Share News

కదలం.. వదలం!

ABN , Publish Date - Jul 11 , 2026 | 03:08 AM

జిల్లాలో కొందరు అధికారులు పాతుకుపోతున్నారు. ఏళ్లతరబడి ఒకేచోట, లేకుంటే ఒకే నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ప్రభు త్వాలు మారినా వారు మాత్రం ‘కదిలేదు లేదు.. కుర్చీ వదిలేది లేదు’ అన్నట్లు అక్కడే ఉండిపోతున్నారు.

కదలం.. వదలం!

ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకుపోతున్న అధికారులు

పాలకులు మారినా వారు అక్కడే!

ఆరోపణలున్నా, ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా కదలని పరిస్థితి

ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకొని కథ నడిపిస్తున్న వైనం

‘నన్నెవరు బదిలీ చేసేది. నేనెక్కడికీ వెళ్లడం లేదు. పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అప్పటివరకు ఇక్కడే ఉంటా. ప్రజాప్రతినిధి మద్దతు నాకే ఉంది’. ఇటీవల బదిలీ ఉత్తర్వులు అందుకున్న అనంతరం ఓ రెవెన్యూ అధికారి అన్న మాటలివి.

విద్యుత్‌ శాఖలో గత వైసీపీ హయాంలో ఓ అధికారి చేసిన అక్రమాలు కోకొల్లలు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనపై ఆధారాలతో సహా పలువురు ఆశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ స్థానికంగా తనకున్న పలుకుబడితో ఆ అధికారి జిల్లాకేంద్రంలోనే ఉండిపోయారు. ప్రజాప్రభుత్వంలోనూ కీలకంగా మారారు.

జిల్లాలో కొందరు అధికారులు పాతుకుపోతున్నారు. ఏళ్లతరబడి ఒకేచోట, లేకుంటే ఒకే నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ప్రభు త్వాలు మారినా వారు మాత్రం ‘కదిలేదు లేదు.. కుర్చీ వదిలేది లేదు’ అన్నట్లు అక్కడే ఉండిపోతున్నారు. గత వైసీపీ హయాంలో అనేక అక్రమాలకు పాల్పడి భారీగా నిధులు బొక్కేసిన వారు సైతం ప్రస్తుత ప్రజాప్రభుత్వంలోనూ హవా కొనసాగిస్తుండటం విస్మయం కలిగి స్తోంది. స్థానికంగా అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకొని కథ నడిపిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

మార్కాపురం, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఒక ఎంపీడీవో గత వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నిధుల దోపిడీలో ఆరితేరి ఆ పార్టీ నేతలకు ‘ఉపాధి’ చూపారు. వారి మన్ననలు పొంది ఐదేళ్లు ఒకే నియోజకవర్గంలో పనిచేశారు. కూటమి ప్రభుత్వం రాగానే తనకు అచ్చొచ్చిన నియోజకవర్గం పోతుందనుకున్నాడో ఏమో? వెంటనే ఆపార్టీ నేతలను ప్రసన్నం చేసుకున్నారు. ఏకంగా ఆ నియోజకవర్గ కేంద్రంలోనే పోస్టింగ్‌ సాధించుకున్నారు. రెండేళ్ల నుంచి కూటమి ప్రభుత్వంలోనూ ఆయన కీలకంగా మారారు. నేతలతో సంబంధాలు నెరిపితే చాలు అక్రమాలెన్ని చేసినా తాము కోరుకున్నచోట ఉద్యోగం పదిలం చేసుకోవచ్చని ఇలాంటి ఘటనలు రుజువు చేస్తున్నాయి. విద్యుత్‌ శాఖలో ఒక అధికారి అవినీతి, అక్రమాలపై పలు ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ హయాంలో ఒక కాంట్రాక్టరుతో కలిసి ఆయన చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన్ను బదిలీ చేయాలని ఒక ప్రాంతానికి చెందిన కూటమి నేతలే ఆశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆతర్వాత ఆయన తాను పనిచేస్తున్న ప్రస్తుత జిల్లా కేంద్రంలోని కూటమి నాయకుల మద్దతు కూడగట్టుకోవడంతో అక్రమాల జాబితా కొట్టుకుపోయింది. ఆయన అక్కడే ఉండిపోయారు.

పదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న కొందరు

కొన్ని శాఖల్లో ప్రభుత్వ విధానాల కారణంగా బదిలీలపై ఏర్పడిన సందిగ్ధత కారణంగా 10 నుంచి 15 ఏళ్లపాటు ఒకేచోట పనిచేస్తున్నవారు కూడా లేకపోలేదు. అటువంటి వారిలో విద్యాశాఖలోని ఎంఈవోలు, కస్తూర్బా పాఠశాలల్లోని ప్రత్యేకాధికారులు ఉన్నారు. ఇక ఇటీవల రెవెన్యూ శాఖలోని కొందరి అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. ఎక్కువ కాలం పాతుకుపోయి ఉన్నా, వారి అక్రమాలపై పలు ఆధారాలతో టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి బాధితులు క్యూ కడుతున్నా ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఒక అధికారిపై వస్తున్న ఆరోపణలను ఆయన లెక్కచేయకపోగా జిల్లా యంత్రాంగంపై కూడా పట్టు సాధించి కథ మొత్తం నడిపిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటువంటి వారంతా అటు జిల్లా అధికారులు, ఇటు అధికారపార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడంలో సిద్ధహస్తులై తమ స్థానాలను పదిలపరుచుకుంటున్నారు.

Updated Date - Jul 11 , 2026 | 03:08 AM