ఓటు రేటు రూ.2వేలు
ABN , Publish Date - Oct 31 , 2026 | 02:06 AM
ఉమ్మడి జిల్లాలో పురపోరు తారస్థాయికి చేరింది. ప్రచారానికి తెరపడటంతో ప్రలోభాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలు జరుగుతున్న పట్టణాల్లో ఓటు రేటు రూ.2వేలకు చేరింది. శుక్రవారం రాత్రి అత్యధిక ప్రాంతాల్లో రూ.2వేల ప్రకారం డబ్బుల పంపిణీ ప్రారంభమైంది.
ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం
ప్రారంభమైన ప్రలోభాల పర్వం
పోటీ గట్టిగా ఉంటే ఎక్కువ మొత్తం
నేడు మరింత పెరిగే అవకాశం
కొన్నిప్రాంతాల్లో ఇప్పటికే పంపిణీ పూర్తి
వేచిచూసే ధోరణిలో కొందరు అభ్యర్థులు
చీప్‌లిక్కర్‌ను ఛీకొట్టిన మద్యం ప్రియులు
ఉమ్మడి జిల్లాలో పురపోరు తారస్థాయికి చేరింది. ప్రచారానికి తెరపడటంతో ప్రలోభాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలు జరుగుతున్న పట్టణాల్లో ఓటు రేటు రూ.2వేలకు చేరింది. శుక్రవారం రాత్రి అత్యధిక ప్రాంతాల్లో రూ.2వేల ప్రకారం డబ్బుల పంపిణీ ప్రారంభమైంది. కొన్ని వార్డుల్లో అక్కడ పోటీ పరిస్థితికి అనుగుణంగా ఓటు రేటు అమాంతం పెరిగిపోతోంది. ఒకచోట రెబల్ అభ్యర్థి ఓటుకు రూ.5వేలు కూడా ఇస్తుండటం కనిపించింది. అలాగే చీప్ లిక్కర్‌ను మద్యంప్రియులు ఛీకొట్టి బ్రాండెడ్ మందుకు మాత్రమే జైకొడుతున్నారు. దీంతో అభ్యర్థులకు చుక్కలు కన్పిస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో కూటమికి సానుకూల వాతావరణం నెలకొంది. కొన్ని వార్డులు, డివిజన్లలో ప్రతిష్టాత్మక పోటీ జరుగుతూ ఓటు రేటు పెరగడంతోపాటు గెలుపోటములపై పందేలు కాస్తున్నారు. అన్నింటికీ మించి మద్యం ప్రియులకు చీప్ లిక్కర్‌ను పంపిణీ చేయబోతే వారు తిరస్క రిస్తుండటం పెద్ద చర్చనీయాంశమైంది. ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాలి టీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అద్దంకి, చీమకుర్తిలో రెండు ప్రధాన పక్షాల అభ్యర్థులు ఓటుకు రూ.2వేల చొప్పున పంపిణీ చేశారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున మరికొంత అదనపు మొత్తాన్ని కూడా చెల్లించే అవకాశం కనిపిస్తోంది. అద్దంకిలో కూటమి తరఫున రెబ ల్‌గా పోటీలో ఉన్న వార్డులో ఓటు రేటు రూ.5వేలకు చేరింది. గిద్దలూరులో ఒకవైపున ఓటుకు రూ.2వేలు పంపిణీ జరిగితే, మరో పక్షాన పేరుకు రూ.1,000 చెప్పి రూ.1,500 పంపిణీ చేసినట్లు తెలిసింది. మార్కాపురంలో ప్రత్యర్థి రేటుకు అనుగుణంగా డబ్బు పంపిణీ చేయాలన్న భావనతో ఎవరికి వారు శుక్రవారం రాత్రి 10గంటలకు కూడా ఎదురుచూస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇంకా డబ్బులు ఇవ్వలేదేందంటూ కొందరు ఓటర్లు రంగంలో ఉన్న అభ్యర్థుల కార్యాలయాలు చుట్టూ తిరగడం కనిపిస్తోంది. ఇరు పక్షాల వారు అంగీకారంతో ఓటుకు రూ.1,000 రేటు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 1, 6 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థు ల మధ్య పోటీ నెలకొని ఓటు రేటు గంటగంటకూ పెరిగిపోతోంది.
ఇరకాటంలో కొందరు అభ్యర్థులు
చీరాల మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల వైపు నుంచి ఓటుకు రూ.1,000 చెప్పున పంపిణీ జరిగింది. కాంగ్రెస్ వైపు నుంచి కూడా ఆ మేరకు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా ఒక వార్డులో ఒక పార్టీ రెబల్ అభ్యర్థి ముందుగానే ఓటుకు రూ.2వేల ప్రకారం పంపిణీ చేయడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇరకాటంలో పడిపోయారు. ప్రతిష్టాత్మకమైన ఒంగోలు కార్పొరేషన్‌లో శుక్రవారం రాత్రికి చాలావరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బుల పంపిణీని పూర్తి చేశారు. ఓటుకు రూ.1,000 ప్రకారం ఇచ్చారు. అయితే కొన్ని డివిజన్‌లలో కార్పొరేటర్ అభ్యర్థులు తమ వాటా డబ్బులు ఇవ్వకుండా వైసీపీ మేయర్ అభ్యర్థి తరఫున వెళ్లిన డబ్బులే రూ.500 ప్రకారం పంపిణీ చేశారు. రెబల్, స్వతంత్ర అభ్యర్థుల రూపంలో త్రిముఖ పోటీలో ఉన్న డివిజన్లలో ఓటు రేటు మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తపట్నం వెళ్లే రోడ్డులో ఉన్న ఒక వార్డులో టీడీపీ రెబల్ అభ్యర్థి ఓటుకు రూ.1,500 పంపిణీ చేసినట్లు తెలిసింది. ఒంగోలు నగరంలో శనివారం రాత్రి మరోసారి డబ్బుల పంపిణీ జరగవచ్చనే ప్రచారం ఊపందుకుంది.
చీప్ లిక్కర్‌ను ఛీకొడుతున్న జనం
లిక్కర్ పంపిణీలో అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురైంది. మద్యం ప్రియులు చీప్ లిక్కర్‌ను చీదరించుకుంటున్నారు. దాదాపు పోలింగ్ జరిగే అన్ని పట్టణాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు రెండు రకాల మద్యాన్ని సరఫరా చేయడం ప్రారంభించారు. ఇటు చీప్ లిక్కర్‌తోపాటు అటు మీడియం, క్వాలిటీగా పేరొందిన లిక్కర్‌ను పంపిణీ చేస్తున్నారు. శనివారం రాత్రికి మీడియం రకం మందు ఇవ్వాలని భావించిన అభ్యర్థులు శుక్రవారం పగలు, సాయంత్రం ఎక్కువ ప్రాంతాల్లో చీప్ లిక్కర్ పంపిణీకి శ్రీకారం పలికారు. దీంతో మద్యం ప్రియులు వాటిని తీసుకునేందుకు ముందుకురాకపోవడమే కాక ఛీ అంటూ తిరస్కరించడం అనేక ప్రాంతాల్లో కనిపించింది ‘ఇవి చీప్ లిక్కర్ రోజులు కాదు, క్వాలిటీ మద్యం దొరికే రోజులు. అవి తీసుకురండి. లేకుంటే మావైపు రావద్దు’ అని స్పష్టంగా చెప్పినట్లు పలువురు అభ్యర్థుల తరఫున ఈ బాధ్యతలు చూసే వ్యక్తులు వాపోయారు. ఈ ఛీత్కారాలు తెలుసుకున్న అభ్యర్థులు శుక్రవారంరాత్రికి మీడియం రకం మద్యాన్నే అడిగిన వారందరికీ ఇవ్వడం ప్రారంభించడం బహిరంగంగానే కనిపించింది.