ఏబీసీలో పరిమితికి మించి నీరు విడుదల
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:51 AM
అద్దంకి బ్రాంచ్ కాలువ (ఏబీసీ)కి ఎగువ నుంచి మంగళవారం పరిమితికి మించి నీటిని విడుదల చేయడంతో అధికారులు, రైతులు ఉలిక్కిపడ్డారు. వల్లాపల్లి-కొమ్మినేనివారిపాలెం మధ్య లాకుల సమీపంలో కట్ట అంచులు తగిలేలా నీరురావడం చూసి ఆందోళనకు గురయ్యారు.
కాలువ కట్ట అంచులు తాకేలా ప్రవాహం
వల్లాపల్లి-కొమ్మినేనివారిపాలెం మధ్య ప్రమాదాన్ని గుర్తించిన రైతులు
ఎన్‌ఎ్‌సపీ అధికారులకు సమాచారం
కట్టకు మట్టిని తోలించి పటిష్ట చర్యలు చేపట్టిన అధికారులు
తెగితే పంటలు దెబ్బతింటాయని అన్నదాతల్లో తీవ్ర ఆందోళన
బల్లికురవ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : అద్దంకి బ్రాంచ్ కాలువ (ఏబీసీ)కి ఎగువ నుంచి మంగళవారం పరిమితికి మించి నీటిని విడుదల చేయడంతో అధికారులు, రైతులు ఉలిక్కిపడ్డారు. వల్లాపల్లి-కొమ్మినేనివారిపాలెం మధ్య లాకుల సమీపంలో కట్ట అంచులు తగిలేలా నీరురావడం చూసి ఆందోళనకు గురయ్యారు. ముందస్తు సమాచారం లేకుండా రాత్రికిరాత్రి ఒక్కసారిగా నీరు విడుదల చేయడంతో అధికారులు కాలువ కట్ట ఎక్కడ తెగిపోతుందోనని హూటాహుటిన దెబ్బతిన్న ప్రదేశాలలో మట్టిని కట్టలుగా ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే... ఏబీసీ పరిధిలోని 18వ మైలు వద్ద మంగళవారం ఉదయం 8 గంటల సమయానికి 1,930 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండడంతో రైతులు ఆందోళన చెందారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. వెంటనే వారు స్పందించి ఆ సమాచారాన్ని పైస్థాయికి తెలియజేయడంతో 11 గంటల సమయానికి కొంత నీటి సరఫరా తగ్గించడంతో పరిమాణం 1,672 క్యూసెక్కులకు చేరింది. అలాగే వల్లాపల్లి లాకుల సమీపంలోని 33వ మైలు వద్దకు 1,500 క్యూసెక్కుల నీరు రావడంతో లాకులు కూడా కొట్టుకుపోతాయని ఎన్‌ఎ్‌సపీ అధికారులు గుర్తించారు. వెంటనే లాకులను పూర్తిస్థాయిలో పైకి లేపారు. అయినప్పటికీ లాకులు కదిలాయి. కట్టను పటిష్ట పరిచేలా పనులు చేశారు. ఆ వెంటనే అన్ని మేజర్లకు నీటిని పూర్తిస్థాయిలో విడుదల చేశారు. నూతనంగా నిర్మించిన ఏబీసీ హైలెవల్ వంతెనకు ఆనుకొనేలా నీరు ప్రవహించడంతో ఆందోళనకు గురయ్యారు. ప్రవాహం దెబ్బకు కట్టకు పగుళ్లు సైతం పడ్డాయి. ఏబీసీ కాలువ కట్ట పరిమితి 1,200 క్యూసెక్కులేనని, అత్యధికంగా నీరు ఎలా విడుదల చేశారని రైతులు అధికారులను ప్రశ్నించారు. కాలువ కట్ట తెగిపోతే తమ పంటలు తీవ్రంగా దెబ్బతినేవని చెప్పారు. అధికారుల అవగాహనలోపంతో సాగర్ నీటిని ఏబీసీకి విడుదల చేస్తున్నారని, పది రోజుల క్రితం కూడా ఇలానే జరిగిందని విమర్శించారు. ఏబీసీ కాలువపై ఈఈ సతీష్, డీఈ రామకృష్ణ, జేఈలు సునీల్‌కుమార్, వేణుబాబు, క్రాంతికుమార్‌లు నీటి సరఫరా తగ్గే వరకు సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో భారీ నష్టం తప్పింది. వల్లాపల్లి, కొమ్మినేనివారిపాలెం, అంబడిపూడి, గుంటుపల్లి, ధర్మవరం, గోవాడ గ్రామాల నుంచి రైతులు ఏబీసీ కాలువ వద్దకు చేరి అధికారులకు సహకరించారు.
గత అనుభవాల నేపథ్యంలో అప్రమత్తమైన రైతులు
గతంలో కూడా కొమ్మినేనివారిపాలెం సమీపంలో ఏబీసీ కట్ట తెగిపోయిన నేపథ్యంలో మంగళవారం కాలువ సామర్థ్యానికి మించి ప్రవహిస్తుండడంతో మళ్లీ తెగే ప్రమాదం ఉందని రైతులు గ్రహించారు. పలు గ్రామాలకు చెందిన వారు అక్కడకు చేరుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఆగమేఘాలపై స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కాలువల్లో గంటగంటకూ కొంత మేర నీరు తగ్గుముఖం పట్టటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.