ప్రాణాలతో చెల‘ఘాట్’ం
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:36 PM
దోర్నాల-శ్రీశైలం ఘాట్ రోడ్డు.. ప్రమాదాలకు నిలయంగా మారింది. ఒకవైపు రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ.. మరోవైపు ఏళ్ల తరబడి ఇరుకైన ఘాట్ రోడ్డు.. వెరసి ఈ రహదారిపై ప్రయాణం ప్రతిరోజూ నరకయాతనకు గురిచేస్తుంది. మొత్తం 49 కిలోమీటర్ల దూరం ఉన్న ఘాట్ రోడ్డుపై నిత్యం దాదాపు 600 నుంచి 700 వరకు వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇవికాక కార్లు, బైక్‌లు వేలల్లో వస్తుంటాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఘాట్‌రోడ్డును జాతీయ రహదారి 765గా గుర్తించినప్పటికీ పలు కారణాల వల్ల రోడ్డు విస్తరణ ప్రారంభం కాకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దోర్నాల-శ్రీశైలం దారిలో నిత్యం ప్రమాదాలు
రక్షణ గోడలు బలహీనపడడంతోపాటు ఏళ్ల తరబడి నోచుకోని మరమ్మతులు
రోడ్డు విస్తరణపై అలవిమాలిన నిర్లక్ష్యం
కుంభాకార దర్పణాలు ఏర్పాటు చేయాలి
దోర్నాల-శ్రీశైలం ఘాట్ రోడ్డు.. ప్రమాదాలకు నిలయంగా మారింది. ఒకవైపు రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ.. మరోవైపు ఏళ్ల తరబడి ఇరుకైన ఘాట్ రోడ్డు.. వెరసి ఈ రహదారిపై ప్రయాణం ప్రతిరోజూ నరకయాతనకు గురిచేస్తుంది. మొత్తం 49 కిలోమీటర్ల దూరం ఉన్న ఘాట్ రోడ్డుపై నిత్యం దాదాపు 600 నుంచి 700 వరకు వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇవికాక కార్లు, బైక్‌లు వేలల్లో వస్తుంటాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఘాట్‌రోడ్డును జాతీయ రహదారి 765గా గుర్తించినప్పటికీ పలు కారణాల వల్ల రోడ్డు విస్తరణ ప్రారంభం కాకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మార్కాపురం, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : నిత్యం వందలాది వాహనాలు, వేలాదిమంది యాత్రికులు సంచరించే దోర్నాల-శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఎక్కడో ఒకచోట వాహనాలు రక్షణ గోడను ఢీకొట్టి లోయలో పడిపోవటం, లేదంటే రోడ్డుపై వాహనం నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటం ఇలా ఈ దారిలో ప్రయాణం దినదిన గండంగానే మారింది.
అలంకారప్రాయంగా రక్షణ గోడలు
దోర్నాల- శ్రీశైలం మధ్య దూరం 49 కిలోమీటర్లు ఉండగా అందులో ఎక్కువ భాగం ఘాట్‌రోడ్డు ప్రయాణమే. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే యాత్రికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీశైలం వెళ్లేందుకు ఇదే దారిలో ప్రయాణించాల్సి ఉంది. దోర్నాల చెక్‌పోస్టు వద్ద నుంచి సాధారణ రోజుల్లో దాదాపు 600 నుంచి 700 వాహనాలు నిత్యం ఈ రోడ్డుపై ప్రయాణిస్తాయి. ఇవి కాక వేలసంఖ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలు వెళ్తుంటాయి. ఘాట్‌రోడ్డు ప్రమాదకరంగా ఉన్న చోట రక్షణగోడలు ఏర్పాటు చేశారు కానీ ఇవి దాదాపు 40 ఏళ్లక్రితం నిర్మించినవి కావటంతో పలుమార్లు వాహనాలు ఢీకొని పడిపోయినవి కొన్ని, బలహీనపడినవి మరికొన్ని ఉన్నాయి. ఇవి కేవలం అలంకారప్రాయం తప్ప ప్రమాదాన్ని నిలువరించలేకపోతున్నాయి. వాహనాలు లోయల్లోకి దూసుకెళ్లినప్పుడు అక్కడ పెరిగి ఉన్న చెట్ల కారణంగా చాలా ప్రమాదాలు తీవ్రత తగ్గి బయటపడిన సందర్భాలు ఉన్నాయి. తక్షణమే రక్షణ గోడల ఎత్తు పెంచి వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు కోరుతున్నారు.
కుంభాకార దర్పణాలు కొంతమేలు
ఇటీవల జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు దాదాపు 135 కుంభాకార దర్పణాలు(అద్దాలు) కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల్లో రోడ్ల మలుపుల వద్ద ఏర్పాటు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా దోర్నాల పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 10 అద్దాలను ఏర్పాటు చేయబోతున్నారు. వీటిని దోర్నాల- శ్రీశైలం ఘాట్‌రోడ్డులోని చాలాచోట్ల ఉన్న మలుపుల్లో ప్రమాదభరితంగా ఉన్న చోట ఏర్పాటు చేస్తే కొంతమేలు చేకూరుతుంది. ఆ దిశగా పోలీసులు చర్యలు తీసుకుని ఘాట్‌రోడ్డులో రక్షణ చర్యలుపై దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
అదుపు తప్పుతున్న వేగం
వాహనదారులు ఘాట్‌రోడులో సూచించిన వేగానికి మించినవేగంతో వాహనాలు నడుపుతుండడం వల్ల ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. వేగాన్ని నియంత్రించేందుకు అక్కడక్కడా స్పీడ్ బ్రేకర్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. రోడ్డు విస్తరణ లేని కారణంగా వాహనాలు ఎదురుపడినప్పుడు వేగం అదుపుకాక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రహదారి జాతీయరహదారి 765గా గుర్తించినప్పటికీ ఈ పనులు పలు కారణాల వల్ల ప్రారంభం కాకపోవటం, అధికారుల్లో అలవిమాలిన నిర్లక్ష్యం కూడా ఈ రహదారికి శాపంగా మారింది.
ఇటీవల ప్రమాదాలు
మూడు రోజుల క్రితం ఇదే ఘాట్‌రోడ్డులో అభయాంజనేయస్వామి ఆలయం సమీపంలో భారీ ముప్పు తప్పిన విషయం విదితమే. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. వేగం అదుపుకాక రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఇనుప కమ్మీలను దాటి లోయలోకి వెళ్లినప్పటికీ దట్టమైన చెట్లు ఉన్న కారణంగా పెను ప్రమాదం తప్పింది. బస్సు ముందుభాగం అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న 30 మంది ప్రయాణికులు బయటపడ్డారు. అదే సమయంలో ఆ బస్సు వెనుక వస్తున్న మరో బస్సు వేగంగా వచ్చి అదుపుకాక రక్షణ కోసం ఏర్పాటుచేసిన ఇనుపకమ్మీలను ఢీకొట్టి ఆగింది.
ఫిబ్రవరి 16న చింతల-తుమ్మలబైలు మధ్య ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో దాదాపు 62 మంది ఉన్నారు. అదృష్టవశాత్తు అందరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు.
మార్చి 15న అరటిలోడుతో వెళ్తున్న మినీ వ్యాను అదుపుతప్పి లోయలోపడింది.
ఇవిగాక పలుమార్లు అతివేగంతో వస్తున్న వాహనాలు ఎదురుగా వచ్చే ద్విచక్రవాహనదారులను ఢీకొట్టడం లాంటి సంఘటనలు కోకొల్లలు. ఇవన్నీ రోడ్డు భద్రతా నియమాలు సక్రమంగా అమలుకాకపోవటం, రక్షణ గోడలు మరమ్మతులను గాలికివదిలేయడం, రోడ్డు విస్తరణ లేకపోవటమే కారణంగా కనిపిస్తోంది.