Share News

గ్యాస్‌ బండపై యుద్ధం ఎఫెక్ట్‌

ABN , Publish Date - Mar 11 , 2026 | 03:04 AM

ఇరాన్‌ యుద్ద ప్రభావం సామాన్యులపై పడింది. రాత్రికిరాత్రి వాణిజ్య సిలిండర్లపై రూ.115, సాధారణంపై రూ.60 ధర పెంచిన కేంద్రం ఇప్పుడు తాజాగా అనేక ఆంక్షలను విధించింది. దీంతో ఇటు ప్రజలకు, ఇటు ఏజెన్సీలకు కూడా ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడింది.

గ్యాస్‌ బండపై యుద్ధం ఎఫెక్ట్‌

వినియోగంపై అనేక ఆంక్షలు విధించిన కేంద్రం

ఒకసారి తీసుకుంటే మరో 25రోజుల తర్వాతే బుకింగ్‌

సిలిండర్‌ కావాలంటే తప్పనిసరిగా ఓటీపీ ఉండాల్సిందే

ఇప్పటిలాగా ఎప్పుడుపడితే అప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు

వాణిజ్య సిలిండర్లను నిలుపుదల చేసిన ప్రభుత్వం

హాస్టళ్లు, హోటళ్లు, పాఠశాలలు, వృద్ధాశ్రమాలకు ఇక్కట్లు

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : ఇరాన్‌ యుద్ద ప్రభావం సామాన్యులపై పడింది. రాత్రికిరాత్రి వాణిజ్య సిలిండర్లపై రూ.115, సాధారణంపై రూ.60 ధర పెంచిన కేంద్రం ఇప్పుడు తాజాగా అనేక ఆంక్షలను విధించింది. దీంతో ఇటు ప్రజలకు, ఇటు ఏజెన్సీలకు కూడా ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు ఒక్కో బుకింగ్‌కు మధ్య 21 రోజుల వ్యవధి ఉండగా ఇప్పుడు దదాన్ని 25 రోజులకు పెంచారు. ఇప్పటివరకు ఏదైనా అత్యవసరం ఉన్నా ఆయా ఏజెన్సీల వద్దకు వెళ్లి తెచ్చుకునే అవకాశంఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఒకసారి గ్యాస్‌ తీసుకున్న తర్వాత మరలా 25రోజుల తర్వాతనే బుక్‌ చేసుకోవాలి. సీరియల్‌ ప్రకారం సిలిండర్‌ను బుక్‌ చేసుకున్న తర్వాత పరిస్థితిని బట్టి మూడు రోజుల నుంచి వారం రోజుల్లోపు ఎప్పుడైనా గ్యాస్‌ ఏజెన్సీలు డెలివరీలు చేస్తాయి. డెలివరీ బాయ్‌ ఇంటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఓటీపీ నెంబర్‌ను చెప్పితేనే ఆ గ్యాస్‌ బండను ఇస్తారు. లేనిపక్షంలో ఆ గ్యాస్‌ను వెనక్కు తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

వాణిజ్య సిలిండర్లు నిలుపుదల

ఇప్పటికే వాణిజ్య సిలిండర్ల ధరను పెంచిన ప్రభుత్వం తాజాగా ఆదివారం రాత్రి నుంచి వాటి సరఫరాను నిలిపేసింది. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ల సరఫరాను నిలుపుదల చేసింది. హోటళ్లు, చిన్నచిన్న టిఫిన్‌ దుకాణాల వారు, కల్యాణ మండపాల్లో వివిధ అవసరాల కోసం అత్యవసరంగా వాణిజ్య సిలిండర్లను కొనుగోలు చేసి వినియోగించే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. సోమవారం నుంచి గ్యాస్‌ ఏజెన్సీలు వాణిజ్య సిలిండర్ల పంపిణీని నిలుపుదల చేయడంతో హోటళ్ల నిర్వాహకులు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హాస్టళ్లు, పాఠశాలలకు నిలుపుదల

ఇప్పటివరకు వసతిగృహాలు, పాఠశాలలు, ఎడ్యుకేషన్‌ సొసైటీ ఉండే విద్యా సంస్థలు, రిజిస్టర్‌ అయిన స్వచ్ఛంద సంస్థలకు కూడా గ్యాస్‌ సరఫరా చేసేవారు. తాజాగా వాటికి కూడా నిలిపివేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని వసతి గృహాలు 200కుపైన ఉన్నాయి. ఎడ్యుకేషన్‌ సొసైటీ పరిధిలో ఉండే పాఠశాలలు కూడా వందల సంఖ్యలో ఉన్నాయి. అటువంటి వాటికి కూడా గ్యాస్‌ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సోమవారం నుంచి గ్యాస్‌ సరఫరాను నిలుపుదల చేశారు. ఇలా గ్యాస్‌ బండలపై కేంద్రప్రభుత్వం అనేక ఆంక్షలను విధించడంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.

Updated Date - Mar 11 , 2026 | 03:04 AM