మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏవీ..!
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:02 AM
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
పంట చేతికొచ్చే సమయంలో దళారుల రంగప్రవేశం
ప్రభుత్వ మద్దతు ధర రూ.2400కు కొనుగోలు చేయని వ్యాపారులు
పంగులూరు మండలంలో 3,700 ఎకరాల్లో సాగు
పంగులూరు, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మండలంలో రబీ పంటగా 3,700 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేపట్టారు. గత ఏడాది నల్లబర్లీ, మిరప సాగుతో భారీగా నష్టపోయిన రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధర క్వింటా 2400 రూపాయలుగా ఉండటంతో ఈ ఏడాది మొక్కజొన్న సాగువైపు మొగ్గు చూపారు. మొక్కజొన్న విస్తారంగా సాగుచేసిన కొండమూరు, రేణంగివరం, బూదవాడ పరిసర గ్రామాలలో కోతలు మొదలయి పంట చేతికొస్తున్న సమయంలో ప్రైవేటు వ్యాపారులు క్వింటా 1750 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. దిగుబడులు 35 క్వింటాళ్లుగా ఉండగా కౌలు, పెరిగిన పెట్టుబడి రాని పరిస్థితి నెలకొందని కౌలురైతులు ఆందోళన చెందుతున్నారు. కొండమూరు గ్రామంలో 1900 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేపట్టగా, కొండమంజులూరులో వెయ్యి ఎకరాలలో, బూదవాడలో 900 ఎకరాలలో మొక్కజొన్న సాగుచేపట్టారు. చందలూరు, పంగులూరు, కోటపాడు, నూజెళ్లపళ్లి, రేణంగివరం, తక్కెళ్లపాడు, కొప్పెరపాడు పరిసర గ్రామాలలోనూ సాగుచేశారు. పంట పూర్తిగా చేతికొచ్చే సమయానికి ధరలు దిగజారే పరిస్థితి ఉందని, ప్రభుత్వం త్వరితగతిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మద్దతుధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.