బీసీలకు 34 శాతం సీట్లు కేటాయిస్తాం
ABN , Publish Date - Oct 11 , 2026 | 10:55 PM
ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో ఎన్డీయే కూటమి తరఫున బీసీలకు 34 శాతం సీట్లు కేటాయిస్తామని మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు.
మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి
గొడ్డలిపార్టీ బలహీన వర్గాలపై కక్ష కట్టి కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకుందని ధ్వజం
స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశా నిర్దేశం
సింగరాయకొండ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో ఎన్డీయే కూటమి తరఫున బీసీలకు 34 శాతం సీట్లు కేటాయిస్తామని మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. ఆదివారం సింగరాయకొండ మండల టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ బీసీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించడానికి తొలిసారి టీడీపీ ప్రభుత్వ హయాంలో 1987లో సీఎం ఎన్టీఆర్ బీసీలకు 20 శాతం రిజర్వేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ తరువాత 1995లో సీఎం చంద్రబాబునాయుడు 20 శాతం ఉన్న రిజర్వేషన్‌ను 34 శాతానికి పెంచి బీసీల పక్షపాతికి నిలిచారని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు 40 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కపట ప్రేమను చూపి చివరకూ 24 శాతానికి కుదించి దగా చేసిందని ధ్వజమెత్తారు. బీసీల రిజర్వేషన్‌ను హైకోర్టు కొట్టివేస్తే కనీసం సుప్రీంకోర్టుకు అప్పీలకు వెళ్లలేదని దీనిబట్టి వైసీపీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటితో తేటతెల్లమైందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం తరఫున బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడానికి తీర్మానం చేస్తే కోర్టుల్లో కేసులు వేయించి గొడ్డలి పార్టీ బీసీల కోటాను అడ్డుకుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన వెంటనే సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలతో అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారని తెలిపారు. సమావేశంలో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను, రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న నిబంధనను పరిగణనలోకి తీసుకొని బీసీలకు ప్రభుత్వపరంగా 28.18 శాతం కేటాయించినట్లు వివరించారు. ఎన్డీఏ కూటమి తరఫున 34శాతం బీసీల జనాభా ఎక్కువు ఉన్న చోట్ల అవసరమైతే ఇంకా ఎక్కువ సీట్లు కేటాయిస్తామని చెప్పారు. నాలుగు రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని, ఆ తరువాత 19న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. నవంబర్ 25 తేదీ లోపు పంచాయతీ ఎన్నికలు కూడా పూర్తి అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు మించల బ్రహ్మయ్య, బీసీ నాయకులు బత్తుల నారాయణ స్వామి, షేక్ సంధానీబాషా, సన్నెబోయిన శ్రీనివాసులు, చీమకుర్తి కృష్ణ, పులి ప్రసాద్, సైకం చంద్రశేఖర్, నరాల సోమయ్య పాల్గొన్నారు.