Share News

అన్ని రంగాల్లో ప్రకాశించేలా చేస్తాం

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:06 AM

అన్ని రంగాల్లోనూ జిల్లా ప్రకాశిం చేలా చర్యలు తీసుకుంటున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఆవిర్భావ వేడుకలు సోమవారం ఒంగోలులోని కలెక్టరేట్‌లో ఘనంగా జరిగాయి. ముందుగా జిల్లా పతాకాన్ని ఆవిష్కరించారు.

అన్ని రంగాల్లో ప్రకాశించేలా చేస్తాం
ఒంగోలులో ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి స్వామి, కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జేసీ కల్పనాకుమారి తదితరులు

రానున్న బడ్జెట్‌లో ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం

పామూరులో ట్రిపుల్‌ ఐటీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం

జిల్లా ఆవిర్భావ దినోత్సవ సభలో మంత్రి డాక్టర్‌ స్వామి

ఒంగోలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్ర జ్యోతి) : అన్ని రంగాల్లోనూ జిల్లా ప్రకాశిం చేలా చర్యలు తీసుకుంటున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఆవిర్భావ వేడుకలు సోమవారం ఒంగోలులోని కలెక్టరేట్‌లో ఘనంగా జరిగాయి. ముందుగా జిల్లా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి, మేయర్‌ గంగాడ సుజాత, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ విజయకుమార్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ముప్పవరపు సుచిత్రలతో కలిసి మంత్రి డాక్టర్‌ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వ్యవసాయం, పరిశ్ర మలు, విద్య, మౌలిక రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కీలకమైన వెలిగొండతోపాటు పాలేరు, కొరిశపాడు ప్రాజెక్టులకు వచ్చే బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించనున్నట్లు తెలిపారు. పలుప్రాంతాల్లో సీబీజీ ప్లాంట్లు, దొనకొండలో పరిశ్రమల స్థాపన ద్వారా తలసరి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. బేస్తవారపేట రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించేలా చర్యలతోపాటు రహదారులు, రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్రం సహకారాన్ని కోరుతున్నట్లు తెలిపారు. పామూరులో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేసేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దానికి కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. వెనుకబాటు నుంచి అభివృద్ధి దిశగా పయనిస్తున్న జిల్లాను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్‌ రాజాబాబు మాట్లాడుతూ సహజ, మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటూ వెనుకబాటును అధిగమించి అభివృద్ధి చెందిన జిల్లాగా ఆవిష్కృతమయ్యేలా అధికార యంత్రాంగం దృష్టి సారించిందన్నారు. ఈ ఏడాది వెలిగొండ నీళ్లు వస్తాయని స్పష్టం చేశారు. రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో వచ్చే నౌకలను ఆపరేట్‌ చేసే స్థాయిలో రామాయపట్నం పోర్టు అందుబాటులోకి రానుందన్నారు. హార్టికల్చర్‌ హబ్‌గా కూడా జిల్లా మారుతుందని తెలిపారు. ఎస్పీ హర్షవర్థన్‌రాజు మాట్లాడుతూ వివిధ రంగాల్లో మహనీయులను అందించిన జిల్లాలో విధులు నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. జేసీ కల్పనాకుమారి మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. అంతకు ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖులను సన్మానించారు, ప్రకాశం పంతులు మనమళ్లు హనుమంతరావు, సంతోష్‌, స్వాతంత్య్ర సమరయోధుల వారసులు కరవది సుబ్బలక్ష్మి, గంగవరపు భాస్కరరావు, ప్రముఖ వైద్యులు రెడ్‌క్రాస్‌ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ చుంచు చలమయ్య, కవులు పాటిబండ్ల ఆనందరావు, పొన్నూరి వెంకటశ్రీనివాసులు, సంతప్‌కుమార్‌, నళిని, శివకుమారి, క్రీడాకారుడు చిరంజీవిలను సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్వో చినఒబులేశు, ఆర్డీవో లక్ష్మీప్రసన్న, పొగాకుసమాఖ్య చైర్మన్‌ జయంతిబాబు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 03:06 AM