Share News

ఏసీబీ వలలో వీఆర్వో

ABN , Publish Date - Mar 01 , 2026 | 03:11 AM

లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రమైన గుడ్లూరులో శనివారం చోటుచేసుకుంది. అవినీతి నిరోధక శాఖ అధికారుల కథనం ప్రకారం.. గుడ్లూరు సచివాలయం-1 పరిధిలో గత నాలుగేళ్ల నుంచి వీఆర్వోగా ఇండ్ల చలమారెడ్డి పనిచేస్తున్నారు.

ఏసీబీ వలలో వీఆర్వో
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో చలమారెడ్డి

రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

గుడ్లూరు, ఫిబ్రవరి 28 (ఆంధ్ర జ్యోతి) : లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రమైన గుడ్లూరులో శనివారం చోటుచేసుకుంది. అవినీతి నిరోధక శాఖ అధికారుల కథనం ప్రకారం.. గుడ్లూరు సచివాలయం-1 పరిధిలో గత నాలుగేళ్ల నుంచి వీఆర్వోగా ఇండ్ల చలమారెడ్డి పనిచేస్తున్నారు. గుడ్లూరు రెడ్డిపాలెంకు చెందిన రామాల మాధవరెడ్డి అనే రైతుకు చెందిన ఎక్స్‌కవేటర్‌ అక్రమంగా మట్టి తీస్తుండగా ఇటీవల అధికారులు పట్టుకున్నారు. కోర్టు నుంచి దానిని విడిపించుకునేందుకు సదరు రైతుకు అవసరమైన జామీన్‌ ష్యూరిటీ ధ్రువీకరణపత్రం ఇచ్చేందుకు వీఆర్వో రూ.20వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో రైతు ఏసీబీని ఆశ్రయించారు. ముందుగా సిద్ధం చేసిన పథకం ప్రకారం గుడ్లూరు బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న అమరా మాల్యాద్రి షాపు దగ్గరకు వీఆర్వోను రమ్మని చెప్పడంతో అక్కడకు చేరుకున్నాడు. రైతు దగ్గర నుంచి రూ.20వేలు తీసుకుంటుండగా మారువేషంలో మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు వెంటనే చలమారెడ్డిని పట్టుకున్నారు. అనంతరం రెవెన్యూ కార్యాలయం వద్దకు వీఆర్వోను తీసుకొచ్చి రికార్డులను పరిశీలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు తెలిపారు. గతంలో కూడా పలుమార్లు సదరు వీఆర్వోపై తమకు ఫిర్యాదులు వచ్చాయని ఆయన చెప్పారు. ఈ తనిఖీల్లో సీఐలు వెంకటేష్‌, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2026 | 03:11 AM