Share News

వెలిగొండ పూర్తి కోసం అహర్నిశలు శ్రమించాం

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:41 PM

‘గత వైసీపీ ప్రభుత్వం చేసినట్టు మేము మోసం చేయలేదు.. వెలిగొండ పూర్తి చేస్తాం.. ఈ నెలకు మొదటి దశ పూర్తిచేసి నీరిస్తామని చెప్పాం.. ఆ మాట ప్రకారం నీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, దేవదాయశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు స్పష్టం చేశారు.

వెలిగొండ  పూర్తి కోసం అహర్నిశలు శ్రమించాం
మాట్లాడుతున్న మంత్రులు నిమ్మల, ఆనం, పక్కన కలెక్టర్‌ విజయసునీత, ఎమ్మెల్యే ఉగ్ర

మీ శ్రేయస్సుపై సీఎం ఎంతో శ్రద్ధ పెట్టారు

నిర్వాసితులెవ్వరికీ అన్యాయం జరగదు

అర్హత ఉన్నవారందరికీ పరిహారం

నెలాఖరులో నీరిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం

రాష్ట్ర మంత్రులు నిమ్మల, ఆనం

మార్కాపురం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : ‘‘గత వైసీపీ ప్రభుత్వం చేసినట్టు మేము మోసం చేయలేదు.. వెలిగొండ పూర్తి చేస్తాం.. ఈ నెలకు మొదటి దశ పూర్తిచేసి నీరిస్తామని చెప్పాం.. ఆ మాట ప్రకారం నీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, దేవదాయశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో వెలిగొండ పురోగతి, ఆర్‌అండ్‌ఆర్‌ అంశాలపై అధికారులతో మంత్రులు సమీక్షించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న నిర్వాసితుల్లో కొందరిని పిలిచి మంత్రులు మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ నిర్వాసితులకు ఇవ్వాల్సిన రూ.905 కోట్లు పరిహారం ఇచ్చిన తరువాతే నీరు వదులుతామన్నారు. 7,321 మంది నిర్వాసితుల్లో ఇప్పటికే కొందరికి రూ.318 కోట్లు ఇచ్చామని, మిగిలిన మొత్తం కూడా త్వరలోనే వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఇంకా తమకు గడువు కావాలని కోరటం, ఇప్పటికిప్పుడు ఖాళీ కుదరదని అనటం సరికాదన్నారు. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2026లో వెలిగొండ మొదటి ఫేజ్‌ పూర్తి చేసి నల్లమల సాగర్‌కు నీరిస్తామని చెబుతూనే ఉన్నామని గుర్తుచేశారు. ఈ ప్రాంత ప్రజలు, వెలిగొండపై సీఎం చంద్రబాబు శ్రద్ధ చూపారని, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పదేపదే సమీక్షించారని చెప్పారు. అందులో భాగంగానే తాను ప్రతి నెలా వచ్చి అహర్నిశలు కష్టపడ్డానని, తనతోపాటు అధికారులు, ఏజెన్సీలు అందరూ సహకరించడంతో ప్రాజెక్టు పూర్తయిందని తెలిపారు. ఈ రెండేళ్లలో టన్నెల్‌లో 7 కి.మీ లైనింగ్‌ పనులు పూర్తి చేశామని, రూ.456 కోట్లతో ఫీడర్‌ కాలువ బలోపేతం చేశామని, రెండో టన్నెల్‌లో అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్‌ తొలగించే పని ఇప్పటికే 90 శాతం పూర్తి చేయగా 18వ తేదీనాటికి అది కూడా పూర్తవుతుందన్నారు. వైసీపీ హయాంలో జగన్‌ జాతికి అంకితం అంటూ దగా చేసిన ప్రాజెక్టుకు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చుచేసి నీరిస్తుందన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఉదయగిరి ఎమ్మెల్యేలు డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, కందుల నారాయణరెడ్డి, కాకర్ల సురేష్‌, వై.పాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, కలెక్టర్‌ ఎం. విజయసునీత, జాయింట్‌ కలెక్టర్‌ పి. శ్రీనివాసులు, ఇన్‌చార్జి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా, ఇరిగేషన్‌ అడ్వయిజర్‌ ఎం.వెంకటేశ్వరరావు, వెలిగొండ సీఈ రమేష్‌, ఎస్‌ఈ అబుతలీం పాల్గొన్నారు.


ఏ ఒక్క నిర్వాసితుడూ ఆందోళన చెందొద్దు

ఏ ఒక్క నిర్వాసితుడూ ఆందోళన చెందవద్దని మంత్రి నిమ్మల చెప్పారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులతో చెప్పామని, ఆ దిశగా కలెక్టరేట్‌లో ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామాల్లో పర్యటించి ప్రజల ఫిర్యాదులు తీసుకునేలా కలెక్టర్‌ విజయసునీత ప్రత్యేక టీమ్‌లను కూడా నియమించారన్నారు. ప్రధానంగా నిర్వాసితులు అడుగుతున్న డిమాండ్లలో ఇంకా జాబితాలో చోటులేని వారికి న్యాయం చేయాలని, పేర్లు తప్పులు కారణంగా పరిహారం అందనివారు, గతంలో భూమి ఉండి సాగులో ఉన్నా రికార్డుల్లో చుక్కల భూమిగా ఉండటంతో వారికి పరిహారం రాలేదనే అంశాలు సమీక్షలో వచ్చాయన్నారు. ఇవన్నీ చాలావరకు న్యాయబద్దమైనవేనని, మానవీయకోణంలో చేయాల్సి వస్తే తప్పకుండా సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 2019లో కటాఫ్‌ తేదీగా నిర్ణయించటం వల్ల ఇప్పుడు 18 ఏళ్లు నిండిన వారికి నష్టం జరుగుతుందని దానిని పరిష్కరించాలని కోరుతున్నారని చెప్పారు. ఇది 2013 యాక్ట్‌తో ముడిపడిన విషయమని, ఒక్క వెలిగొండ కాకుండా అంతటా ఉంటుందని చెప్పారు. అయినప్పటికీ ఈ విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళతామన్నారు. రోడ్డుపై బైఠాయించి ఉన్న నిర్వాసితులందరినీ దగ్గరకు పిలిచి మంత్రులు మాట్లాడారు. వారికి అర్థమయ్యేలా అన్ని విషయాలు వివరించి నీటి విడుదలకు సహకరించాలని కోరారు. వారికి స్పష్టమైన హామీ లభించటంతో నిర్వాసితులు నిరసన విరమించి వెళ్లిపోయారు.

Updated Date - Aug 13 , 2026 | 11:41 PM