Share News

హెచ్‌ఐవీ నిర్మూలనకు కలిసికట్టుగా పనిచేయాలి

ABN , Publish Date - May 17 , 2026 | 11:33 PM

హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నిర్మూలనకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిసికట్టుగా పని చేయాలని కలెక్టర్‌ ఎం.విజయ సునీత అన్నారు.

హెచ్‌ఐవీ నిర్మూలనకు కలిసికట్టుగా పనిచేయాలి
కొవ్వొత్తుల ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ విజయసునీత

కలెక్టర్‌ విజయ సునీత

మార్కాపురం టౌన్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నిర్మూలనకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిసికట్టుగా పని చేయాలని కలెక్టర్‌ ఎం.విజయ సునీత అన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్‌ నిర్మూలన దినాన్ని పురస్కరించుకుని పట్టణంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని కలెక్టర్‌ విజయ సునీత జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్‌ మహమ్మారి కారణంగా మరణించిన వారిని స్మరించుకుని, బాధితులకు సంఘీభావం తెలిపి సమాజంలో అవగాహన పెంపొందించాలన్నారు. బాధితులపై సమాజంలో ఉన్న అపోహలు, ముద్రలు, వివక్షను తొలగించాలన్నారు. వారిని మానవతా దృక్పదంతో చూడాలన్నారు. కొవ్వొత్తుల అవగాహన ర్యాలీ కంభం సెంటర్‌ నుంచి కోర్టు సెంటర్‌ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.వెంకటశివరామిరెడ్డి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.రాహుల్‌, సీహెచ్‌వో నాగేంద్రరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2026 | 11:33 PM