Share News

టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:19 PM

ఏపీ మహిళా గైనకాలజిస్టు డాక్టర్ల 11వ వార్షికోత్సవంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని తీర్మానించారు. స్థానిక ఏ1 ఫంక్షన్‌ హాలులో ఈనెల 10వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించిన సదస్సులో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 1600 మంది మహిళా వైద్యులు పాల్గొన్నారు.

టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
సదస్సుకు హాజరైన మహిళా గైనకాలజిస్ట్‌లు

ఒంగోలులో ఘనంగా ముగిసిన గైనకాలజిస్టుల రాష్ట్ర సదస్సు

విజయంతం చేసినందుకు ఏపీసీజీవో కృతజ్ఞతలు

ఒంగోలు కార్పొరేషన్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : ఏపీ మహిళా గైనకాలజిస్టు డాక్టర్ల 11వ వార్షికోత్సవంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని తీర్మానించారు. స్థానిక ఏ1 ఫంక్షన్‌ హాలులో ఈనెల 10వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించిన సదస్సులో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 1600 మంది మహిళా వైద్యులు పాల్గొన్నారు. ఆదివారం ఈ సదస్సు ముగిసింది. ఏపీసీఓజీ ఆధ్వర్యంలో ఉమెన్‌ హెల్త్‌-నేషన్‌ ఫ్రైడ్‌ పేరుతో నిర్వహించిన ఈ సదస్సులో సీనియర్‌ వైద్యులుపలు అంశాలను వివరించారు. ముఖ్యంగా నేటి తరానికి అనుగుణంగా అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య పరికరాలు, టెక్నాలజీలో అందిపుచ్చుకోవాల్సిన మెళకువలను వివరించారు. అలాగే యువ వైద్యులు వైద్య సేవలు అందించే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, రోగిపట్ల చూపాల్సిన శ్రద్ధ తదితర అంశాలను విశదీకరించారు. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ హరిరోహిణీ,సెక్రటరీ డాక్టర్‌ మండవ కమల, కోశాధికారి డాక్టర్‌ గింజుపల్లి కల్పనలు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా నిర్వహించుకున్న గైనకాలజిస్టుల రాష్ట్ర సదస్సుకు ఒంగోలు వేదిక కావడం, అలాగే గతంలో కంటే ఎక్కువ మంది మహిళ వైద్యులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం ఏడాది నుంచి ప్రణాళిక రూపొందించామని, అందుకు అనుగుణంగా మరింత ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందని చెప్పారు. అదేవిధంగా సమావేశానికి విచ్చేసి విలువైన సందేశాలను అందించిన ప్రజాప్రతినిధులు, సీనియర్‌ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో ఏపీసీఓజీ ఆధ్వర్యంలో మరెన్నో సదస్సులు నిర్వహించే విధంగా ముందుకెళతామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ముగింపు రోజున పలువురు సీనియర్‌ వైద్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నల్లూరి అరుణారావు, అనుమల శ్రీదేవి, మండువ కమల, నల్లూరి హిమబిందు, కల్పన, సాకే రాధ, డాక్టర్‌ నీరద, డాక్టర్‌ చాపల శాంతకుమారి, డాక్టర్‌ మానస, పలువురు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్‌ హరిరోహిణికుమారి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా డాక్టర్‌ మండువ కమలసుభాష్‌, రాష్ట్ర కోశాధికారిగా డాక్టర్‌ కల్పన గింజుపల్లిలను ఎన్నుకున్నారు.

Updated Date - Jul 12 , 2026 | 11:20 PM