Share News

వెలిగొండ పనులు ‘రన్‌’

ABN , Publish Date - Aug 12 , 2026 | 02:03 AM

వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 22న ట్రయల్‌ రన్‌కు ముహూర్తం ఖరారు చేసింది. ఈమేరకు జలవనరుల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు అందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు.

వెలిగొండ పనులు ‘రన్‌’
ఇడుపూరు-2 పునరావాస కాలనీలో ప్లాట్లను శుభ్రం చేస్తున్న డోజర్‌

మొదటి టన్నెల్‌ రెడీ

పునరావాసంపై ప్రధాన దృష్టి

నిర్వాసితుల కోసం సిద్ధమవుతున్న కాలనీలు

ప్లాట్ల కేటాయింపునకు కసరత్తు

రంగంలోకి 11 ప్రత్యేక బృందాలు

వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 22న ట్రయల్‌ రన్‌కు ముహూర్తం ఖరారు చేసింది. ఈమేరకు జలవనరుల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు అందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్‌ పనుల పూర్తితోపాటు పునరావాస చర్యల్లో వేగం పెంచారు. ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి సారించారు. నిర్వాసితులకు పరిహారం అందజేత, ప్లాట్ల కేటాయింపు, పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆయా గ్రామాల వారిని కాలనీలకు తరలింపు చర్యలను చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ పరిణామాలతో జిల్లా వాసులు మురిసిపోతున్నారు.

మార్కాపురం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి నిర్వాసితులదే ప్రధాన సమస్యగా మారింది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పెండింగ్‌ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోంది. అధికారులు కూడా ముంపు గ్రామాల ప్రజలను త్వరితగతిన పునరావాస కాలనీలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు. 11 ముంపు గ్రామాల నిర్వాసితులకు ఏడు ప్రాంతాల్లో గతంలోనే పునరావాస కాలనీల కోసం భూమిని సేకరించి ప్లాట్లు వేశారు. ఒందుట్ల, వేములకోట, ఇడుపూరు-1, 2, తోకపల్లి, దేవరాజుగట్టు, గోగులదిన్నె వద్ద ఇవి ఉన్నాయి. వాటిలో కొన్నిచోట్ల సామాజిక భవనాలను అప్పట్లోనే నిర్మించారు. మౌలిక వసతులకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. పునరావాస కాలనీలను గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తిగా వదిలేయడంతో అప్పటికే నిర్మించిన కొన్ని సామాజిక భవనాలు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతుల పనులన్నీ పాడైపోయాయి. కాలనీలు చిల్లచెట్లతో చిట్టడవిలా మారాయి. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఒకవైపు ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్‌ పనులు చేస్తూనే పునరావాస కాలనీలపై దృష్టి సారించింది. నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంతోపాటు కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు నడుం బిగించింది. అధికారులు ఇప్పు డు ఈ కాలనీలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

ప్లాట్ల కేటాయింపుపై దృష్టి

ఏళ్ల క్రితమే పునరావాస కాలనీలను ఏర్పాటు చేసినప్పటికీ ముంపు ప్రజలకు పూర్తి స్థాయిలో ప్లాట్లు కేటాయించలేదు. మొత్తం 7,231 మంది నిర్వాసితుల్లో వన్‌టైం సెటిల్‌మెంట్‌ ద్వారా పరిహారం పొందిన వారు, ఇప్పటికే ప్లాట్లు తీసుకున్న వారుపోగా మిగిలిన వారికి స్థలాల కేటాయింపు పెండింగ్‌లో ఉంది. మొత్తం కాలనీల్లో 4,803 ప్లాట్లు ఉండగా అందులో 3,961 కేటాయించాల్సి ఉంది. దేవరాజుగట్టు వద్ద పునరావాస కాలనీలో మొత్తం 746 ప్లాట్లు ఉన్నాయి. అక్కడ కేటాయించిన గుండంచర్ల నిర్వాసితులకు ఇంకా 46 ప్లాట్లు తగ్గుతున్నట్టు తెలుస్తోంది. వీరికోసం ఇప్పుడు భూసేకరణ చేసి త్వరతిగతిన స్థలాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కాలనీల్లో పెరిగిపోయిన చెట్లను తొలగిస్తున్నారు. ఇప్పుడు అవన్నీ శుభ్రమై కనిపిస్తున్నాయి. త్వరితగతిన ప్లాట్ల కేటాయింపు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

గ్రామాల్లో అధికారుల బృందాల పర్యటనలు

ముంపు గ్రామాల నుంచి వస్తున్న వినతులు, ఇంకా అవార్డులో చేరని పేర్లు, ఇప్పటివరకు గుర్తించకుండా ఉన్న అర్హులైన వారి వివరాలన్నీ సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈపనుల కోసం మొత్తం 11 ప్రత్యేక బృందాలను మార్కాపురం కలెక్టర్‌ విజయసునీత ఏర్పాటు చేశారు. ఆ బృందాలు గ్రామాల్లో పర్యటిస్తున్నాయి. ప్రతిరోజూ కలెక్టర్‌ సమీక్షిస్తున్నారు. మొత్తానికి వెలిగొండ ట్రయల్‌ రన్‌ నాటికి పరిహారం విడుదలతోపాటు నిర్వాసితుల తరలింపు జరగాల్సి వచ్చినా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే దిశగా అధికారులు సిద్ధమవుతున్నారు.

పెండింగ్‌ పనులు చకచకా..

వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన తొలి దశ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. దీంతో మొదటి టన్నెల్‌ ద్వారా నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టన్నెల్‌-1లో లైనింగ్‌ పనులు చేస్తున్న యంత్రం ఉన్న ప్రాంతంలో దాదాపు 15 మీటర్ల లైనింగ్‌ మిగిలి ఉండగా దాన్ని కూడా వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతానికి టన్నెల్‌-1ను మాత్రమే వినియోగంలోకి తెస్తున్నప్పటికీ దాని వలన టన్నెల్‌-2లో పనులకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. టన్నెల్‌-2లో 11వ కి.మీ వద్ద బోరింగ్‌ మిషన్‌ గతంలోనే నిలిచిపోయింది. దాన్ని దాటి ముందుకు వెళ్లి పనులు చేయడానికి ఆటంకం ఏర్పడింది. టన్నెల్‌-1కు కొన్ని చోట్ల రంధ్రాలు వేసి అందులో నుంచి వెళ్లి టన్నెల్‌-2లో పనులు చేస్తున్నారు. ప్రస్తుతం టన్నెల్‌-1 ద్వారా నీరు విడుదల చేస్తున్న ప్పటికీ టన్నెల్‌-2లోకి కూడా కొంత మేర చేరే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం టన్నెల్‌-2లో వినియోగిస్తున్న విద్యుత్‌ వ్యవస్థను తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. టన్నెల్‌-2లో మొత్తం 6 ట్రాన్స్‌ఫార్మర్‌లు ఉన్నాయి. వాటిని బయటకు తీసుకురావాలి. మరోవైపు టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం) తొలగింపు పనులు కూడా దాదాపు 70శాతం పైనే పూర్తయ్యాయి. మిగిలి వాటిని కూడా వేగంగా తొలగిస్తున్నారు. టన్నెల్‌-2లో 265 మీటర్లు లైనింగ్‌ పూర్తి కావాల్సి ఉండగా దానిని కూడా చకచకా చేస్తున్నారు. రోజుకు 15 నుంచి 25 మీటర్ల మేర లైనింగ్‌ పూర్తవుతుందని ఇంజనీరింగ్‌ అధికారులు చెప్పారు.

Updated Date - Aug 12 , 2026 | 02:04 AM