Share News

వెలిగొండ పనుల్లో వేగం పెంచాలి

ABN , Publish Date - Apr 08 , 2026 | 03:08 AM

వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం నిర్దేశించిన సమయం ఆసన్నమవుతోంది. నాణ్యతను పాటిస్తూ వేగంగా పనులు పూర్తి చేయండి. ఎట్టి పరిస్థితిల్లో ఈ ఏడాది జూన్‌కు నీటిని విడుదల చేయాలన్న కృతనిశ్ఛయంతో ఉన్నాం. అందుకు అనుగుణంగా ముందుకు సాగండి’ అని జలనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు.

వెలిగొండ పనుల్లో వేగం పెంచాలి
ఫీడర్‌ కాలువ కాంక్రీట్‌ పనులను పరిశీలిస్తున్న మంత్రి నిమ్మల, పక్కన ఎమ్మెల్యేలు కందుల, ముత్తుముల, టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశం

పెద్దదోర్నాల, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : ‘వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం నిర్దేశించిన సమయం ఆసన్నమవుతోంది. నాణ్యతను పాటిస్తూ వేగంగా పనులు పూర్తి చేయండి. ఎట్టి పరిస్థితిల్లో ఈ ఏడాది జూన్‌కు నీటిని విడుదల చేయాలన్న కృతనిశ్ఛయంతో ఉన్నాం. అందుకు అనుగుణంగా ముందుకు సాగండి’ అని జలనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం కలెక్టర్‌ విజయసునీత, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి శ్రీశైలం డ్యాం వెనుక భాగం నుంచి కృష్ణానదిపై బోటులో ప్రయాణించి కొల్లంవాగు ప్రాంతం వద్ద హెడ్‌ రెగ్యులేటరీ పనులను పరిశీలించారు. అక్కడి నుంచి సొరంగ మార్గంలో కొంత దూరం కాలినడకన వెళ్లి లైనింగ్‌ పనులను చూశారు. అనంతరం టన్నెల్‌ లోపల 18.8 కి.మీ దూరం ప్రత్యేక వాహనంలో ప్రయాణించి దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో బయటకు వచ్చారు. ఫీడర్‌ కెనాల్‌ పనులను సందర్శించారు. ఆతర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఏడాది జూన్‌ నాటికి నల్లమల సాగర్‌కు వెలిగొండ ద్వారా కృష్ణా నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం నిర్దేశించారన్నారు. ఆ మేరకు పనులపై వారంవారం సమీక్షిస్తున్నారని తెలిపారు. పోలవరం తర్వాత అత్యంత ప్రాధాన్యతాక్రమంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు చేస్తున్నామని చెప్పారు. హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు 70 శాతం పూర్తయ్యాయని, మే ఆఖరుకు మిగిలినవి పూర్త్తయ్యేలా ఆదేశించామన్నారు. టన్నెల్‌-1లో లక్షా 20వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి తొలగింపునకు చర్యలు చేపట్టామని చెప్పారు. టన్నెల్‌-2లో 2.3 కిలోమీటఠ్ల దూరం లైనింగ్‌ మిగిలి ఉందని, రోజుకు 600మీటర్ల పనులు జరిగేలా దిశానిర్దేశం చేశామన్నారు. త్వరలోనే ఉమ్మడిప్రకాశం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు.

టీబీఎం తొలగింపునకు చర్యలు

టన్నెల్‌-2లో 11.5 కిలో మీటర్‌ వద్ద ఉన్న టీబీఎంను సాంకేతిక అడ్డంకులు అధిగమించి తొలగించే ప్రక్రియను చేపట్టామని మంత్రి నిమ్మల తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన చిన్నపాటి వర్షానికే ఫీడర్‌ కెనాల్‌కు గండ్లు పడ్డాయన్నారు. ప్రస్తుత ప్రజాప్రభుత్వంలో రూ.460కోట్లతో ఫీడర్‌ కాలువను పటిష్ట పరుస్తున్నామన్నారు. 5.3 కిలోమీటర్లు కాంక్రీట్‌ వాల్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం రూ.900కోట్లు జూన్‌లోపు అంచెలంచెలుగా అందజేస్తామని చెప్పారు. ప్రజాప్రభుత్వం వచ్చాక 20 నెలల్లోనే పెండింగ్‌ బిల్లులు రూ.1,200కోట్లు ఇచ్చామన్నారు. ఇంకా రూ.2,600కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఇన్ని పెండింగ్‌ పనులు ఉన్నప్పటికీ ప్రాజెక్టును పూర్తి చేసినట్లు చెప్పి అబద్ధాలకు అంబాసిడర్‌ అయిన జగన్‌రెడ్డి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకొని మంచి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, ప్రాజెక్టు సీఈ రమేష్‌, ఎ్‌సఈ అబూతలీం, డీఈ కృష్ణారెడ్డి, ఫీడర్‌ కెనాల్‌ నిర్మాణ సంస్థ ఎండీ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు షేక్‌మాబు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2026 | 03:08 AM