Share News

వినూత్నమైన ఆలోచనలతో ముందుకు పోవాలి

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:07 PM

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు దృష్టిసారించాలని కలెక్టర్‌ రాజాబాబు ఆదేశించారు.

వినూత్నమైన ఆలోచనలతో ముందుకు పోవాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజాబాబు

కలెక్టర్‌ రాజాబాబు ఆదేశం

ఒంగోలు కలెక్టరేట్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు దృష్టిసారించాలని కలెక్టర్‌ రాజాబాబు ఆదేశించారు. అందుకోసం మునిసిపాలిటీలకు ఆదాయం పెరిగేలా సంబంధిత మునిసిపల్‌ కమిషనర్లు వినూత్నమైన ఆలోచనలతో ముందుకు పోవాలని సూచించారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి మంగళవారం సాయ్రంత్రం మునిసిపల్‌ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలోని అన్ని మునిసిపల్‌ ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుధ్య నిర్వహణ, మురుగుకాలువల పూడికతీత, మంచినీటి సరఫరా వంటి సేవలపై దృష్టి సారించాలన్నారు. పార్కులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ప్రజల జీవనోపాధి మెరుగయ్యేలా పలు రకాల యూనిట్స్‌ను మంజూరు చేయాలని చెప్పారు. స్మార్ట్‌ స్ర్టీట్స్‌ను ఏర్పాటు చేయడం, అర్హత ఉన్న వారందరికీ బ్యాంకు లింకేజి కింద రుణాలు మంజూరు చేయడం వంటి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. వన్‌ ఆఫీసర్‌- వన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో భాగంగా అధికారులు వసతిగృహాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడటంతో పాటు సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జీఎస్టీడబ్ల్యూఎస్‌ ద్వారా అమలు జరుగుతున్న కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని చెప్పారు. ఉపాధి పథకాన్ని పటిష్టంగా అమలు చేయడంతో పాటు నిరంతరం పర్యవేక్షణ చేయాలని తెలిపారు. పంచాయతీ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు నారాయణ, ఎం.వెంకటేశ్వరరావు, సుధాకర్‌రెడ్డి, చిరంజీవి, జోస్‌ఫకుమార్‌, లక్ష్మానాయక్‌, శ్రీనివాసరావు పాల్గొన్నారు. అంతకుముందు రెవెన్యూ సమస్యలపై స్పెషల్‌ సీఎస్‌ డి.సాయి ప్రసాద్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కలెక్టర్లు, జేసీలకు పలు సూచనలుచేశారు.

Updated Date - Jan 06 , 2026 | 11:07 PM