Share News

వెనుకబడ్డాం

ABN , Publish Date - Feb 10 , 2026 | 02:58 AM

ఉమ్మడి జిల్లాలో గతేడాది కన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో స్థూల ఉత్పత్తి తగ్గనుంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో అది మరింతగా దిగజారనుంది. సాగులో వచ్చిన మార్పులతో పలు కీలక పంటల విస్తీర్ణం, పాల ఉత్పత్తి, ఇతరత్రా పడిపోవడంతో ఆ పరిస్థితి ఏర్పడింది.

వెనుకబడ్డాం
సీఎం సమీక్షకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరైన కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

వ్యవసాయ అనుబంధ రంగాల్లో తగ్గిన స్థూల ఉత్పత్తి

గతేడాది కన్నా 5.69శాతం తగ్గుదల అంచనా

రాష్ట్రంలో 16 నుంచి 19వ స్థానానికి జిల్లా

మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ప్రభుత్వం వెల్లడి

పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

కేంద్ర నిధుల వినియోగంలో అట్టడుగుకు చేరిన వైనం

ఫేజ్‌-2లో కొత్తపట్నం ఫిషింగ్‌ హార్బర్‌

ఉమ్మడి జిల్లాలో గతేడాది కన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో స్థూల ఉత్పత్తి తగ్గనుంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో అది మరింతగా దిగజారనుంది. సాగులో వచ్చిన మార్పులతో పలు కీలక పంటల విస్తీర్ణం, పాల ఉత్పత్తి, ఇతరత్రా పడిపోవడంతో ఆ పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల స్థూల ఉత్పత్తిలో రాష్ట్రంలో గతేడాది కన్నా ఈ సంవత్సరం జిల్లా వెనుకబడింది. ఆ ప్రభావం తలసరి ఆదాయంపై కూడా చూపింది. ఆమేరకు సోమవారం ప్రభుత్వం నిర్వహించిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో జిల్లాల వారీ వివరా లను ప్రకటించింది. స్థూల ఉత్పత్తిలో జిల్లా 16వ స్థానం నుంచి 19వస్థానానికి పడిపోయింది. సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.

ఒంగోలు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వార్షిక లక్ష్యాల సాధనపై ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్రస్థాయిలో కలెక్టర్ల సదస్సును, ప్రతినెలా మంత్రులు, కార్యదర్శులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలా సోమ వారం అమరావతిలోని సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యక్షంగా, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అన్నిశాఖల అధికారులతో సమీక్ష చేశారు. సచివాలయంలో సమావేశానికి జిల్లాకు చెందిన ఇరువురు మంత్రులు డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌ పాల్గొన్నారు. ఇక్కడి ప్రకాశం భవనం నుంచి కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, ఇతర జిల్లాస్థాయి అధికారులు వీడియో కాన్ఫ రెన్స్‌ ద్వారా హాజరయ్యారు. కాగా స్థూల ఉత్పత్తి వార్షిక లక్ష్యాలు, వాటి సాధన, స్వర్ణాంధ్ర, కేంద్రప్రభుత్వ పథకాల అమలు లో పురోగతి, ఆదాయార్జన శాఖలు, వచ్చే ఏడాది వార్షిక ప్రణాళికతోపాటు పలు ఇతర శాఖలపై సమీక్ష చేశారు. పెట్టుబ డుల ప్రతిపాదనలు, ఆర్‌టీజీఎస్‌, పరిపాల నలో సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, శాంతిభద్రతలు తదితర అంశాలు అందులో ఉన్నాయి.

నిధుల వినియోగంలో చివరన..

వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాబడి పడిపోవడానికి ఖరీఫ్‌లో సాధారణంగా సాగు చేసే ప్రధాన పంటలలో కీలకమైన పత్తి, మినుము సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు పాడిపరిశ్రమ, అలాగే మాంసం ఉత్పత్తి తగ్గడం కారణమని సమాచారం. ఇదిలా ఉండగా కేంద్రం ద్వారా వచ్చే వివిధ పథకాల గ్రాంట్ల వినియోగంలోనూ జిల్లా వెనుకబడిన విషయం సమీక్ష నివేదికలో ప్రకటించారు. ఈ నిధుల వినియోగంలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మన జిల్లా 26వ స్థానానికి పడిపోయింది. గరిష్ఠంగా పల్నాడు జిల్లా నూరుశాతం వినియోగం చేయగా మరో 22 జిల్లాలు 80శాతం చేశాయి. చిట్టచివర నిలిచిన జిల్లాల్లో కోనసీమలో 78శాతం, చిత్తూరులో 73శాతం వినియోగించగా అట్టడుగు స్థానంలో 59శాతం వినియోగంలో మన జిల్లా ఉంది. సుమారు రూ.313 కోట్ల నిధులు ఆయా పథకాల ద్వారా అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.186కోట్లు మాత్రమే వినియోగించినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

నెలాఖరుకు ఎయిర్‌పోర్టు నివేదిక

జిల్లాలో ప్రతిపాదనలు, పురోగతిలో ఉన్న కీలక ప్రాజెక్టుల స్థితిని కూడా సమావేశంలో ప్రభుత్వ నివేదికల్లో పేర్కొంది. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ఈఏడాది జూన్‌ ఆఖరుకు పూర్తి లక్ష్యాన్ని మరోసారి స్పష్టం చేసింది. అలాగే కొత్తపట్నం వద్ద ప్రతిపాదించిన ఫిషింగ్‌ హార్బర్‌ అంచనా వ్యయం గతేడాది లెక్కల ప్రకారం రూ.392.45 కోట్లు అంచనా వేశారు. ప్రస్తుత ఏడాది లెక్కల కోసం పంపినట్లు, అలాగే ఫేజ్‌-2లో ఈ హార్బర్‌ ఉన్నట్లు పేర్కొన్నారు. ఒంగోలు సమీపంలో ప్రతిపాదించిన గ్రీన్‌పీల్డ్‌ ఎయిర్‌పోర్టు అంచనా వ్యయం రూ.450 కోట్లు కాగా ఇందుకోసం 657.57 ఎకరాల భూమిని గుర్తించారు. ఎయిర్‌ఫోర్టు ఫిజుబులిటీ అధ్యయన నివేదిక ఈ నెలాఖరుకు వచ్చే అవకాశం ఉండగా జాయింట్‌ వెంచర్‌ విధానంలో దీని నిర్మాణం చేపట్టాలని ఎయిర్‌పోర్టు అథారిటీ ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. పలు ఇతర కీలక రంగాలపైనా సమీక్ష చేశారు.

Updated Date - Feb 10 , 2026 | 02:58 AM