సాగర్ కాలువల్లో పడిపోయిన నీటి మట్టం
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:04 AM
సాగర్ కాలువల్లో నీటి మట్టం పడిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మేజర్లకు, మైనర్లకు నీరందక ఇబ్బందిపడుతున్నారు. పంట దశలో ఉన్న వరి పైరుకు పుష్కలంగా నీరందించాల్సిన సమయంలో ఇబ్బంది ఎదురవ్వడంతో దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు.
పంట దశలో ఉన్న వరి పైరు
మేజర్లకు నీరందక అల్లాడుతున్న రైతులు
షట్టర్ కాలువలో పడటంతో ఉత్పన్నమైన సమస్య
దర్శి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : సాగర్ కాలువల్లో నీటి మట్టం పడిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మేజర్లకు, మైనర్లకు నీరందక ఇబ్బందిపడుతున్నారు. పంట దశలో ఉన్న వరి పైరుకు పుష్కలంగా నీరందించాల్సిన సమయంలో ఇబ్బంది ఎదురవ్వడంతో దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. సాగర్ ప్రధాన కాలువ 59/5వ మైలు వద్ద ఇనుమళ్ల మేజరు షట్టరు ఊడి కాలువలో పడటంతో అంతరాయం ఏర్పడింది. మరమ్మతుల కోసం సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయడంతో జిల్లాకు నీటి పరిమాణం తగ్గిపోయింది. ఐదు రోజుల క్రితం షట్టర్ కాలువలో పడింది. తొలుత కొంత పరిమాణం తగ్గించి షట్టర్‌ను మళ్లీ యథాస్థానంలో బిగించే ప్రయత్నం చేశారు. అలా వీలుకాకపోవడంతో రెండురోజుల క్రితం నీటి సరఫరాను నిలిపివేసి షట్టర్ బిగించారు. మళ్లీ సరఫరా ఆరంభించినప్పటికీ పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో జిల్లాలోని ఆయకట్టు భూములకు సాగునీటి సమస్య ఉత్పన్నమైంది. ప్రస్తుతం డ్యామ్ నుంచి సాగర్ కుడి కాలువకు విడుదలైన 8,028 క్యూసెక్కుల నీరు నేరుగా బుగ్గవాగుకు చేరుతోంది. బుగ్గవాగు నుంచి 6,850 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఆ నీటిలో గుంటూరు బ్రాంచ్ కాలువకు 2,300 క్యూసెక్కులు, అద్దంకి బ్రాంచ్ కాలువకు 1,185 క్యూసెక్కులు, సాగర్ ప్రధాన కాలువ 85/3వ మైలుకు(ప్రకాశం సరిహద్దు) 1,330 క్యూసెక్కుల నీరు పంపిణీ చేస్తున్నారు. జిల్లాకు విడుదలైన నీటిని పమిడిపాడు బ్రాంచ్ కాలువకు 550 క్యూసెక్కులు, ఒంగోలు బ్రాంచ్ కాలువకు 685 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలు బ్రాంచ్ కాలువ పరిధిలో రబీ సీజన్‌లో సాగు చేసిన వరి పంట వివిధ దశల్లో ఉంది. పంట దశలో కొంత ఉండగా, పొట్ట దశలో మరికొంత ఉంది. ప్రస్తుతం ఓబీసీకి అతి తక్కువగా నీరు సరఫరా అవుతుండటంతో మేజర్లు, మైనర్లకు ఐదు రోజులుగా నీరు అందటం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే పంట దశలో ఉన్న వరిపైరుకు నీరు అందక గింజలు తాలు దిగుబడి తగ్గే ప్రమాదముంది. నీటి సరఫరా ఇంకా జాప్యం జరిగితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు పంటల పరిస్థితి గుర్తించి సాగర్ కాలువలకు వెంటనే నీటి పరిమాణం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా చివరన ఉన్న ఒంగోలు బ్రాంచ్ కాలువకు నీరు అందక అవసరమన్న విషయాన్ని గుర్తించి సమృద్ధిగా సాగర్ జలాలు విడుదల చేయాలని కోరుతున్నారు.