కోలాహలం
ABN , Publish Date - Oct 18 , 2026 | 03:12 AM
అర్బన్ స్థానిక సంస్థల ఎన్నికలకు తొలిరోజు కేవలం రెండు నామినేషన్లు మాత్రమే రాగా రెండో రోజైన శనివారం భారీగా దాఖలయ్యాయి. పలుచోట్ల కోలాహలం నెలకొంది. అభ్యర్థులు ఎక్కువసంఖ్యలో హాజరై నామినేషన్ పత్రాలు సమర్పించారు.
మున్సిపోల్స్కు రెండోరోజు జోరుగా నామినేషన్లు
అద్దంకిలో భారీ ర్యాలీతో టీడీపీ చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్ దాఖలు
ఒంగోలు కార్పొరేషన్లో డివిజన్లకు 118,
మూడు మున్సిపాల్టీల్లో వార్డులకు 107 నామినేషన్లు
నేటితో ముగియనున్న గడువు 8 చివరి రోజు మరిన్ని పడే అవకాశం
ఒంగోలు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : అర్బన్ స్థానిక సంస్థల ఎన్నికలకు తొలిరోజు కేవలం రెండు నామినేషన్లు మాత్రమే రాగా రెండో రోజైన శనివారం భారీగా దాఖలయ్యాయి. పలుచోట్ల కోలాహలం నెలకొంది. అభ్యర్థులు ఎక్కువసంఖ్యలో హాజరై నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఒంగోలు కార్పొరేషన్తో పాటు అద్దంకి, దర్శి, చీమకుర్తి మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఒంగోలులో మేయర్తోపాటు 62 కార్పొరేటర్ల పదవులు ఉన్నాయి. అలాగే మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలతోపాటు 88 వార్డు కౌన్సిలర్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు నామినేషన్లకు గడువు ఇవ్వగా తొలిరోజైన శుక్రవారం చీమకుర్తిలో ఒకటి, ఒంగోలులో మరొకటి కలిపి రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి.
మంచి రోజు కావడంతో...
రెండో రోజైన శనివారం భారీగా అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లకు గడువు తక్కువగా ఉండటమే కాగా శనివారం మంచి రోజు కావడంతో భారీగా అభ్యర్థులు పత్రాలను సమర్పించారు. పలుచోట్ల ఉత్సాహంగా కార్యక్రమం సాగింది. అన్ని పదవులకు కలిపి 225 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒంగోలు కార్పొరేషన్లో మేయర్ పదవికి నాలుగు, కార్పొరేటర్ పదవులకు 114 అందాయి. అద్దంకి మున్సిపాలిటీలో చైర్మన్ పదవికి ఐదుగురు, కౌన్సిలర్ పదవులకు 37 మంది నామినేషన్లు వేశారు. దర్శి మున్సిపాలిటీలో చైర్మన్ పదవికి మూడు, వార్డులకు 14 నామినేషన్లు దాఖలయ్యాయి. చీమకుర్తిలో చైర్మన్ స్థానానికి ముగ్గురు, కౌన్సిలర్ పదవులకు 45 మంది నామినేషన్లు సమర్పించారు. అద్దంకిలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్ భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సొంత ప్రాంతమైన కాకానిపాలెంతోపాటు పట్టణంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్దసంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అక్కడ వైసీపీ అభ్యర్థి సురేష్ కూడా నామినేషన్ వేశారు. ఇదిలా ఉండగా ఆదివారం నామినేషన్లకు తుదిగడువు కావడంతో మరింత భారీగా దాఖలు కానున్నాయి.