Share News

పకడ్బందీగా నిర్వహిస్తాం

ABN , Publish Date - Nov 17 , 2026 | 02:43 AM

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఎం.అనుపమ తెలిపారు. నామినేషన్ల దాఖ లు నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

పకడ్బందీగా నిర్వహిస్తాం

ఎలాంటి లోటుపాట్లు లేకుండా పంచాయతీ ఎన్నికలు

ఎస్‌ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు

కలెక్టర్‌ పర్యవేక్షణలో పోలింగ్‌ కేంద్రాల్లో సదుపాయాలు

సమస్యాత్మక సెంటర్‌లలో సీసీ కెమెరాలు

‘ఆంధ్రజ్యోతి’తో డీపీవో అనుపమ

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 16 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఎం.అనుపమ తెలిపారు. నామినేషన్ల దాఖ లు నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను ఆమె సోమవారం ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. జిల్లాలోని 515 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలోని వార్డులకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహి స్తున్నట్లు చెప్పారు. తొలి దశలో ఒంగోలు, కొండపి నియోజకవర్గాల పరిధిలోని 139 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, వాటి పరిధిలోని 1,396 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు డీపీవో చెప్పారు. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంద న్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకునేలా దృష్టి సారించామన్నారు. అధికారులకు ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చామని వివరించారు. తొలిదశ పోలింగ్‌ 26న నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టి పూర్తి చేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నామినేషన్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తామన్నారు. అందువల్ల అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పోలింగ్‌ అనంతరం జరిగే ఓట్ల లెక్కింపును కూడా ఆన్‌లైన్‌లో ఉంచుతామని ఆమె చెప్పారు.

పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు

కలెక్టర్‌ రాజాబాబు పర్యవేక్షణలో పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నామని డీపీవో తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందితోపాటు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. తొలి దశ ఎన్నికలకు అవసరమైన పోలింగ్‌ సామగ్రిని ఇప్పటికే మండలాలకు చేర్చామని చెప్పారు. నామినేషన్ల తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా ప్రకటించిన అనంతరం మండలాలకు బ్యాలెట్‌ పత్రాలను తరలిస్తామని తెలిపారు. ఈనెల 25న మండల కేంద్రాల నుంచి ఆయా పోలింగ్‌ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల ద్వారా పీవోలు, ఏపీవోలు, ఇతర సిబ్బందిని తరలించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు.

సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి

జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు ఏర్పాటు చేసిన 1,434 పోలింగ్‌ కేంద్రాల్లో 717ను సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మకంగా గుర్తించామన్నారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌, వీడియోగ్రఫీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సహకారంతో అందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఈ పోలింగ్‌ కేంద్రాల్లోని వెబ్‌కాస్టింగ్‌ను పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ కార్యాలయానికి అనుసంధానం చేశామని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఏకగ్రీవాలకు ప్రభుత్వ ప్రోత్సాహం

జిల్లాలో ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు ప్రభుత్వం భారీగా ప్రోత్సాహం ప్రకటించిందని డీపీవో తెలిపారు. జనాభా ప్రాతిపదికన రూ.15లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా ఇస్తామన్నారు. ఆయా గ్రామ పంచాయతీలకు వచ్చే నిధుల కంటే ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకమే అధికంగా ఉందని తెలిపారు. అందువల్ల గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీపీవో అనుపమ కోరారు.

Updated Date - Nov 17 , 2026 | 02:43 AM