భూసేకరణపై బాధితులు ఆగ్రహం
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:21 AM
వాడరేవు - పిడుగురాళ్ల జాతీయ రహదారి (167ఏ) నిర్మాణంలో భాగంగా భూసేకరణ బాధితులకు శాపంగా మారింది.
పర్చూరు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : వాడరేవు - పిడుగురాళ్ల జాతీయ రహదారి (167ఏ) నిర్మాణంలో భాగంగా భూసేకరణ బాధితులకు శాపంగా మారింది. నిబంధనలు పాటించకుండా సరైన సమాచారం ఇవ్వ కుండా తమ భూములను ఎలా సేకరిస్తా రంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. ఎంత భూమి తీసుకుంటున్నారో అర్థంకాని స్థితి నెలకొందని వాపోతున్నారు. సబ్‌డివిజన్ అవార్డు జారీ అయిన నేపథ్యంలో నష్టపరి హారం తదితర అంశాలపై బుధవారం మండలంలోని ఉప్పుటూరు పంచాయితీ కార్యాలయం వద్ద సంబధిత రైతులతో బాపట్ల ఆర్డీవో గ్లోరియా, తహసీల్దార్ పి.బ్రహ్మయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమి కోల్పోయిన బాధితులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణంలో తమ భూమి ఎంత పోతుందో చెప్పలేని స్థితిలో అధికారులు ఉండటం ఏమిటని ప్రశ్నించారు.
స్థలాలకు వ్యవసాయ భూమిగానే పరిహారం
వ్యవసాయేతర అవసరా లకు స్థలాలుగా తాము భూములను కొనుగోలు చేశామని, పరిహారం మాత్రం వ్యవసాయ భూమిగా పరిహారం ప్రకటిస్తున్నారని కొంతమంది రైతులు ఆవేదన చెందుతున్నారు. లేఅవుట్ వేసిన వ్యక్తులు వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేయ కుండా తమకు విక్రమించి మోసం చేశారని ఇలా అయితే తాము తీవ్రంగా నష్టపోతామని అధికారుల ముందు బాదితులు కన్నీటి పర్యంతమయ్యారు. తాము స్థలాలుగా కొనుగోలు చేసిన విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వ్యవసాయేతర భూమిగా పరిగణించి ఆదుకోవాలని ఆర్డీవోను కోరారు.