Share News

మేమింతే..!

ABN , Publish Date - Mar 22 , 2026 | 01:37 AM

జిల్లాలో రెవెన్యూ అధికా రుల తీరు మారడం లేదు. ‘మేమింతే..’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో అక్రమాలకు పాల్పడిన పలువురిపై ఉన్నతాధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారిని కూడా వదలలేదు.

మేమింతే..!
పెద్దారవీడు తహసీల్దార్‌ కార్యాలయం

కొనసాగుతున్న అవినీతి, అక్రమాలు

చర్యలు తీసుకుంటున్నా షరా మామూలే

ఉద్యోగ విరమణ చేసినా వదలని తప్పులు

తాజాగా పెద్దారవీడు తహసీల్దార్‌, దేవరాజుగట్టు వీఆర్వోపై సస్పెన్షన్‌ వేటు

మార్కాపురం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రెవెన్యూ అధికా రుల తీరు మారడం లేదు. ‘మేమింతే..’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో అక్రమాలకు పాల్పడిన పలువురిపై ఉన్నతాధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారిని కూడా వదలలేదు. అయినప్పటికీ ప్రస్తుతం పనిచేస్తున్న కొందరు తహసీల్దార్‌లు, వీఆర్వోలు కాసులకు కక్కుర్తిపడి భూమాయ ప్రదర్శిస్తున్నారు. ఒకరి భూమిని మరొకరికి ఆన్‌లైన్‌ చేయడం, ఒకే భూమిని పలువురు రైతులకు పట్టాలివ్వడం, అక్రమంగా మ్యుటేషన్‌ చేయడం వంటి వ్యవహారాలను కొనసాగిస్తున్నారు. తాజాగా పెద్దారవీడు తహసీల్దార్‌ దిలీప్‌కుమార్‌తోపాటు దేవరాజుగట్టు వీఆర్వో విజయ్‌భాస్కర్‌రెడ్డిని కలెక్టర్‌ రాజాబాబు సస్పెండ్‌ చేశారు. వీరిద్దరూ అసైన్‌మెంట్‌ భూములను హక్కుదారులకు కాకుండా ఇతరుల పేర్లతో మ్యుటేషన్‌ చేసినట్లు తేలడంతో కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పెద్దారవీడు మండలంలో పలువురు రైతుల అసైన్‌మెంట్‌ భూములపై కన్నేసిన కొందరు అక్రమంగా వాటిని తమ పేర్లపై బదలాయించుకునేందుకు మ్యుటేషన్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్వోతోపాటు తహసీల్దార్‌ను ప్రసన్నం చేసుకున్నారు. మెడికల్‌ లీవ్‌లో ఉండి మరీ తహసీల్దార్‌ దిలీప్‌కుమార్‌ ఆన్‌లైన్‌లో మ్యుటేషన్‌లకు డిజిటల్‌ సైన్‌ ఇచ్చేశారు. అనారోగ్యంతో తూర్పుగోదావరి జిల్లాలోని ఒక వైద్యశాలలో చికిత్స పొందుతున్న తహసీల్దార్‌ దిలీప్‌కుమార్‌... దేవరాజుగట్టు వీఆర్వో విజయ్‌భాస్కర్‌రెడ్డితో ఫైళ్లను, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ద్వారా డిజిటల్‌ సిగ్నేచర్‌ (డీఎస్‌)ను తెప్పించుకుని అక్రమాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. దాదాపు 30 ఫైళ్లను ఈ తరహాలో ఓకే చేసేశారంటే ఎంతకి బరితెగించారో అర్థమవుతుంది. అందులో ఒకే రోజు 15 ఫైళ్లను క్లియర్‌ చేసినట్లు తెలిసింది. దేవరాజుగట్టులోని ఒక పట్టా భూమిని కూడా ఇతరులకు తప్పుడు పత్రాలతో ఆన్‌లైన్‌ చేసినట్లు అధికారులకు ఫిర్యాదు రావడంతో విచారణ ప్రారంభించారు. అందులో అసలు బండారం బయటపడింది. దీంతో కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 01:38 AM