పొగాకు రైతులకు అండగా ఉంటాం
ABN , Publish Date - Jul 22 , 2026 | 01:19 AM
పొగాకు, ఆక్వా రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని కేంద్ర ఆర్థిక, వాణిజ్య శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత సీజన్ పొగాకు మార్కెట్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితిని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్ర బృందానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ హామీ
జీఎస్టీ తగ్గింపు, మొత్తం పంట కొనుగోలు, ఇతర అంశాలపై చర్చించిన రాష్ట్ర మంత్రులు
పొగాకు, ఆక్వా రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని కేంద్ర ఆర్థిక, వాణిజ్య శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత సీజన్ పొగాకు మార్కెట్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితిని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పండిన పంట మొత్తాన్ని వ్యాపారులు కొనుగోలు చేసేంత వరకు సాగుదారులకు అండగా నిలుస్తామన్నారు. ఆ మేరకు పొగాకు రైతుల పక్షాన రాష్ట్రప్రభుత్వం తరఫున ఢిల్లీ వెళ్లిన బృందానికి వారు హామీ ఇచ్చారు.
ఒంగోలు, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో పొగాకు, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమ స్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు నేతృత్వంలో జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ స్వామి, గొట్టిపాటి రవికుమార్ ఢిల్లీ వెళ్లారు. సోమ, మంగళవారాల్లో పొగాకు పంటకు సంబంధించి వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌గోయల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆక్వాపై సంబంధిత కేంద్ర మంత్రి రాజీవ్‌రంజన్‌సింగ్‌లను కలిశారు. రాష్ట్రప్రభుత్వం తరఫున సీఎం రాసిన లేఖలను వారికి అందజేసి ఆయా అంశాలపై చర్చించారు. ఈ బృందం వెంట రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్‌నాయుడు, బి.శ్రీనివాసరాజు, టీడీపీ పార్లమెంట్‌పక్ష నాయకుడు లావు శ్రీకృష్ణదేవ రాయులు, ఒంగోలు, రాజమండ్రి ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, దగ్గుబాటి పురందీ శ్వరిచ మరికొందరు ఉన్నారు.
మార్కెట్‌ను గాడిలో పెట్టాలి
రాష్ట్రంలో ప్రస్తుత పొగాకు మార్కెట్ సంక్షోభా నికి ప్రధానంగా పొగాకుపై గతంలో ఉన్న 28శాతం జీఎస్టీని 40శాతానికి పెంచడమే కారణ మని, దానిని తగ్గించాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర మంత్రుల బృందం కోరింది. రాష్ట్రంలో పంట ఉత్పత్తి, మార్కెట్లో వ్యాపారుల వైఖరి, దాని వల్ల ధరలు లేక.. కొనుగోళ్లు సాగక రైతులు పడుతున్న ఇబ్బందులను ఇరువురు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లింది. సత్వరం మార్కెట్‌ను గాడిలో పెట్టి కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే రైతుల నుంచి పొగాకు బోర్డు వసూలు చేసిన డబ్బును ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.
సానుకూల స్పందన
ఆయా అంశాలపై కేంద్ర మంత్రులిద్దరూ సానుకూలంగా స్పందించి తగు చర్యలకు హామీ ఇచ్చారని ప్రభుత్వ బృందంలోని సభ్యుడైన జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి తెలిపారు. పొగాకు రైతులకు కేంద్రం అండగా నిలుస్తుందన్న స్పష్టమైన హామీ వారి నుంచి వచ్చిందన్నారు. కాగా నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం రాష్ట్రమంత్రుల బృందం ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను కలిసింది. రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవసాయరంగ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు, ఇతర పలు అంశాలను ఆయనతో చర్చించింది.
మరింత పెరిగిన నోబిడ్‌లు
రాష్ట్రంలో పొగాకు మార్కెట్లో నెలకొన్న సంక్షోభ నివారణ కోసం కేంద్ర పెద్దలను రాష్ట్రమంత్రులు కలిసి చర్చించడం, వారు సానుకూలంగా స్పందించినట్లు చెప్తుండగా స్థానికంగా మాత్రం రైతులకు ఊరట కనిపించడం లేదు. గతవారం నోబిడ్‌లు తగ్గినట్లు కనిపించినా మళ్లీ పెరుగుతున్నాయి. దక్షిణాదిలోని 11 కేంద్రాలలో మంగళవారం 6,921 రైతులు బేళ్లను వేలానికి తీసుకురాగా 4,120 బయ్యర్లు కొనుగోలు చేశారు. మిగిలిన 2,801 బేళ్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. అందులో 2,362 (34శాతం) నోబిడ్ అయ్యాయి. అవి అత్యధికంగా వెల్లంపల్లిలో 46.92శాతం ఉన్నాయి. కనిగిరిలో 46.45శాతం, ఒంగోలు-2లో 44.62శాతం, డీసీపల్లిలో 43.84శాతం ఒంగోలు-1లో 42.97శాతం, పొదిలిలో 39.77శాతం నోబిడ్ అయ్యాయి.