Share News

బియ్యం బ్లాక్‌ మార్కెట్‌పై విజి‘లెన్స్‌’

ABN , Publish Date - Nov 18 , 2026 | 02:35 AM

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో కొందరు వ్యాపారులు అత్యాశతో నిత్యావసరమైన బియ్యంను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో దేశవ్యాప్తంగా రాను న్న రోజులలో తీవ్ర కొరత ఏర్పడుతుందన్న అంచనాతో కొంతమంది రైస్‌ మిల్లర్లు వేల క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్లు తెలుస్తోంది.

బియ్యం బ్లాక్‌ మార్కెట్‌పై విజి‘లెన్స్‌’
సంతనూతలపాడులో బియ్యం నిల్వలను పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అధికారులు (ఫైల్‌)

ఉమ్మడి ప్రకాశంలో ముమ్మర దాడులు

63 ప్రాంతాలలో తనిఖీలు.. 32 కేసులు

ఒంగోలు క్రైం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో కొందరు వ్యాపారులు అత్యాశతో నిత్యావసరమైన బియ్యంను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో దేశవ్యాప్తంగా రాను న్న రోజులలో తీవ్ర కొరత ఏర్పడుతుందన్న అంచనాతో కొంతమంది రైస్‌ మిల్లర్లు వేల క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్లు తెలుస్తోంది. దీంతో నాలుగు నెలల్లో బియ్యం ధర చుక్కలనంటింది. ఒక్కసారిగా కిలో రూ.100కు చేరింది. ఈనేపథ్యంలో కేంద్రప్రభు త్వం బియ్యం నిల్వలను ప్రతి మంగళవారం ఫుడ్‌ స్టాక్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై అవగాహన లేని వ్యాపారులు కొంతమంది అసలు నిల్వలు రిజిస్టర్‌లో నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో బియ్యం ధరలను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముమ్మర తనిఖీలకు ఆదేశించింది. అదేసమయంలో ఎక్కడికక్కడ రైతుబజార్‌లలో ధరణి కేంద్రాలను ఏర్పాటు చేసి కిలో రూ.50కు బియ్యం అందు బాటు లోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ ఎల్‌నినో ప్రభావం ఏడాదిపాటు ఉంటుందని వ్యాపారులు అక్రమ నిల్వలను బయట పెట్టడం లేదు.

నిల్వలపై ఆరా

ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్‌ అదికా రులు రంగంలోకి దిగారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కడెక్కడ బియ్యం నిల్వలు ఉన్నాయని ఆరా తీస్తున్నారు. బియ్యం వ్యాపారులు, రైస్‌ మిల్లర్లు ప్రతి మంగళవారం ఫుడ్‌స్టాక్‌ పోర్టల్‌లో వారి వద్ద నిల్వలను అప్‌లోడ్‌ చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇంకా రహస్యంగా బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారా? అన్న కోణంలో నిఘా పెట్టారు. ఈ మేరకు జిల్లాలో అనేక ప్రాంతాలలో బియ్యం దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు మొదలుపెట్టారు. అదే సమయంలో రైస్‌ మిల్లర్ల వద్ద ఉన్న స్టాక్‌ను పరిశీలిస్తున్నారు.

63 ప్రాంతాలలో తనిఖీలు.. 32 కేసులు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విజిలెన్స్‌ అధికారులు ఇప్పటికే 63 ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. మార్కాపురం, కనిగిరి, దర్శి పొదిలి, చీమకుర్తి, కందుకూరు, సంతనూతలపాడు, ఒంగోలు, అద్దంకి తదితర ప్రాంతాల్లో ఉన్న బియ్యం దుకాణాలు, రైస్‌ మిల్లులను తనిఖీ చేశారు. 32 లీగల్‌ మెట్రాలజీ కేసులు నమోదు చేశారు.

Updated Date - Nov 18 , 2026 | 02:35 AM