ఓటు మన హక్కు
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:12 AM
భారత ఎన్నికల కమిషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఓటుహక్కు నమోదు, వినియోగించుకోవడం, కొత్త ఓట్ల నమోదు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టింది.
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన యంత్రాంగం
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : భారత ఎన్నికల కమిషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఓటుహక్కు నమోదు, వినియోగించుకోవడం, కొత్త ఓట్ల నమోదు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టింది. 1950లో భారత ఎన్నికల సంఘం ఏర్పాటు జరిగాక ఈ 73 ఏళ్ల కాలంలో ఓట్ల నమోదుకు అనేక మార్పులు తెచ్చింది. ఎన్నికల నిర్వహణలో సంస్కరణలతోపాటు 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు తమ మొబైల్ ద్వారానే ఓటుహక్కును నమోదు చేసుకునే విధంగా అనేక మార్పులను తెచ్చింది. 2011 జనవరి 25వతేదీన ప్రతి ఏటా ఓటర్ల దినోత్సవం నిర్వహించేందుకు ఈసీ ఆదేశాలు జారీచేయడంతో అందుకు అనుగుణంగా ఓటర్ల దినోత్సవాన్ని పోలింగ్ కేంద్రాల నుంచి జిల్లా స్థాయి వరకు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 22లక్షల మంది జనాభా ఉండగా సుమారు 18లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకునే హక్కును భారత రాజ్యాంగం కల్పించింది. అందుకే మన దేశంలో ఓటరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. తన ఓటుహక్కుతో నచ్చిన వారిని ప్రజాప్రతినిధులను చేసే శక్తిని కల్పించారు. ఎంతో విలువైన ఓటుహక్కును అందరికీ కల్పించేందుకు ప్రతిఏటా కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తూ ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతూ వస్తుంది. అందులోభాగంగా ఆదివారం ఉదయం కలెక్టరేట్‌లోని మీకోసం హాలులో జరిగే కార్యక్రమంలో జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున కొత్తగా నమోదు చేసుకున్న యువతీ యువకులకు కొత్త ఎఫిక్ కార్డులను అందజేయన్నారు. ఎన్నికల్లో క్రమంతప్పకుండా ఓటు వేసిన సీనియర్ సిటిజన్స్‌ను సత్కరించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలతోపాటు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేయనున్నారు.