూములుగా బావులు

మెట్టప్రాంతమైన కందుకూరు నియోజకవర్గంలోని పొలాల్లో విస్తారంగా వ్యవసాయ బావులు ఉంటాయి. రమారమి ప్రతి పదిహేను, ఇరవై ఎకరాలకు ఒక వ్యవసాయ బావి కనిపిస్తుం ది. ఒక్కో బావి కనీసం 10సెంట్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇంత పెద్దబావులను కొందరు రైతులు సొంతంగా తవ్వుకోగా అధిక శాతం మంది ఇద్దరు, ముగ్గురు కలిసి అందరికీ అందుబాటులో ఉండే ఒకప్రాంతంలో తమ సొంత భూమిలో తవ్వుకుంటారు. అయితే రీసర్వేలో ఈ ఉమ్మడి వ్యవసాయ బావులన్నింటినీ ప్రభుత్వ భూములుగా నమోదు చేసేశారు. దీంతో తమ భూముల విస్తీర్ణాలు తగ్గిపోవడమే గాక లక్షలు వెచ్చించి తాము తవ్వుకున్న బావులపై భవిష్యత్తులో హక్కు కూడా లేకుండాపోయే పరిస్థితిని తెచ్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపైనా పెద్దఎత్తున అర్జీలు అందాయి. ఈ పరిస్థితుల్లో సమస్యకు తగిన మందు వేసేలా జిల్లా అధికార యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలతో మండలస్థాయి రెవెన్యూ అధికారులు, సిబ్బందితో పనిచేయిస్తే తప్ప ఎన్ని ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌లు నిర్వహించినా ప్రయోజనం ఉండదని రైతులు వాపోతున్నారు.

Updated Date - Jul 19 , 2026 | 02:53 AM