Share News

ఆయేషా హత్యకు గురైందా?

ABN , Publish Date - Oct 08 , 2026 | 02:37 AM

దర్శి పట్టణానికి చెందిన షేక్‌ ఆయేషా (22) మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై లోతైన దర్యాప్తు చేయాలని ఆమె కుటుంబసభ్యులు పోలీసులను కోరారు.

ఆయేషా హత్యకు గురైందా?

అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు

లోతైన దర్యాప్తు చేస్తున్న పోలీసులు

దర్శి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : దర్శి పట్టణానికి చెందిన షేక్‌ ఆయేషా (22) మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై లోతైన దర్యాప్తు చేయాలని ఆమె కుటుంబసభ్యులు పోలీసులను కోరారు. బాధితుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఆయేషా డిగ్రీ చదివింది. బ్యూటీ పార్లర్‌కు అని చెప్పి సోమవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తండ్రి రహమత్‌బాషా మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికొచ్చి కుమార్తె గురించి వాకబు చేయగా బయటకు వెళ్లిందని చెప్పారు. సాయంత్రం వరకు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రోజు రాత్రి కూడా ఆమె ఇంటికి రాలేదు. ఏదో జరిగిందని కుటుంబ సభ్యులు అన్నిచోట్లా గాలింపు చేపట్టారు. ఎన్‌ఏపీ చెరువు సమీపంలోని సాయిబాబా మందిరం వద్ద ఆయేషా బైక్‌ ఉన్నట్లు గుర్తించారు. కుటుంబస భ్యులు వెళ్లి చూడగా పక్కనే ఆయేషా రక్తసిక్తమై నిర్జీవంగా పడి ఉంది. చెయ్యి విరిగింది. చెంపమీద కొట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. ఏం జరిగిందనే విషయంపై ఆరా తీయగా సోమవారం సాయంత్రం అక్కడ కొంతమంది బాలికలు, మరికొంతమంది యువకులు ఉన్నట్లు గొర్రెలకాపరుల ద్వారా తెలిసిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అందువల్ల అక్కడ తమ కుమార్తెను ఎవరో హత్యచేసి ఉంటారని ఆరోపిస్తున్నారు.

న్యాయం చేయాలి

తన కుమార్తె ఆయేషా మృతికి కారణాలు తెలుసుకొని బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయేషా తండ్రి బాష కోరారు. తన కుమార్తెను స్నేహితులు నమ్మకంగా ఫోన్‌లో పిలిచి హత్యచేసి ఉంటారని చెప్పారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు. ఇదిలాఉండగా ఆయేషా మృతదేహానికి ముగ్గురు డాక్టర్లతో కూడిన వైద్యబృందం బుధవారం పోస్టుమార్టం చేసింది. పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 08 , 2026 | 02:37 AM