మైనర్ కాలువ ఆక్రమించి వెంచర్
ABN , Publish Date - Feb 19 , 2026 | 02:28 AM
సాగునీటి కాలువను ఆక్రమించి వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పంట పొలాలకు నీరు ఎలా చేరుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం సాగునీటి కాలువలు ఉన్న ప్రాంతాలలో ముందస్తు అనుమతులు తీసుకోకుండా వెంచర్‌లు, నిర్మాణాలు చేయకూడదు.
నిబంధనలు బేఖాతర్
అధికారుల తీరుపై అనుమానాలు
సాగునీటి ప్రవాహం ఎలా అన్న ఆందోళనలో రైతులు
అద్దంకి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : సాగునీటి కాలువను ఆక్రమించి వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పంట పొలాలకు నీరు ఎలా చేరుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం సాగునీటి కాలువలు ఉన్న ప్రాంతాలలో ముందస్తు అనుమతులు తీసుకోకుండా వెంచర్‌లు, నిర్మాణాలు చేయకూడదు. అవేమీ పట్టించుకోకుండా వెంచర్‌ను వేస్తున్నప్పటికీ అధికారులు మిన్నకుండటం విమర్శలకు తావిస్తోంది. అద్దంకి మండలంలోని రామాయపాలెం రెవెన్యూ పరిధిలో అద్దంకి-దర్శి రోడ్డు వెంబడి ఇటుక బట్టీ సమీపంలో కొత్తగా వెంచర్ ఏర్పాటు చేస్తు న్నారు. పచ్చని పొలంలో పంట యథావిధిగా ఉంచి వెంచర్‌కు అవసరమైన రోడ్డు, సైడ్ డ్రైన్‌లు నిర్మిస్తున్నారు. వెంచర్ మధ్యలో గుండా మోదేపల్లి మేజర్‌లో తిమ్మాయపాలెం పొలాలకు వచ్చే ఎల్-2 మైనర్ కాలువ ఉంది. వెంచర్‌లో వేసే అంతర్గత రోడ్లతో మైనర్ కాలువ, డ్రాప్‌లు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే కాలువ ఉండే ప్రాంతంలో గ్రావెల్ రోడ్ల నిర్మాణం పూర్తయింది. సాగునీటి కాలువలు ఉన్న చోట రెవెన్యూ, పంచాయతీ అధికారులు వెంచర్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అధికారుల మీనమేషాలు
మైనర్ కాలువను ఆక్రమించి యథేచ్ఛగా వెంచర్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఎన్‌ఎస్‌పీ అధికారులు మీనమేషాలు లెక్కించడాన్ని రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గతంలో మోదేపల్లి మేజర్ చివరి ఆయకట్టుకు దశాబ్దాల తరబడి నీటి విడుదల జరగకపోవడంతో కాలువలు ఆక్రమణలకు గురవుతున్నా రైతులు పెద్దగా పట్టించుకోలేదు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్‌శాఖ మంత్రి రవికుమార్ ప్రత్యేక దృష్టి సారించి చివరి ఆయకట్టుకు నీటి విడుదల జరిగేలా కృషి చేశారు. దీంతో భవిష్యత్‌లో కూడా మెట్ట పంటలకు సాగునీరు సరఫరా జరుగుతుందనే భరోసా రైతులకు కలిగింది. ప్రస్తుతం మైనర్ కాలువను పూర్తిగా ఆక్రమించి వెంచర్ వేచి రోడ్లు నిర్మిస్తున్నందున సాగునీటి సరఫరాకు అవకాశం ఉండదు. దీంతో పంట పొలాలు బీడు భూములుగా మారే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మైనర్ కాలువ ఆ క్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టడంతోపాటు కాలువ పునరుద్ధరించి సాగునీటి ప్రవాహం జరిగేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.