చంద్రబాబుకు రుణపడి ఉండాలి
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:27 AM
రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి చెప్పారు. మండలంలోని కుంచేపల్లిలో శుక్రవారం సర్పంచ్ వరికుంట్ల కాంతమ్మ అధ్యక్ష్యతన ఏర్పాటు చేసిన అన్నదాత సఖీభవ మూడో విడత నగదు విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
32,965 మంది రైతులకు రూ. 64కోట్ల 65లక్షలు
పొదిలి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి చెప్పారు. మండలంలోని కుంచేపల్లిలో శుక్రవారం సర్పంచ్ వరికుంట్ల కాంతమ్మ అధ్యక్ష్యతన ఏర్పాటు చేసిన అన్నదాత సఖీభవ మూడో విడత నగదు విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో 32,965 మంది రైతులకు 64.65కోట్లు వారి ఖాతాల్లో జమచేశామన్నారు. ఆర్థికలోటు ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీలకతీతంగా రైతులను ఆదుకుంటున్న ప్రజాప్రభుత్వానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని చెప్పారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్‌లు రాష్ట్ర ఆదాయ వన రుల పెంపే లక్ష్యంగా రేయింబవళ్లు కష్టపడుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క యువతకు ఉద్యోగ అవకాశాలు, ఇంకో పక్క సంక్షేమ పథకాల అమలు చేస్తూ ముందుకు దూసుకెళుతున్న ప్రజా ప్రభుత్వంపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం వారి చేతగానితనానికి నిదర్శనమన్నారు. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్న నాయకులు గత ఐదేళ్లు ఏ ఒక్కటి చేయకుండా ధనార్జనే కోసం పాలన చేశారని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మార్కాపురం జిల్లా కోసం పలురకాలుగా ఉద్యమం చేపడితే కనీసం నోరుమెదపలేని నాయకులు ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన రెండు హామీల్లో ఒకటి జిల్లా ఏర్పాటు, రెండోది వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయడమన్నారు. జిల్లా ఎందుకు అని కొందకు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని, దాని విలువ ముందుమందు తెలుస్తుందని చెప్పారు. మార్కాపురం జిల్లాను హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తానని చంద్రబాబునాయుడు ఇటీవల ప్రకటన చేశారని అభివృద్ధికి అదేమొదటి అడుగన్నారు. అంతేకాకుండా పొదిలి మండలాన్ని వెలిగొండ ప్రాజెక్ట్ పరిధిలో చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి విన్నవించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాలాజీనా యక్, ఆర్డీవో పెంచల ప్రభాకర్, తహసీల్దార్ క్రిష్ణారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, పొదిలి, కొనకనమిట్ల ఏవోలు శ్రీనివాసరెడ్డి, ప్రకాష్, పొదిలి, మార్కాపురం ఏఎంసీ చైర్మన్‌లు ఇమాంసాహెబ్, మాలపాటి వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు దోర్నాల అంజిరెడ్డి, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనీల్(పండు), పీఏసీఎస్ అధ్యక్షుడు యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఉలవ గోపి, కనకం నరసింహారావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కాటూరి పెదబాబు, క్లస్టర్ ఇన్‌చార్జి ఆవులూరి యలమంద, ఓబులరెడ్డి, మెడికల్‌బోర్డ్ మెంబర్ స్వర్ణగీత పాల్గొన్నారు.
అనంతరం చంద్రబాబునాయుడు, కందుల నారాయణరెడ్డి చిత్రపటాలకు పాలభిషేకం చేశారు.