ఏం ‘పట్టా’ లేదు!
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:44 AM
పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో తీవ్రజాప్యం నెలకొంది. రెవెన్యూ యంత్రాంగం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇతర జిల్లాల్లో పాసుపుస్తకాల పంపిణీ దాదాపు పూర్తికాగా ఉమ్మడి ప్రకాశంలో భారీగా పెండింగ్‌లో ఉండిపోయాయి.
పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో తీవ్రజాప్యం
రాష్ట్రంలోనే వెనుకబడిన ఉమ్మడి జిల్లా
ఇంకా 23వేలు పెండింగ్
టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులపై కలెక్టర్ సీరియస్
సామాజిక పింఛన్ల తరహాలో ఇచ్చేందుకు చర్యలు
జడ్పీ సీఈవో, డీపీవో, ఎంపీడీవోలతో మాట్లాడిన జేసీ
నేడు పంపిణీ పూర్తిచేయాలని ఆదేశం
పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో తీవ్రజాప్యం నెలకొంది. రెవెన్యూ యంత్రాంగం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇతర జిల్లాల్లో పాసుపుస్తకాల పంపిణీ దాదాపు పూర్తికాగా ఉమ్మడి ప్రకాశంలో భారీగా పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ విషయంలో రాష్ట్రంలోనే జిల్లా బాగా వెనుకబడిపోయింది. దీంతో కలెక్టర్ రాజాబాబు శనివారం ఉదయం తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పింఛన్ల తరహాలో ఒక్కరోజులోనే మిగిలిన మొత్తం పంపిణీ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఆదివారం పూర్తిస్థాయిలో అందజేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది.
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో రెవెన్యూ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా సర్వే చేసి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బొమ్మతో పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఆ పాసుపుస్త కాలపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈనేపథ్యంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పాసు పుస్తకాలను రద్దు చేస్తామని, సర్వేలో చోటు చేసు కున్న తప్పులను సరిచేసి రాజముద్రతో ఇస్తామని హామీ ఇచ్చారు. తదనుగుణంగా జిల్లాలో రీసర్వే చేసిన గ్రామాల్లో ఇప్పుడు పాసుపుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 72,841 పాసుపుస్తకాల పంపిణీకి ప్రభుత్వం ఆదేశించింది.
2వతేదీ నుంచే పంపిణీ ప్రారంభం
జిల్లాలో ఈనెల 2వతేదీ నుంచి 9వతేదీ వరకూ గ్రామాల వారీ పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి అధికారులు కార్యాచరణ రూపొందించారు. తొలిరోజు జిల్లావ్యాప్తంగా పంపిణీ చేసిన రెవెన్యూ యంత్రాం గం ఆతర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భారీగా పెండింగ్‌లో ఉండిపోయాయి. రాష్ట్రస్థాయిలో కూడా జిల్లా పూర్తిగా వెనుకబడిపోయింది. దీంతో కలెక్టర్ రాజాబాబు శనివారం ఉదయం రెవెన్యూ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆర్డీవోలు, తహసీల్దార్లతో ఉమ్మడి జిల్లాలోని మండలాల వారీగా సమీక్షించినట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రంలోపు పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకూ 49,532 పుస్తకాలను మాత్రమే పంపిణీ చేసినట్లు సమాచారం. మరో 23,309 పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.
సామాజిక పింఛన్ల తరహాలో
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పాసుపుస్తకాలను సామాజిక పింఛన్ల తరహాలో ఒకే రోజు రైతులకు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆదేశించినట్లు సమాచారం. ఆయన శనివారం జడ్పీ సీఈవో, డీపీవో, జిల్లా సచివాలయ అధికారి, ఎంపీడీవోలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. తహసీల్దార్లను సమన్వయం చేసుకొని ఎంపీడీవోలు బాధ్యత తీసుకొని సచివాలయ సిబ్బంది ద్వారా రైతుల నుంచి ఈకేవైసీ చేయించి పాసుపుస్తకాలను పంపిణీ చేయాలని ఆదేశించారు.
రెవెన్యూ తీరుపై ఆరోపణలు
రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాల పంపిణీలో అలసత్వం ప్రదర్శించడంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. వీరి నిర్లక్ష్యం కారణంగానే ఇతర శాఖలను వారు చేయాల్సిన పనులకు వినియోగించాల్సి వచ్చింది. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అందులో రెవెన్యూ శాఖదే అగ్రస్థానం. అటువంటిది ఇప్పుడు పట్టాదారు పాసుపుస్తకాలను ఎంపీడీవోల భాగస్వామ్యంతో సామాజిక పింఛన్ల తరహాలో పంపిణీ చేయాల్సి వచ్చిందంటే ఆ శాఖ పనితీరు ఏవిధంగా ఉందో అర్థమవుతుంది.