రైతుల సమస్యలను పరిష్కరిస్తాం
ABN , Publish Date - Mar 03 , 2026 | 01:53 AM
రైతుల భూసమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం జరుగుమల్లి మండ లం పైడిపాడు గ్రామంలో రైతులకు ఆయన మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
మంత్రి డాక్టర్ శ్రీబాలవీరాంజనేయస్వామి
పైడిపాడులో పాస్‌పుస్తకాల పంపిణీ
పాల్గొన్న మారిటైం బోర్డు చైర్మన్ సత్య
పైడిపాడు(కొండపి), మార్చి 2 (ఆంధ్రజ్యోతి) : రైతుల భూసమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం జరుగుమల్లి మండ లం పైడిపాడు గ్రామంలో రైతులకు ఆయన మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రూ.700 కోట్ల ప్రజాధనం ఖర్చుచేసి హద్దురాళ్లు, పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలు వేసుకున్నదన్నారు. అప్పటి పాలకులు భూములను 22ఏలో చేర్చడం, తర్వాత ఫ్రీహోల్డ్ చేసి తమ పేర్లపై మార్చుకోవడం చేశారన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేశారన్నారు. భూముల వివరాలను క్యూఆర్ కోడ్ ద్వారా వారసులు తెలుసుకునే విధంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పాస్ పుస్తకాలు రూపొందించారన్నారు. భవిష్యత్‌లో మరిన్ని రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదన్నారు. మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ కొండపి నియోజకర్గంలోని మర్రిపూడి, పొన్నలూరు, జరగుమల్లి మండలాల్లో రైతులకు భూసమస్యలు అధికంగా ఉన్నాయన్నారు. వాటి పరిష్కారానికి మంత్రి స్వామి, తాను పనిచేస్తున్నామని చెప్పారు. కొందరు రెవెన్యూ అధికారులు రైతులను పదేపదే తిప్పుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. కొండపి నియోజకవర్గంలోని రైతులు పూర్తిగా పొగాకుపై ఆధారపడి జీవిస్తున్నారని, కొన్నిసార్లు నష్టపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా హార్టికల్చర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ కె.వెంకటేశ్వరరావు, ఎంపీడీవో రమణమూర్తి, టీడీపీ నాయకుడు కర్ణా కోటిరెడ్డి, పేముల విజయనిర్మల, టీడీపీ మండల అధ్యక్షుడు పోకూరి రవీంద్రబాబు, సొసైటీ చైర్మన్లు జి.వెంకటేశ్వర్లు, నలమోతు వెంకటేశ్వర్లు, కామేపల్లి పోలేరమ్మ, ఆలయ చైర్మన్ పోటు రవీంద్రబాబు, కామేపల్లి మాజీ సర్పంచ్ ఏలూరి రాంబాబు, నాయకులు నరాల సోమయ్య, కొమ్మాలపాటి కృష్ణ, పాతూరి కోటేశ్వరరావు, దగ్గుమాటి సుబ్బారెడ్డి, బత్తిని కృష్ణారావు, పూర్ణచంద్రరావు, ఎనిమిరెడ్డి రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.