వీఆర్వోల ఆందోళనబాట
ABN , Publish Date - Feb 19 , 2026 | 02:26 AM
పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ గ్రామ రెవెన్యూ అధికారులు ఆందోళనబాట పట్టారు. వీఆర్వోల సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు.
నేడూ కొనసాగనున్న నిరసనలు
ఆ తర్వాత రాష్ట్ర కమిటీ
పిలుపు మేరకు నిర్ణయం
ఒంగోలు కలెక్టరేట్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ గ్రామ రెవెన్యూ అధికారులు ఆందోళనబాట పట్టారు. వీఆర్వోల సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామ రెవెన్యూ అధికారులపై పని ఒత్తిడి పెంచడమే కాకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయని, ఆ విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రెవెన్యూకు సంబంధించిన విధులు మాత్రమే నిర్వహించాల్సి ఉండగా పంచాయతీరాజ్, ఇతర శాఖల పనులను కూడా వీఆర్వోలకు అప్పగించడం సరికాదన్నారు. సెలవు రోజుల్లో పనులు చేయించడాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయాల్లో 8 నుంచి 12 మంది సిబ్బంది ఉన్నప్పటికీ వీఆర్వోలను సర్వేలు చేయాలని ఒత్తిడి చేస్తూ మండలస్థాయి అధికారుల ద్వారా మెమోలు ఇవ్వడం ఇబ్బందికరంగా ఉందన్నారు. గురువారం కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ఆ సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైపీ రంగయ్య, ఏసీ ఆదిరెడ్డి తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర కమిటీ ఇచ్చే సూచనలకు అనుగుణంగా తదుపరి కార్యక్రమాలు ఉంటాయని వారు చెప్పారు.