Share News

‘నీరు’పయోగం

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:33 AM

శింగరకొండపాలెం ఎత్తిపోతల పథకం దశాబ్దకాలంగా నిరుపయోగంగా ఉంది. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ఈ పథకం ఏర్పాటుచేశారు.

‘నీరు’పయోగం
చిల్లచెట్ల మధ్య ఉన్న శింగరకొండపాలెం ఎత్తిపోతల పథకం

శింగరకొండపాలెం ఎత్తిపోతల పథకం మూలకు

దశాబ్దకాలంగా నీటి విడుదలకు నోచుకోని వైనం

చిట్టడవిని తలపించేలా పథక ప్రాంగణం

అద్దంకి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి) : శింగరకొండపాలెం ఎత్తిపోతల పథకం దశాబ్దకాలంగా నిరుపయోగంగా ఉంది. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ఈ పథకం ఏర్పాటుచేశారు. అద్దంకి మేజర్‌ కాలువ చివరి ఆయకట్టులో ఉన్న మండలంలోని శింగరకొండపాలెం, కలవకూరు, బొమ్మనంపాడు, గోపాలపురం, అద్దంకి, వేలమూరిపాడు, మణికేశ్వరం తదితర గ్రామాలలోని 3,229 ఎకరాల ఆయకట్టుకు స్థిరంగా నీరందించాలన్న లక్ష్యంతో ఈపథకాన్ని నిర్మించారు. పథక ప్రారంభంలో ఆయకట్టులోని మెట్ట పంటలకు సాగు నీరు పుష్కలంగా సరఫరా అయ్యింది. రెండు దశాబ్దాల కాలం నుంచి తరచూ మరమ్మతుల పాలవుతుంది. ఈక్రమంలో మూలకు చేరింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సుమారు రూ.70 లక్షలు వెచ్చించి కొత్త విద్యుత్‌ మోటార్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటుచేశారు.

తుదిదశకు వచ్చిన పథకాన్ని మూలకునెట్టిన వైసీపీ ప్రభుత్వం

ఎత్తిపోతల పథకం నుంచి అద్దంకి మేజర్‌ కాలువ వరకు నీటి పంపింగ్‌కు వేసిన పైప్‌లైన్‌ల లీకులతో ట్రయల్‌ రన్‌ సమయంలో స్వల్ప మరమ్మతులపాలైంది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో పథక మరమ్మతులకు కనీసం చిల్లిగవ్వ కూడా విడుదల చేయకపోవటంతో నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో ఎత్తిపోతల పథకానికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి పూర్వవైభవం తీసుకువస్తారని రైతులు ఆశిస్తున్నారు.


భవనాసి రిజర్వాయర్‌ నిర్మాణంతో పథకానికి ముప్పు

విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పలుసార్లు ఐడీసీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి అంచనాలు తయారుచేయించారు. ప్రభుత్వం నుంచినిధుల విడుదల ఆలస్యం కావటంతో మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఎత్తిపోతల పథకం ప్రాంగణమంతా చిట్లడవిని తలపించేలా మారింది. భవనాసి చెరువును రిజర్వాయర్‌గా మారుస్తున్న నేపథ్యంలో శింగరకొండ ఎత్తిపోతల పథకం ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఈ పథకాన్ని ఎత్తులో నిర్మించే విధంగా రూపకల్పన చేసి నిధులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.

నీటి లభ్యత ఏడాది పొడవున ఉండే అవకాశం ఉండటంతోపాటు అద్దంకి మేజర్‌ కాలువ ఇటీవల వరకు అద్దంకి పట్టణంలో ఆక్రమణలతో నీటి పారుదలకు కూడా అవకాశం లేకుండా పోయింది. అద్దంకి మేజర్‌ కాలువను మినీ బైపా్‌సగా మార్చే క్రమంలో ఇప్పటికే ఆక్రమణలు తొలగింపు జరగటంతో దిగువ ఆయకట్టుకు నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగిపోయాయి. మరమ్మతులకు నిధులు మంజూరై పనులు పూర్తయితే ఆయకట్టులో ఏడాది పొడవునా మెట్ట పంటల సాగుకు అవకాశం ఏర్పడుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Feb 07 , 2026 | 12:33 AM