Share News

డీసీసీబీ ఉద్యోగుల్లో విజిలెన్స్‌ వణుకు

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:45 AM

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (పీడీసీసీబీ) ఉద్యోగుల్లో వణుకు మొదలైంది. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆ సంస్థలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆ విభాగం అధికారులు సంబంధిత రికార్డులను పరిశీలించారు.

డీసీసీబీ ఉద్యోగుల్లో విజిలెన్స్‌ వణుకు

గత ప్రభుత్వకాలంలో అక్రమాలపై ఆశాఖ విచారణ

ఇప్పటికే రికార్డుల పరిశీలన 8 అవకతవకలు గుర్తింపు

తాజాగా 67 మందికి నోటీసులు

వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని సూచన

గడువు ముగిసినా కొలిక్కిరాని సెక్షన్‌ 51 విచారణ

ఒంగోలు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (పీడీసీసీబీ) ఉద్యోగుల్లో వణుకు మొదలైంది. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆ సంస్థలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆ విభాగం అధికారులు సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఆ సందర్భంగా గుర్తించిన లోటుపాట్లకు సంబంధించి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఏకంగా 67 మంది బ్యాంకు ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడంతో కల వరం మొదలైంది. గత వైసీపీ హయాంలో డీసీసీబీలో భారీగా అక్రమా లు, అవకతవకలు చోటుచేసుకున్నాయని ప్రస్తుత ప్రభుత్వానికి ఫిర్యా దులు అందిన నేపథ్యంలో వివిధ స్థాయిల్లో విచారణలు జరుగుతున్న విషయం విదితమే. అందులో భాగంగా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఒంగోలులోని విజిలెన్స్‌ విభాగం ఏఎస్పీ పర్యవేక్షణలో ఆ శాఖ అధికారులు డీసీసీబీకి చెందిన పలు రికార్డులను పరిశీలించారు. గతంలో అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణలో గుర్తించిన అంశాలను కూడా విజిలెన్స్‌ అధికారులు పరిశీలించినట్లు సమాచారం.

రుణాల మంజూరులో భారీగా అక్రమాలు

బ్యాంకుకు చెందిన వివిధ బ్రాంచిల ద్వారా వైసీపీ ప్రభుత్వకాలంలో మంజూరు చేసిన రుణాలలో భారీగా అక్రమాలు జరిగాయని విజిలెన్స్‌ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ప్రధానంగా జగనన్న పాలవెల్లువ, జగనన్న తోడు, ఫిష్‌ ఆంధ్ర, పొదుపు మహిళా గ్రూపుల రుణాలతోపాటు వ్యవసాయ రుణాలు, ఇతరత్రా ఉన్నట్లు సమాచారం. కోట్లాది రూపాయలకు సంబంధించి రికవరీలు లేకపోవడం కూడా అక్రమాలు జరిగాయన్న అనుమానాలకు ఊతం ఇస్తోంది. ఈనేపథ్యంలో బాధ్యులైన ఉద్యోగులను విచారించాలని విజిలెన్స్‌ అధికారులు నిర్ణయించుకున్నారు. వివిధ రుణాల మంజూరులో బ్రాంచి మేనేజర్లు, సూపర్‌వైజర్‌ కీలకం కావడంతో వారిని విచారించేందుకు సిద్ధమయ్యారు. వారందరినీ వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని, సంబంధిత రికార్డులను కూడా వెంట తీసుకురావాలని కోరారు. ఈ మేరకు సదరు ఉద్యోగుల వివరాలతో పీడీసీసీ బ్యాంకు సీఈవోకు విజిలెన్స్‌ ఒంగోలు ఏఎస్పీ కె.శ్రీనివాసరావు రెండ్రోజుల క్రితం నోటీసు ఇచ్చారు. బ్యాంకు ఉన్నతాధికారులు సదరు ఉద్యోగులకు పంపారు. ఇదిలా ఉండగా సహకార శాఖ పరంగా ప్రభుత్వ ఆదేశాలతో డీసీసీబీపై చేపట్టిన సెక్షన్‌ 51 విచారణ ఇంకా పూర్తికాలేదు. తొలుత 4 నెలలు సమయం ఇచ్చి, అనంతరం మరో 2 నెలలు పొడిగించారు. ఆ గడువు పూర్తయినప్పటికీ విచారణ మాత్రం కొలిక్కి రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Feb 26 , 2026 | 02:45 AM